దిశ దశ, రాజన్న సిరిసిల్ల:
ఫస్ట్ బెల్, సెకండ్ బెల్, లంచ్ బెల్, లీజర్ బెల్ పదాలు ప్రతి పాఠశాలలో వినిపిస్తుంటాయి. ఆ పాఠశాలలో మాత్రం వాటర్ బెల్స్ కూడా మోగుతుంటాయి. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇలాంటి బెల్స్ వినిపించే అవకాశం లేదు కానీ… రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లెల్ల బడిలో మాత్రం నీటి గంటలు వినిపించే సాంప్రాదాయం మొదలైంది. పాఠశాల హెచ్ఎం, టీచింగ్ స్టాఫ్ అంతా కలిసి విద్యార్థుల ఆరోగ్యం కోసం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
అమ్మ ఒడిలా…
అమ్మ ఒడిలాంటి బడిలో చదువుకుంటున్న విద్యార్థులకు పుస్తక విజ్ఞానాన్ని పంచడంతోనే సరిపెట్టకుండా అనారోగ్య సమస్యలకు పుల్ స్టాప్ పెట్టేందుకు కూడా తమవంతు చొరవ చూపాలని భావించారు జిల్లెల్ల హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు అనురాధ. విద్యార్థులు వేళకు వచ్చారా..? పాఠ్యాంశాలు బోధించామా…? విద్యార్థులు విద్యలో రాణిస్తున్నారా అన్న విషయాలకే పరిమితం కాకుండా ఈ పాఠశాల అద్యాపక బృందం అంతా కలిసి స్టూడెంట్స్ హెల్త్ కేర్ పై కూడా దృష్టి సారించారు. వినూత్నంగా తీసుకున్న ఈ నిర్ణయం వెనక అసలు కారణం అంత్యంత బలమైనది కాబట్టి ఖచ్చితంగా వాటర్ బెల్స్ ప్రోగ్రాం స్టార్ట్ చేయాలని నిర్ణయించారు. తమ బడిలో చదువుకుంటున్న వారంతా తమ బిడ్డలేనన్న భావనతో ఉపాధ్యాయులు తీసుకుంటున్న ఈ చొరవ ఆధర్శంగా నిలుస్తోంది. పాఠశాలలో ఉన్న ప్రతి విద్యార్థి ఇంటి నుండి స్కూలుకు వచ్చి తిరిగి ఇంటికి చేరే వరకు కనీసం 1 లీటర్ నీటిని తాగాలని ఇందుకు అవసరమైన చొరవ తీసుకుని ఇందుకు తగిన కార్యాచరణ సిద్దం చేసుకోవాల్సిందేనని నిర్ణయించారు. ఇందులో భాగంగా రోజుకు రెండు సార్లు వాటర్ బెల్స్ మోగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ సమయంలో తరగతి గదుల్లో ఉన్న విద్యార్థులంతా కూడా పాఠశాల ఆవరణలోకి వచ్చి నీటిని తాగాల్సి ఉంటుంది. వీరితో పాటు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా నీరు తాగుతున్నారు.
కొంతకాలంగా…
పాఠశాలకు వస్తున్న విద్యార్థులు నీరు తాగాలన్న ఉద్ధేశ్యంతో కొంతకాలంగా క్లాస్ ముగిసిన వెంటనే కొంత నీరు సేవించాలన్న కండిషన్ పెట్టారు. విద్యార్థులు వాటర్ బాటిల్స్ తీసుకుని రావల్సిందేనని టీచర్లు సూచించడంతో ఇందుకు అనుగుణంగా ముందుకు సాగారు. అయితే ప్లాస్టిక్ మయమైన ప్రపంచంలో విద్యార్థులు కూడా వివిధ రకాల బాటిల్స్ తీసుకుని వస్తుండడాన్ని గమనించారు. దీంతో ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగించే విధానానికి చెక్ పెట్టాలని యోచించి స్పాన్సర్ల సహకారంతో ప్రతి విద్యార్థికి స్టీల్ వాటర్ బాటిల్ పంపిణీ చేయించారు. స్కూల్ లో చదువుతున్న 165 మంది విద్యార్థులకు కూడా వాటర్ బాటిల్స్ అందించారు. గురువారం నుండి వాటర్ బెల్స్ ప్రోగ్రాంకు స్కూల్ టీచర్లు శ్రీకారం చుట్టారు. రోజుకు రెండు సార్లు విధిగా కేవలం మంచినీరు తాగేందుకు మాత్రమే ఈ బెల్స్ కొట్టే ఆనవాయితిని మొదలు పెట్టారు.
