దిశ దశ, జగిత్యాల:
పిల్ల కాలువలో విచిత్రం చోటు చేసుకుంది. ఓ వైపున నీటి ప్రవాహం సాగుతుండగానే… మరో వైపున భూమిలోపలి నుండి పాలు పొంగుకుంటూ వచ్చాయి. అక్కడ నీళ్లు… ఇక్కడ పాలు బయటకు రావడం ఏంటని, ఇదేదో అత్యంత విచిత్రాల్లో ఒకటని స్థానికులు అనుకున్నారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం చింతల్ పేట గ్రామ సమీపంలో ఓ వంతెన నిర్మాణం సాగుతోంది. వంతెన కింది భాగం నుండి చిన్న పాయలాగా నీరు ప్రవహిస్తుంటే, పక్కనే ఉన్న ఇసుక నుండి పాలు పొంగుకుంటూ వచ్చాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు సంబ్రమశ్చార్యాలకు గురయ్యారు. ఇక్కడేదో అద్భతం జరిగిపోయిందని అనుకుని కొంతమంది మిరాకిల్ గురించి చర్చించుకోవడం మొదలు పెట్టారు. చివరకు అసలేం జరిగిందో అధికారులు వివరిస్తే కానీ అసలు విషయం అర్థం కాలేదు. ఈ కాలువ మీదుగా మిషన్ భగీరథ పైప్ లైన్ వేశారు అధికారులు. ఈ పైపులు లీకేజీ కావడంతో అందులోంచి నీరు తెలుపు రంగులో బయటకు వచ్చింది. శుభ్రమైన నీటని అందించడంలో భాగంగా అధికారులు నీటిని క్లోరినేషన్ చేసి విడుదల చేశారు. అయితే మిషన్ భగీరథ పైప్ లైన్ లీకయిన చోట క్లోరినేషన్ కారణంగానే నీరు తెలుపు రంగంలో వచ్చిందని అధికారులు వివరించారు.