టవర్ సర్కిల్ షాపుల్లోకి చేరిన నీరు … స్మార్ట్ సిటీ పనుల పుణ్యమేనా సారూ..?


దిశ దశ, కరీంనగర్:

కరీంనగరానికి తలమానికంగా ఉన్న టవర్ సర్కిల్ లోని దుకాణాలు జలమయం అయ్యాయి. వినియోగదారుల క్రయవిక్రయాలతో కళకళలాడాల్సిన టవర్ సర్కిల్ ఏరియా షాపులు నీటితో నిండిపోయాయి. తమ భవనాలు కూలిపోయే ప్రమాదం ఉందని, అమ్మకాల కోసం షాపులో ఉంచిన స్టాక్ అంతా కూడా నీటిపాలైందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 40 ఏళ్లలో ఏనాడు కనివినీ ఎరగని రీతిలో టవర్ సర్కిల్ షాపుల్లోకి నీరు చేరడం ఏంటన్నదే పజిల్ గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సీఫేజ్ వాటర్ పుణ్యమేనా..?

నగరాన్ని అన్నింటా అభివృద్ది చేసేందుకు కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీగా గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ నిధులతో నగర సుందరీకరణ పనుల్లో చోటు చేసుకుంటున్న తప్పిదాల వల్లే నాలుగు దశాబ్దాల్లో ఏనాడు టవర్ సర్కిల్ ఏరియాలో కనిపించని నీరు ఈ సారి ఆగుపిస్తోందని ఆరోపిస్తున్నారు స్థానికులు. టవర్ సర్కిల్ లోని మల్యాల అంజయ్య, రామ్ డ్రెస్సెస్, రేమండ్స్ షోరూం, అన్నపూర్ణ కాంప్లెక్స్ లోని సాగర్ కలర్ ల్యాబ్ తదితర భవానల్లోకి సీఫేజ్ వాటర్ చొరబడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్మార్ట్ సిటీ నిర్మాణ సమయంలో నాణ్యతా ప్రమాణాలకు తిలోదాకలివ్వడం వల్లే సీఫేజ్ వాటర్ దుకాణ సముదాయాల్లోకి వచ్చి చేరాయని అంటున్నారు. దీనివల్ల తమ భవనాల అస్థిత్వం దెబ్బ తింటుందని, నిత్యం ఇలాగే నీరు చేరినట్టయితే కూలిపోయే ప్రమాదం కూడా ఉంటుందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా భవనాల్లో ఉంటున్న వారి ప్రాణాలకే గ్యారెంటీ లేకుండా పోయిందని కూడా భయపడుతున్నారు. దశాబ్దాల కాలంగా ఇలాంటి పరిస్థితి ఏనాడు కూడా టవర్ సర్కిల్ లో కనిపించలేదని, టవర్ సర్కిల్ కు ఎంత వరద నీరు వచ్చినా దిగువకు వెల్లిపోతుంది కానీ ఈ సారి మాత్రం భవనాల్లోకి నీరు చొరబడిందని వివరించారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలని లేనట్టయితే తాము వ్యాపారాలు చేసుకునే పరిస్థితి కూడా ఉండదని టవర్ సర్కిల్ వ్యాపారులు అంటున్నారు. దీంతో తమ దుకాణాల్లోకి వచ్చిన నీటిని బయటకు తరలించేందుకు మోటార్లు పెట్టుకోవల్సిన దుస్థితి తయారైందని వ్యాపారులు వివరించారు.

ఎందుకిలా..?

ఉన్నట్టుండి భవనాల్లోకి నీరు చొచ్చుకరావడానికి ప్రధాన కారణం స్మార్ట్ సిటీ నిర్మాణంలో భాగంగా జరిపిన పనుల్లో ఇసుకకు బదులు క్రషర్ డస్ట్ వాడి నాణ్యాతా ప్రమాణాలకు తిలోదకాలిచ్చారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పట్ట పగలు చేయాల్సిన ఈ పనులను రాత్రి వేళ్లల్లో చేయడం వల్ల ఈ పరిస్థితి తయారైందని, చీకట్లో ఎస్టిమేట్ నిబంధనల మేరకు పనులు జరుపుతున్నారా లేదా అని పర్యవేక్షించే అవకాశమే లేకుండా ఉంటుందని అంటున్నారు. టవర్ సర్కిల్ లో స్మార్ట్ వర్క్స్ లో అవకతవకలు జరుగుతున్నాయని స్థానిక కార్పోరేటర్ కమల్ జిత్ కౌర్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా మాజీ మేయర్ సర్దార్ రవిందర్ సింగ్ కూడా టవర్ సర్కిల్ ప్రాంతంలోని పనుల డొల్లతనాన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు క్షేత్ర స్థాయిలో పర్యటించి అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

విజిలెన్స్ కు ఫిర్యాదు చేస్తా: సోహన్ సింగ్

టవర్ సర్కిల్ లోని షాపుల్లోకి నీరు రావడానికి కారణం స్మార్ట్ సిటీ పనుల్లో జరిగిన అవకతవకలేనని కార్పేరేటర్ సోహన్ సింగ్ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు టవర్ సర్కిల్ ప్రాంతంలో పర్యటించిన ఆయన షాపుల్లోకి వచ్చిన నీటిని పరిశీలించిన ఆయన స్మార్ట్ సిటీ పనుల నిర్మాణాలపై పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. అధికారుల పనితీరు ఇలా ఉంటే ఎలా అని, ప్రభుత్వం అలాట్ చేసిన నిధులు సక్రమంగా ఖర్చు చేస్తున్నారా లేదా అన్న విషయంపై దృష్టి సారించకపోవడం వల్లే ఈ పరిస్థితి తయారైందన్నారు. కార్పోరేషన్ అధికారులు స్పందించనట్టయితే విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తానని సోహన్ సింగ్ స్పష్టం చేశారు.

You cannot copy content of this page