ప్రత్యేకతలు…
వాటర్ బెల్స్ ప్రోగ్రామే కాకుండా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులంతా కూడా విద్యార్థుల భవితవ్యాన్ని తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారు. పాఠశాల ఆవరణలో డస్ట్ బిన్స్ కూడా ప్లాస్టిక్ బాక్సులు వినియోగించవద్దని నిర్ణయించారు. అంతేకాకుండా ఈ స్కూల్ లో చదువుతున్న పదో తరగతి విద్యార్థి క్లాసుకు అటెండ్ కానట్టయితే హెచ్ఓం అనురాధ, మరో టీచర్ కలిసి వారి ఇంటికి వెల్లి ఆరా తీస్తుంటారు. బలమైన కారణం లేకుండా పిల్లలను ఇంటివద్ద నిలువరించిన తల్లిదండ్రులతో మాట్లాడి వారిని బడిబాట పట్టించేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇతర క్లాసులకు చెందిన విద్యార్థులు రెండు మూడు రోజుల పాటు బడికి రానట్టయితే వారి ఇండ్లలోకి వెల్లి అసలు కారణాలు తెలుసుకుని తల్లిదండ్రులను మెప్పించి ఒప్పించేందుకు కూడా చొరవ తీసుకుంటున్నారు.
అనుభవాల పాఠాలు…
జిల్లెల్ల స్కూల్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అనురాధ స్వీయ అనుభవాలనే జీవిత పాఠాలుగా భావించి విద్యార్థులచే నీరు తాగించాలని నిర్ణయించకున్నారు. గతంలో కరీంనగర్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పనిచేసినప్పుడు ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు నీరు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. డీఈఓ కార్యాలయంలో పని చేసినప్పుడు నీటి శాతం తగ్గిపోవడంతో కొలెస్ట్రాల్ పెరిగిందన్న విషయాన్ని ప్రాక్టికల్ గా గమనించారు. అంతేకాకుండా మాధ్యామాల్లో వచ్చిన కథనాలు కూడా నీటిని తక్కువగా సేవించడం వల్ల కొలెస్ట్రాల్ పెరగడానికి ప్రధాన కారణం అవుతుందని కూడా తెలుసుకున్నారు. దీంతో తాను పని చేసే చోట విద్యార్థులకు నీటి యోక్క ప్రాధాన్యతను, అవసరమైనంత నీటిని తాగాల్సిన ఆవశ్యకతను వివరించారు. అంతేకాకుండా విద్యార్థులు ఖచ్చితంగా నీరు సేవించేందుకు అవసరమైన వాతావరణమూ కల్పించాలని భావించారు. తాను చేస్తున్న ఈ ప్రయత్నానికి తనతో పాటు సహచర ఉపాధ్యాయ బృందం కూడా చేతులు కలపడంతో సక్సెస్ అవుతున్నానని చెప్తున్నారు హెచ్ ఎం అనురాధ. అయితే విద్యార్థులకు తాగు నీరు అందుబాటులో ఉంచేందుకు పాఠశాలలో ఉన్న వాటర్ ప్యూరిఫై మిషన్ ను బాగు చేయించడంలో కూడా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వచ్చే వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని మట్టి కుండలను కూడా ఏర్పాటు చేయిస్తే బావుంటుందని భావించిన అనురాధ వాట్సప్ స్టేటస్ తో పాటు సోషల్ మీడియా వేదికగా రంజన్లు ఇప్పించాలని అభ్యర్థించారు. ఇందుకు స్పందించి దాతలు కూడా ముందుకు రావడంతో వేసవి కాలంలో విద్యార్థులకు సహజమైన చల్లటి నీటిని అందుబాటులో ఉంచే అవకాశం కూడా దక్కినట్టయిందని అంటున్నారు.