కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదుల పరంపరలో అసలు ట్విస్ట్… అధిష్టానానికి ఫిర్యాదు చేసిన పురుమల్ల

దిశ, దశ, కరీంనగర్:

కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. గురువారం ఉదయం వెలుగులోకి వచ్చిన షోకాజ్ నోటీసు తరువాత కాంగ్రెస్ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుల గురించి కూడా వెలుగులోకి వచ్చింది. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో ఇరు వర్గాలకు కూడా అధిష్టానం నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది.

రూ. కోటి అడిగాడు…

నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి రూ. కోటి ఇవ్వాలని ఎన్నికలప్పుడు అడిగారని దీంతో తాను రూ. 20 లక్షలు ఓ ప్రజాప్రతినిధి సమక్షంలో ఇచ్చానని, మిగతా డబ్బులు తరువాత ఇస్తానని మాట ఇచ్చాని పురుమల్ల శ్రీనివాస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఎన్నికల్లో టికెట్ ఆశించిన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మెనేని రోహిత్ రావులు తన ఓటమి కోసం ప్రయత్నించారని కూడా ఆరోపించారు. ఎన్నికల తరువాత కూడా తనను విస్మరిస్తున్నారని శ్రీనివాస్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిబ్రవరి 1న ఇచ్చినట్టుగా ఉన్న ఈ ఫిర్యాదు గురువారం సాయంత్రం నుండి వైరల్ అవుతుండడంతో సరికొత్త చర్చకు దారి తీసింది. అయితే ఇప్పటి వరకు శ్రీనివాస్ పైనే ఫిర్యాదు చేశారని ఆయనకు మాత్రమే నోటీసులు వచ్చాయని భావించారంతా. కానీ అప్పటికే శ్రీనివాస్ కూడా ఫిర్యాదు చేశారని ఇందుకు సంబంధించిన నోటీసులు కూడా జారీ కాగా అదిష్టానానికి సంజాయిషీ కూడా ఇచ్చుకున్నారని పురుమల్ల శ్రీనివాస్ వర్గం చెప్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరాటాలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చినట్టయింది. గత ఎన్నికల్లో కరీంనగర్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన ఆశావాహులు, అభ్యర్థి మధ్య కంప్లైట్ల రాజకీయాలు సాగుతుండడం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

You cannot copy content of this page