సంచలనం అవుతున్న ప్రెస్ క్లబ్ బహిరంగ లేఖ…

దిశ దశ, వరంగల్:

వరంగల్ ప్రెస్ క్లబ్ పేరిట వైరల్ అవుతున్న లేఖ సంచలనంగా మారింది. బహిరంగ లేఖలో ప్రస్తావించిన అంశాలు మరో సారి చర్చనీయాంశం అవుతున్నాయి. ప్రెస్ క్లబ్ ఎన్నికల సమయంలో వెలుగులోకి వచ్చిన ఈ విషయాలపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తాజాగా బహిరంగ లేఖ వెలుగులోకి రావడంతో గ్రేటర్ ప్రెస్ క్లబ్ లో ఏం జరుగుతోందన్నదే హాట్ టాపిక్ గా మారింది.

లేఖలోని అంశాలు…

ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ బాడీ పేరిట రాసిన  ఈ బహిరంగ లేఖలో ప్రస్తావించిన అంశాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గత పాలకవర్గ లావాదేవీల సమాచారం ఇతర విషయాలను సభ్యులకు తెలియజేసేందుకు ఈ లేఖ రాస్తున్నట్టుగా పేర్కొన్నారు. 2017 నుండి 2022 వరకు బాధ్యతలు నిర్వర్తించిన కమిటీ  అప్పుడు జరిగిన ఆర్థిక లావాదేవీలకు తామే బాధ్యత వహిస్తామని సభ్యుల ముందే ఒప్పుకోవడంతో ప్రస్తుత కమిటీ మూడు సార్లు లేఖలు రాయడంతో పాటు ఈసీ సమావేశం నుండి నేరుగా ఫోన్ చేసి ఖర్చుల వివరాలు అప్పజెప్పాలని కోరినా ఫలితం లేకుండా పోయిందని ఆ లేఖలో వివరించారు. తమ వద్ద లెక్కలు ఏమీ లేవని చెప్పడమే కాకుండా ఛాయ్ బిస్కట్లకు బిల్లులు ఉంటాయా..? అన్న సమాధానం వచ్చినట్టుగా కూడా అందులో పేర్కొన్నారు. అకౌంట్ల ద్వారా చేసిన లావాదేవీలు ఖచ్చితంగా చూపించాలని ఖరాకండిగా అప్పటి కమిటీకి చెప్పామని పేర్కొన్నారు. అయితే గత పాలకవర్గానికి చెందిన అధ్యక్ష్య కార్యదర్శుల తీరును వివరిస్తూ ఈ లేఖలో ప్రస్తావించిన అంశాలు జర్నలిస్టు వర్గాల్లో సరికొత్త చర్చకు దారి తీస్తున్నాయి. అకౌంటబులిటీ లేకుండా వ్యవహరించిన తీరు, ఐవీఎఫ్ సెంటర్ కు తక్కువ అద్దెకు 15 ఏళ్ల పాటు అగ్రిమెంట్ చేయడం వంటి అంశాలను ఇందులో ప్రస్తావించారు. జర్నలిస్టుల సంక్షేమం పాటుపడాల్సిన కమిటీ ఈ విధంగా వ్యవహరించడం సర్వత్రా చర్చకు దారి తీస్తోంది. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ప్రస్తుత పాలకవర్గం బహిరంగ లేఖలో ప్రస్తావించిన అంశాలు ఇవే.

గౌరవ తుమ్మ శ్రీధర్ రెడ్డి, పెరుమాండ్ల వెంకటేశ్వర్లుకు రాసిన లేఖలోని ముఖ్యాంశాలు

1. వరంగల్ ప్రెస్ క్లబ్ సభ్యత్వం కోసం 640 మందికి పైగా జర్నలిస్టులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అందులో 591మందిని అర్హులుగా గుర్తించారు. మొత్తం సభ్యుల యొక్క దరఖాస్తు ఫారాలు, వారు చెల్లించిన సభ్యత్వ రుసుము వివరాలు.

2. గత పాలకవర్గంలోని మినట్స్ బుక్, ఈసీ తీర్మానాల కాపీలు ఇవ్వాలని కోరాం.

3. ప్రెస్ క్లబ్ యొక్క ఆస్తుల వివరాలు, స్టాకు రిజిస్టర్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం.

4. బ్యాంకు అకౌంట్ బుక్కులు, చెక్కులు, రశీదులు, పాన్ కార్డు వివరాలు ఇవ్వాలని అడిగాం.

5. 2022 డిసెంబరులో జరిగిన జనరల్ బాడీ తీర్మానాలు, సభ్యుల యొక్క సంతకాలతో కూడిన కాపీలను అందించాలని విజ్ఞప్తి చేశాం.

