లీకులు అక్కడే… ట్యాపింగ్ అక్కడే…

ఉమ్మడి వరంగల్ జిల్లాపై సర్వత్రా చర్చ

అధికారుల తీరుపై విమర్శల వెల్లువ…

దిశ దశ, వరంగల్:

రాష్ట్రంలో సంచలనంగా మారుతున్న వ్యవహారాలకు వరంగల్ జిల్లా కేరాఫ్ అడ్రస్ గా మారిందా..? చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంలో ఈ జిల్లా అధికారుల పాత్ర ఉందా..? రహస్యంగా ఉంచాల్సిన విషయాలను రచ్చ చేశారా..? రహస్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలకు పాల్పడి చట్టాన్ని ఉల్లంఘించారా..? ఇప్పుడిదే టాపిక్ సాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే విప్లవ పోరాటాలకు… చైతన్యాన్ని ప్రదర్శించడంలో కీలక పాత్ర పోషించేది. అటువంటి వరంగల్ ఖిల్లాలో అధికారులే కేంద్ర బిందువుగా మారి ఆరోఫణలు వస్తుండడం సంచలనంగా మారింది…

లీకులపై అలా…

ఇటీవల హుజురాబాద్ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీకి సంబంధించిన విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ రెవెన్యూ అధికారులతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్ ను కాదని ఎమ్మెల్సీగా ఉన్న కౌశిక్ రెడ్డి చెక్కుల పంపిణీ వ్యవహారాలు చక్కబెట్టారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా కామెంట్ చేశారు. ప్రొటోకాల్ పక్కనపెట్టి మరీ అప్పటి ప్రభుత్వం ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి వ్యవహరించారని ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయినందున ఆయన ద్వారా చెక్కులు పంపించాల్సిన అవసరం లేదన్నారు. అలాగే ఈ చెక్కులను లబ్దిదారులకు అధికారులే నేరుగా పంచాలని, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండేవిధంగా చూసుకోవాలన్నారు. అయితే ఇందుకు సంబంధించిన ఆడియో లీక్ కావడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ తీరును విమర్శించారు. దీంతో ఆయన అధికారులతో తాను మాట్లాడిన విషయం గురించి రికార్డ్ చేసి మరీ ఆడియోను లీక్ చేశారని పొన్నం ప్రభాకర్ ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై తాను ఫిర్యాదు కూడా చేశానని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ వ్యవహారంపై శాఖపరంగా విచారణ జరిపి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మంత్రి మాట్లాడిన ఆడియో లీక్ చేయడంపై రెవెన్యూ వర్గల్లో కూడా చర్చ సాగుతోంది. ప్రతిపక్ష పార్టీ నేతలకు అనుకూలంగా ఇంకా అధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. అయితే పొన్నం ప్రభాకర్ మంత్రి హోదాలో అలా మాట్లాడడం సరికాదని అంటున్నవారూ లే్కపోలేదు. అయితే అధికార పార్టీ నాయకులు కూడా గత ప్రభుత్వంలో ప్రోటోకాల్ విస్మరించిన సందర్బాలు ఎన్నో ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. అధికారిక కార్యక్రమాల్లో పార్టీ నాయకులను కూడా భాగస్వాములను చేసిన సందర్బాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. అయితే పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు భాగస్వామ్యం ఉంచాలన్నారు కానీ పార్టీ నాయకులను అధికారిక కార్యక్రమాల్లో భాగస్వాములు చేయాలని ఆధేశాలు ఇవ్వలేదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అయితే మంత్రి హోదాలో ప్రోటోకాల్ కు విరుద్దంగా ఆదేశాలు ఇవ్వడం నిభందనలకు విరుద్దమేనని అంటున్నారు కొందరు.

ట్యాపింగ్ పై ఇలా…

మరో వైపున రాష్ట్ర పోలీసు వ్యవస్థను అట్టుడికిస్తున్న సంఘటన పోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఎన్నికల సమయంలో ఈ వ్యవహారాన్ని చక్కబెట్టేందుకు స్పెషల్ ఆఫరేషన్ జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై సమగ్రమైన దర్యాప్తు చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. దీంతో వెలుగులోకి వస్తున్న విషయాలు అంతరినీ ఆశ్యర్యపరుస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేవలం ఎస్ఐబీ కార్యాలయం నుండే సాగలేదని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకంగా వార్ రూమ్స్ ఏర్పాటు చేశారని తేల్చారు పోలీసు అధికారులు. ఇందులో వరంగల్ పోలీసు కమిషనరే్ట్ పరిధిలో కూడా ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశారని ఈ వ్యవహారంలో ఇక్కడే పనిచేస్తున్న ఒకరిద్దరు పోలీసు అధికారుల భాగస్వామ్యం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ పోలీసు అధికారులు ఎవరోనన్న అంశంపై జిల్లా వ్యాప్తంగా కూడా తర్జనభర్జనలు సాగుతున్నాయి. చట్టబద్దంగా వ్యవహరించాల్సిన పోలీసు అధికారులు చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లోనూ పాలు పంచుకున్నారన్న తీరుపై చర్చలు సాగుతున్నాయి. పోలీసు అధికారులను అదుపులోకి తీసుకున్న దర్యాప్తు బృందం ఇప్పటికే విచారిస్తోందన్న ప్రచారం కూడా సాగుతోంది. దీంతో కొంతమంది అధికారులు తమకు ఈ వ్యవహారానికి ఏ మాత్రం సంబంధం లేదన్న సంకేతాలను పంపించాల్సిన అవసరం ఏర్పడింది.

హట్ టాపిక్ గా…

ఓ వైపున క్యాబినెట్ మంత్రి ఆడియో లీక్ విషయంలో సీసీఏ రూల్స్ కు విరుద్దంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఇదే ఉమ్మడి జిల్లాకు చెందిన రెవెన్యూ అధికారులు ఎదుర్కొంటున్నారు. సాక్షాత్తు మంత్రే ఫిర్యాదు చేసినందున రెవెన్యూ అధికారులపై సీసీఏ రూల్స్ కు విరుద్దంగా ఆయన మాట్లాడిన ఆడియో లీక్ చేయడం అనేది నిబంధనలు ఉల్లంఘించినట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వారిని కాన్ఫిడెన్షియల్ విషయాలుగానే పరిగణించాలి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పొక్కనీయకూడదని సీనియర్ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ఆడియో బయటకు వచ్చినందున మంత్రి పొన్నం ప్రభాకర్ విషయంలో తప్పు పట్టే అవకాశాలు ఉన్నప్పటికీ ముందు ఆడియో లీక్ విషయంలో బాధ్యులైన రెవెన్యూ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని తెలుస్తోంది. మరో వైపున ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఉమ్మడి జిల్లాకు చెందిన పోలీసు అధికారుల ప్రమేయం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుండడంతో కీలకమైన రెండు విభాగాల అధికార యంత్రాంగం తీరుపై చర్చనీయాంశంగా మారింది.

You cannot copy content of this page