కోరుట్లలో చెరుకు రైతుల సమర శంఖం

పోటీ చేస్తామంటూ ప్రకటన

సీఎం సభలో క్లారిటీ రాకుంటే బరిలోకే

దిశ దశ, కోరుట్ల:

నిజామాబాద్ ఎంపీ ఎన్నికల్లో పసుపు రైతులు సత్తా చాటుకున్న విధంగానే చెరుకు రైతులు కూడా కార్యరంగంలోకి దూకాలని నిర్ణయించారు. తమ కళ్ల ముందే కనిపిస్తున్న చెరుకు ఫ్యాక్టరీ మూతపడడంతో ఆందోళన బాట పట్టిన రైతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గురువారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో చెరుకు రైతులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఈ విషయాన్ని ప్రకటించారు. ముత్యంపేట చక్కర కర్మాగారాన్ని తెరిపిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడం లేదని తాము మాత్రం పోరుబాట పట్టడం తప్ప మరో దారి కనిపించడం లేదంటూ చెరుకు రైతులు స్పష్టం చేశారు. ముత్యంపేట చక్కెర కర్మాగారం తెరిపించినట్టయితే తాము పండించిన చెరుకు ఇక్కడే విక్రయించుకునే అవకాశం ఉంటుందని లేనట్టయితే సుదూర ప్రాంతాలకు వెల్లి అమ్ముకోవల్సి వస్తోందని రైతాంగం అంటోంది. కోరుట్లలో జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ మీదుగా చెరుకు ఫ్యాక్టరీ తెరిపిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. లేనట్టయితే అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో చెరుకు రైతులమంతా కలిసి నామినేషన్లు వేస్తామని హెచ్చరించారు. నిజామాబాద్ ఎన్నికల్లో ఎంపీగా కవితను ఓడించినట్టే కోరుట్ల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ ని ఓడిస్తామని వెల్లడించారు. సంజయ్ కూడా ఈ విషయంలో చొరవ తీసుకోవాలని రైతులు కోరారు. కోరుట్ల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇప్పుడు చెరుకు రైతుల రూపంలో సరికొత్త సమస్య ఎదురైనట్టయింది. ముత్యంపేట చక్కర కర్మాగారం విషయంలో ఇంతకాలం రాజకీయ నాయకులు ఎన్నికల నినాదంగా వాడుకుంటే తాజాగా రైతులే ఈ నినాదాన్ని ఎత్తుకుని అభ్యర్థులకు చుక్కలు చూపించే పనిలో పడినట్టుగా కనిపిస్తోంది. ఏది ఏమైనా తాజాగా చెరుకు రైతులు తెరపైకి తీసుకొచ్చిన డిమాండ్ పై ఎలాంటి స్పందన ఉంటుందో చూడాలి మరి.

కోరుట్ల ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం

ఇబ్రహీంపట్నం చెరుకు రైతుల వెల్లడి
https://youtu.be/he4TOGJ2VWc

You cannot copy content of this page