6. భవిఠశ్రీ చిట్ ఫండ్లో ప్రెస్ క్లబ్ సభ్యుల యొక్క దాదాపు 23 లక్షల రూపాయల డబ్బులను నిల్వ ఉంచామని గత జనరల్ బాడీలో సభ్యులకు తెలియజేశారు. అట్టి వివరాలు కావాలని కూడా అడిగాం.

అందులో సభ్యత్వం, దరఖాస్తులు అందజేయకుండా డబ్బులు తీసుకున్న ఖాళీ డూప్లికేట్ రశీదు పుస్తకాలను, బ్యాంకు అకౌంట్ వివరాలను, ఒక చెక్కు లీపు కల చెక్కు బుక్కును, 591 మంది ఐడీ కార్డుల నకలును, కార్పొరేషన్కు కట్టిన ఆస్తి పన్ను రశీదు మాత్రమే కోశాధికారి అమర్ గారి ద్వారా పంపించారు. ఇప్పటి వరకు జనరల్ బాడీ రిజిస్టరు, ఈసీ మినట్స్ బుక్, ఆదాయ, వ్యయ వివరాలు అందించలేదు. గత కమిటీ చేసిన తీర్మానాలు ఏమిటో మాకు తెలియకుండా మేము పాలన సాగించలేని పరిస్థితి ఉంది. గత తీర్మానాలకు వ్యతిరేకంగా ఏమైనా పనులు జరిగితే అందుకు మమ్మల్ని బాధ్యులను చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇంత కాలం ఆలస్యం జరిగినా ఓపికతో భరించాం.

జనరల్ బాడీ సమావేశం రిజిస్టరు, గత కార్యవర్గం నిర్వహించిన ఈసీ మీటింగ్లు, తీర్మానాలు పుస్తకాలు, ఆదాయ వ్యయ వివరాలు, భవితశ్రీ చిట్ ఫండ్కు సంబంధించిన అకౌంట్ వివరాలు, గత కార్యవర్గం పెట్టిన ఖర్చులకు సంబంధించి రశీదులు, జనరల్ బాడీ సందర్భంగా గత అధ్యక్ష, కార్యదర్వుల నివేదిక, ఆదాయ వ్యయాలకు సంబంధించి వివరాలు, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో ఉన్న వస్తువుల జాబితా అందజేయాల్సిందిగా మరోసారి లేఖ ద్వారా వివరాలు అందించాల్సిందిగా కోరడం జరిగింది. కానీ, వారి నుంచి ఎలాంటి జవాబు రాలేదు. కనీసం మేము అధికారికంగా రాసిన లేఖలను తీసుకునేందుకు కూడా ఇష్టపడటం లేదు. అయినా ఓపికతో ఉన్నాం. ఆరు నెలలు గడిచినా ఆ సమాచారం అందించలేదు. అధ్యక్షుల వారి పరిస్థితి ఇలా ఉంటే కనీసం కార్యదర్శి అయినా సానుకూలంగా స్పందిస్తారని ఆశించాం. పెరుమాండ్ల వెంకటేశ్వర్లు గారిని పలుమార్లు లెక్కల వివరాలు అందించాల్సిందిగా కోరడం జరిగింది. తనకు లెక్కలకు సంబంధం లేదని చెప్పి దాదాపు నెలరోజులు ఫోన్ కాల్ ఎత్తకుండా కాలయాపన చేశారు. చివరకు వెంకటేశ్వర్లు గారు వారి పత్రికా ఎడిషన్ ఇన్చార్జి శెంకేసి శంకర్ రావు గారితో అధ్యక్షులు నాగరాజు గారికి ఫోన్ చేయించి వెంకటేశ్వర్లు గారికి క్లబ్ లెక్కలతో సంబంధం లేదని చెప్పడం జరిగింది. 591 మంది సభ్యులకు సంబంధించి లెక్కలు చెప్పక తప్పదని వారితో తేల్చి చెప్పడంతో వారం పదిరోజుల గడువిస్తే పూర్తి సమాచారం అందించే ఏర్పాట్లు చేస్తానని వారు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు శంకర్ రావు గారిపై గౌరవంతో కొద్ది రోజులు ఆగడం జరిగింది. కానీ, వెంకటేశ్వర్లు గారిని అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేకమార్లు అధ్యక్షులు, కార్యదర్శి గారలు ఈ విషయం తేల్చండని ఫోన్లో కోరుతూనే ఉన్నారు. ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీకిదే చివరి అవకాశం అని చెబుతూ తేది 5.07.23న ప్రస్తుత కార్యదర్శి సదయ్య గారు ఫోన్ చేసి ఇంకా కాలయాపన తగదని చెబితే ఈ రోజు వచ్చి క్లబ్లో కలిసి మాట్లాడతానని చెప్పారు. కానీ, వారు మళ్లీ దాట వేసే దోరణి అవలంభించారు.

