దిశ దశ, కరీంనగర్:
నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు కాళేశ్వరంలోని సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలకు వచ్చి చేరుతున్న వరద నీటిని దిగువకు వదిలేస్తున్నామని, ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చిన వరద నీటిని ఎగువ ప్రాంతానికి ఎత్తిపోస్తున్నామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఆదివారం కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంను సందర్శించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎల్లంపల్లి ప్రాజెక్టుకు, కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు నుండి వస్తున్న నీటితో పాటు క్యాచ్ మెంట్ ఏరియా నుండి వచ్చి చేరిన నీటిని నంది పంప్ హౌజు మీదుగా వరద నీటిని ఎగువ ప్రాంతాలకు ఎత్తిపోసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఎల్లంపల్లికి వరద ఉధృతి తీవ్రం కావడంతో గేట్లు ఎత్తి దిగువ ప్రాంతాలకు కూడా వదలాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 24 టీఎంసీల సామర్థ్యం ఉన్న లోయర్ మానేరు డ్యాంనకు 14 టీఎంసీల నీరు తరలించడం జరిగిందన్నారు. మరో వైపున మిడ్ మానేరు ప్రాజెక్టుకు ఎల్లంపల్లి నుండి నీటిని తరలించడంతో పాటు క్యాచ్ మెంట్ ఏరియాల నుండి కూడా వరద వచ్చి చేరుతోందని వివరించారు. దీంతో కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ వరకు నీటిని తరలిస్తున్నామని పొన్నం ప్రభాకర్ వివరించారు. కోదాడ వరకు కూడా వరద నీటిని తరలించే ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. కాళేశ్వరం బ్యారేజీలతో సంబంధం లేకుండానే ఈ నీటిని ఎగువ ప్రాంతాలకు తరలిస్తున్నట్టుగా వివరించారు. ఎస్సారెస్పీ కూడా నిండినట్టయితే మరింత నీరు మానేరు నదికి రానుందని దీంతో మిగతా ప్రాంతాలకు కూడా నీటిని సరఫరా చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతి నీటి చుక్కను కూడా వినియోగంలోకి తీసుకొచ్చే విధంగా ప్రణాళికలు తయారు చేశామని తెలిపారు. రాజకీయాలు చేయడం మానుకుని వ్యవసాయ రంగం అభివృద్ది చెందాలన్న కాంక్షతో ఉండాలని సూచించారు. సాగు నీటి ప్రాజెక్టులు కళకళలాడాలని ఆకాంక్షించాలన్నారు.
బైక్ లు వద్దు…
భారీ వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఇందులో భాగంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. వరద నీరు రహదారులపైకి వచ్చి చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని, వరద ప్రభావం తగ్గే వరకు బైకులను రోడ్లపైకి అనుమతించకూడదని అధికారులను ఆదేశించామన్నారు. హైదరాబాద్ నగరంలో 141 చోట్ల వాటర్ లాగింగ్స్ పాయింట్స్ గుర్తించామని అక్కడ నీటిని నిలువు చేసేందుకు అనువైన విధంగా ప్రణాలికలు తయారు చేస్తున్నామన్నారు. అదేవిధంగా జిల్లాల్లో కూడా లో లెవల్ కాజ్ వేలను గుర్తించి అక్కడ హై లెవల్ వంతెనలు నిర్మించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ప్రజలు కూడా వర్షాలు తగ్గే వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని కోరారు. భారీ వర్షాలు ఏకధాటిగా పడడం లేదని, కొంత గ్యాప్ ఇచ్చిన తరువాత వర్షాలు కురుస్తుండడం వల్ల ఇబ్బందులు ఎదురు కావడం లేదన్నారు. అత్యవసర సేవలు అందించేందుకు అధికార యంత్రాంగం అన్ని వేళల్లో అందుబాటులో ఉంటారని మంత్రి వివరించారు. పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు కూడా తమ వంతుగా సహాయక చర్యల్లో నిమగ్నం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. మంత్రి పొన్నం వెంట ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు.