వలస నేతల మధ్య వార్…?!

ఖమ్మం గుమ్మంలో పోరు…

ఖమ్మం గుమ్మంలో గులాభి పార్టీలో మరోసారి గ్రూపు రాజకీయాలు వెలుగులోకి వచ్చాయా..? ముఖ్య నేతల వ్యూహాల నడుమ పార్టీ అంతర్గత గ్రూపులు వెలుగులోకి వస్తున్నాయా..? పసుపును వీడి గులాభి పంచన చేరిన ఆ ఇద్దరు నాయకుల మధ్య నెలకొన్న కోల్డ్ వార్ ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యలతో బహిర్గతం అయ్యాయా..? ఇంతకీ ఆ జిల్లాలో ఏం జరుగుతోంది…?

గుచ్చుకుంటున్న ముల్లు

అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య నెలకొన్న ఈ విబేధాలు రచ్చకెక్కడం ఖమ్మం జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. ఓ వైపున టీడీపీ గత వైభవం కోసం ఉవ్విళ్లూరుతూ ఖమ్మం జిల్లాలోని తన పట్టు నిరూపించుకునే ప్రయత్నం చేసింది. మరో వైపున బీజేపీ కూడా పాగా వేసేందుకు చాపకింద నీరులా వ్యవహరిస్తోంది. వైఎస్సార్టీపీ అధినేత్రి దృష్టి కూడా ఇదే జిల్లాపై ప్రత్యేకంగా ఉంది. పొత్తు కలిసిన కామ్రెడ్స్ కూడా పూర్వ వైభవం చాటుకునే పనిలో పడింది. అన్ని పార్టీలకు కూడా ఖమ్మం జిల్లానే టార్గెట్ గా మారిందన్నది వాస్తవం. ఖమ్మంలో బలహీనంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికలప్పటి నుండి బలపడేందుకు ఎన్నో వ్యూహాలకు పదును పెట్టింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రత్యర్థి పార్టీలకు ప్రాతినిథ్యం లేకుండా చేయాలని కూడా ప్రయత్నించి దాదాపుగా సక్సెస్ అయింది కూడా. ఇదే క్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా టీడీపీని వీడి బీఆరెఎస్ పార్టీలో చేరారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు గులాభి పార్టీలో కలకలం సృష్టిస్తుంటే రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారి తీశాయి.

సండ్ర మాటల వెనక…?

అయితే సండ్ర వెంకటవీరయ్య చేసిన వ్యాఖ్యల వెనక మర్మం ఏంటన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. తనను టీడీపీలో అణగదొక్కారని, గతంలో జిల్లా నుండి ప్రాతినిథ్యం వహించిన నాయకులు అభివృద్ది చేయలేదని తాను ఏనాడు వ్యాఖ్యానించలేదని కూడా ఆయన అన్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకుంటున్నారని, మాకు లేరా సోషల్ మీడియా సైన్యం అంటూ కూడా సత్తుపల్లి ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలపై కూడా ఇంటా బయటా చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల కాలంలో ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ సమీకరణాలు పెద్ద ఎత్తున మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సండ్ర చేసిన వ్యాఖ్యలు సమీకరణాలు మారుతున్నాయన్న ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి. ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడడం మాట అటుంచితే సండ్ర వెంకటవీరయ్య బాహాటంగా ఈ కామెంట్లు చేసే పరిస్థితి రావడానికి కారణాలు ఏంటోనన్న విషయం ఆలోచించాలి.

వార్ మొదలైందా..?

ఈ జిల్లాలో పార్టీతో అనుభందం పెనవేసుకున్న నాయకులకంటే ఎక్కువగా తెలంగాణ ఆవిర్భావం తరువాత గులాభి పంచన చేరిన వారే ఎక్కువ. ఇతర పార్టీల నుండి వలస వచ్చిన నాయకుల మధ్యే అభిప్రాయబేధాలు బహిర్గతం అవుతుండడం గమనార్హం. ఈ సారి ముఖ్యంగా టీడీపీ నుండి బీఆర్ఎస్ లో చేరిన నేతల మధ్య వార్ స్టార్ట్ అయినట్టు స్ఫష్టం అవుతోంది. ఇప్పటికే ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ముఖ్య నాయకుల మధ్య వర్గపోరు నడుస్తుండగా, మాజీ ఎంపీ పొంగులేటి భవిష్యత్తు కూడా ఆగమ్యగోచరంగానే మారింది. ఆయన బీజేపీలో చేరుతారని కొన్నాళ్లు, గులాభి కండువాను వదిలేస్తారని మరికొన్నాళ్లు ప్రచారం జరుగుతూనే ఉంది. తాజాగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర చేసిన వ్యాఖ్యలతో ఖమ్మం బీఆర్ఎస్ లో మరో వర్గం తెరపైకి వస్తోందన్న డిస్కషన్ కూడా సాగుతోంది. కొన్ని నెలల్లో ఎన్నికల సమరాంగానికి సిద్దం అవతున్న బీఆర్ఎస్ పార్టీకి ఖమ్మంలో నెలకొన్న పరిణామాలు ఇబ్బందికరమేనని చెప్పక తప్పదు. జాతీయ పార్టీగా ఆవిర్భవించి పొరుగు రాష్ట్రంలో పట్టు నిలుకునే ప్రయత్నంలో ఉన్న ఈ సమయంలో ఖమ్మంలో మారిన పొలిటికల్ సీన్ ఎఫెక్ట్ పొరుగు రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఆటంకంగా మారే అవకాశం కూడా లేకపోలేదు. ఖమ్మం గ్రూప్ పాలిటిక్స్ విషయంలో బీఆర్ఎస్ అధినేత ఎలాంటి వ్యూహాలతో చెక్ పెడ్తారోనన్నది వేచి చూడాలి మరి.
ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఏం మాట్లాడారో మీరూ వినండి…
https://www.youtube.com/watch?v=atpPgt0SfMg

You cannot copy content of this page