ప్రెస్ క్లబ్ ఓటర్ల నమోదు సందర్భంగా ఇచ్చిన సభ్యత్వాల ప్రకారం చెల్లించిన నగదు వివరాలు అందలేదు. అలాగే జనరల్ బాడీ సందర్భంగా వేసిన టెంటు అద్దె చెల్లించలేదు. ఎన్నికల సమయంలో దస్రు వద్ద ఉద్దెరగా ఉన్న టీ. డబ్బులు బాకీ ఉంది. ఎన్నికల నిర్వహణ కోసం సామంతుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పడిన బృందానికి దాదాపు రూ.42వేలు ఇవ్వాల్సి ఉందని వారు అడుగుతున్నారు. ఎన్నికల సందర్భంగా నామినేషన్ల ద్వారా వచ్చిన డబ్బులలోనే రూ.67వేలు శ్రీధర్ రెడ్డి గారు తీసుకున్నారని, తమకు రూ.42వేలు రావాల్సి ఉందని వాటిని చెల్లించాలని ఎన్నికల అధికారిగా వ్యవహరించిన శ్రీనివాస్ అడుగుతున్నారు. కాగా, మేము పాలకవర్గంలోకి రాకముందు జరిగిన లావాదేవీలకు బాధ్యత వహించబోమని వారికి చెప్పడం జరిగింది. ఈ ఆరు నెలలుగా టెంటు హౌస్ అద్దె, టీల బిల్లు. ఎన్నికల బృందానికి చేయాల్సిన చెల్లింపు విషయం అలాగే పెండింగ్లో ఉంది.

తుమ్మ శ్రీధర్ రెడ్డి అధ్యక్షుడిగా, పెరుమాండ్ల వెంకటేశ్వర్లు కార్యదర్శిగా 2017లో బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు మన ప్రెస్ క్లబ్ రెండు ఫ్లోర్ల బిల్డింగ్ పూర్తి చేసుకుని ఉంది. వీరు వచ్చిన తరువాత రోడ్డు పక్కన ఉన్న బిల్డింగ్ను షట్టర్లుగా మారుస్తూ వాటిని అద్దెకు ఇచ్చినారు. వాటిని అద్దెకు తీసుకున్న షాపుల యజమానులు ఇచ్చిన అడ్వాన్సు డబ్బులు సుమారు 12 లక్షల రూపాయలతో వాటిని నిర్మించామని తెలియజేశారు. దానికి సంబంధించిన లావాదేవీల వివరాలు ఇవ్వలేదు. అదేవిధంగా సుమారు ఆరు నెలలపాటు వాటి యొక్క అద్దె డబ్బులను నగదు రూపంలో తీసుకొని ఉన్నారు. ఈ మొత్తం వివరాలు ఇవ్వాలని అటు తుమ్మ శ్రీధర్ రెడ్డి. పెరుమాండ్ల వెంకటేశ్వర్లుకు లేఖలు రాయడంతోపాటు షాపుల యజమానులకు కూడా నోటీసులు ఇచ్చినాము. షాపుల యజమానులు నగదు రూపంలో ఇచ్చినామని రాత పూర్వకంగా తెలియజేసినారు.

> ప్రెస్ క్లబ్ రెండవ ఫ్లోర్ను ఈవీఏ ఐవీఎఫ్ సెంటర్కు నిబంధనలకు విరుద్ధంగా అతి తక్కువ అద్దెకు 15 సంవత్సరాల పాటు లీజుకు ఇస్తూ రిజిస్ట్రేషన్ చేశారు.

