దిశ దశ, ఏపీ బ్యూరో:
ఎట్టకేలకు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. స్టార్ క్యాంపేనర్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం బరిలో దిగనున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత ఏపీ రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలే లేకపోలేదు. ఇప్పటికే షర్మిల అనుచరులుగా ఉన్న వైఎస్సార్సీపీ నాయకులు బయటకు వస్తున్న సంగతి తెలిసిందే. షర్మిల ఇప్పటికే తన వర్గానికి చెందిన క్యాడర్ తో ప్రత్యేకంగా సమావేశమై కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై గురించి స్పష్టత కూడా ఇచ్చేశారు. దీంతో ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో కూడా కొంతమేర ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదున్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రత్యర్థులుగా…
ఏపీ రాజకీయాల్లో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారిపోయారు. అయితే తెలంగాణ రాజకీయాల్లో షర్మిల అంతగా ప్రభావం చూపే అవకాశాలు లేవన్న విషయాన్ని గమనించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆమెకు అంతగా ప్రాధాన్యత కల్పించలేదు. ఏపీలో ఇమేజ్ ఉంటుందని అంచనా వేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షర్మిలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దీంతో ఆమె స్టార్ క్యాంపేనర్ బాధ్యతలు కూడా అప్పగించనున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో అందరి దృష్టి అన్నా చెల్లెల్లపైనే ఉండనుంది. వైసీపీ అధినేత జగన్ మరో్ సారి అధికారంలోకి రావాలన్న సంకల్పంతో పావులు కదుపుతుండగా ఆయనకు ఇంటిపోరు తప్పేలా లేదని స్ఫష్టం అవుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్, షర్మిలలు ప్రత్యర్థి పార్టీల నాయుకులగా ప్రచారంలో మునిగిపోనున్నారు. దీనివల్ల ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వేర్వేరు పార్టీల తరుపున క్యాంపేన్ నిర్వహిస్తూ అభ్యర్థులను గెలిపించుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగనున్నారు.
అధికారంతో దూరమై…
తండ్రి మరణం తరువాత జగన్, షర్మిలలు ఒకే మాట ఒకే నినాదం అన్నట్టుగానే వ్యవహరించారు. ఏఐసీసీ అధిష్టానంతో పోరాటం చేసే విషయంలో అయినా, ఓదార్పు యాత్ర కొనసాగించే విషయంలో అయినా షర్మిల జగన్ కు అండగా నిలిచారు. అయితే 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల తరువాత క్రమక్రమంగా తెరమరుగవుతూ వచ్చిన షర్మిల చివరకు తెలంగాణలో రాజకీయాలను నెరపాలని ప్రయత్నించారు. కానీ అనుకున్నంత మేర సానుకూల వాతావరణం ఏర్పడలేదు. ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేందుకు షర్మిల నిర్ణయించుకున్నారు. ఒకప్పుడు అన్న అభ్యున్నతి కోసం కష్టపడిన సోదరి రానున్న ఎన్నికల్లో ఆయన ఓటమే లక్ష్యంగా పనిచేయాల్సిన పరిస్థితికి చేరారు.