> ప్రతి నెల భవితశ్రీ చిట్ ఫండ్లో లో చిట్టీ కడుతున్నామని, దానికి సంబంధించి ప్రెస్ క్లబ్ యొక్క డబ్బులు 22లక్షల రూపాయలు అట్టి చిట్ ఫండ్ వద్ద ఉన్నాయని జనరల్ బాడీలో సభ్యులకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. దానియొక్క చెక్కులు, ఇతర వివరాలు పరిశీలించినప్పుడు అట్టి లావాదేవీలలో సుమారు 3లక్షల యాభైవేల రూపాయలకు సంబంధించి లెక్కలు సరిపోలడం లేదు. దానిపై వివరణ అడుగుతూ చిట్ ఫండ్కు లేఖ రాయగా గత పాలకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు క్లబ్ కోసం అవసరం ఉందని అభ్యర్థించి 3లక్షల రూపాయల నగదు తీసుకున్నారని వారు సమాధానం ఇవ్వడం జరిగింది. దీనిపై ఈ రోజుకు క్లారిటీ ఇచ్చే పని వారు చేయడం లేదు. ఇక భవితశ్రీ చిట్ ఫండ్ లో 18లక్షల 97వేల 453 రూపాయలు క్లబ్ నుంచి చిట్టీలో జమ కావడం జరిగింది. వారిని ఎన్నిసార్లు కలిసే ప్రయత్నం చేసినా వారు స్పందించలేదు. చివరకు గౌరవ పోలీసు కమిషనర్ రంగనాథ్ గారిని కలిసి చిట్ ఫండ్ యాజమాన్యం క్లర్కు డబ్బులు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని వివరించడం జరిగింది. వెంటనే స్పందించిన కమిషనర్ గారు చిట్ ఫండ్ యాజమాన్యానికి వార్నింగ్ ఇచ్చి.. క్లబ్ వ్యవహారాన్ని సెటిల్ చేసుకోవాల్సిందిగా సూచించారు. అప్పుడు చిట్ ఫండ్ ఎండీ శ్రీనివాస్ తమకు చెల్లించిన 18 లక్షల 97 వేల 453 రూపాయలకు 4 లక్షల 2వేల 547 రూపాయలు డెవిడెండ్ రూపంలో జత చేసి 23 లక్షల రూపాయలు క్లబ్కు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకొని వాటిని ఏప్రిల్, మే, జూన్ లలో రూ. 6లక్షల చొప్పున, జూలై నెలలో మిగతా రూ. 5 లక్షలు చెల్లించేందుకు ఒప్పుకొని లేఖ రాయడంతోపాటుగా చెక్కులను జారీ చేశారు. కానీ, చెల్లింపుల విషయానికి వచ్చేసరికి మూడు(3) చెక్కులు బౌన్స్ అయ్యాయి. మళ్లీ గౌరవ పోలీసు కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లగా డీసీపీ గారితో ఫోన్ చేయించి తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి మనకు రావాల్సిన డబ్బులను చెల్లించే ఏర్పాటు చేశారు. మరొక రూ.5లక్షలు ఈ నెలాఖరున జమ కానున్నాయి. మూడున్నర లక్షల వ్యవహారం పెండింగ్లో ఉంది.

క్లబ్ డబ్బులను చిట్ ఫండ్ ద్వారా ఇప్పించిన గౌరవ పోలీసు కమిషనర్ రంగనాథ్ గారికి క్లబ్ కార్యవర్గం, సభ్యుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.

> మా కార్యవర్గం ఎన్నికైన తరువాత బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన స్టేట్ మెంట్ రికార్డు చూసినప్పుడు కేవలం 130 రూపాయల నిల్వ మాత్రమే ఉంది. ఆశ్చర్యపోయిన మేము పూర్తి లెక్కలను పరిశీలించినప్పుడు గత పాలకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు సుమారు 1 కోటి 40 లక్షల రూపాయల లావాదేవీలు నిర్వహించారని తేలింది. ప్రాథమికంగా మేము గుర్తించిన వివరాల ప్రకారం సుమారుగా 30 లక్షల నుంచి 35 లక్షల రూపాయల వరకు ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని మా పాలకవర్గం భావించింది. అందుకు ఇప్పటికే చాలా సమయాన్ని ఇచ్చాం. ఇవన్ని అంశాలు తేలకపోవడంతో సభ్యుల సంక్షేమం,

అభివృద్ధి విషయంలో ముందడుగు పడటం లేదు. కానీ, కొంతమంది సభ్యులు.. ప్రెస్ క్లబ్ కార్యవర్గం వారితో కుమ్మకైందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దయచేసి ఆలస్యానికి చింతిస్తూ తదుపరి చర్యల కోసం మా కార్యవర్గం వెంట మీరంతా ఉంటారని ఆశిస్తున్నాం.

వాస్తవానికి క్లబ్ నియమ నిబంధనలు, బైలా ప్రకారం క్లబ్ ఆదాయ వ్యయాలను… ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆడిటర్ ద్వారా నిర్వహించాల్సి ఉంటుంది. కానీ, వీరు పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఒక కోటి నలభై లక్షల రూపాయల ఆదాయ వ్యయాల పట్టికను తెల్లపేపరుపై రాసుకువచ్చి సభ్యుల ముందు ఉంచారు. కనీసం మేము ఎన్నికైన తరువాత అయినా ఆడిట్ చేయించి అట్టి రిపోర్టును ఇవ్వాలని కోరినప్పటికీ దాట వేస్తూ వచ్చారు. కాబట్టి ఇట్టి విషయంపై ప్రభుత్వ దర్యాప్తు సంస్థలచే పూర్తి స్థాయి విచారణ జరిపితే వాస్తవాలు బయట పడతాయని భావిస్తున్నాం.

You cannot copy content of this page