మంత్రి హరీశ్ రావు, భట్టి మధ్య ‘జల’ యుద్ధం

తెలంగాణ అసెంబ్లీలో మంత్రి హరీశ్ రావు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య వాడీవేడి వాదనలు జరిగాయి. ముందు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాళేశ్వరానికి పెద్ద ఎత్తున ఖర్చు చేశారని ప్రశ్నించారు. 18 లక్షల ఎకరాలకు బ్యారేజి కట్టారు కానీ నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. దేశ విదేశాల నుంచి వచ్చి చూశారంటున్నారు కానీ పంపులు మునిగిపోయాయని చుద్దామంటే పోనివ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు.

ఏపీ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవడం లేదని.. దీంతో అధికంగా నష్టపోయేది ఖమ్మం జిల్లానే అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా ఆశలన్నీ నాగార్జునసాగర్ ఎడమ కాలువపైనే ఉన్నాయని భట్టి పేర్కొన్నారు. ఈ విషయం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు సైతం తెలుసు అని వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో అనేక ప్రాజెక్టులు చేపట్టారని.. అయితే కాంగ్రెస్ పార్టీపై కోపంతో ఆ ప్రాజెక్టులను నిలిపి ఉంచడం మందిది కాదని తెలిపారు. అసెంబ్లీలో తమ మైకులు కట్‌ చేసి వాళ్లకు మాత్రే ఇస్తే ఎలా అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. మమ్మల్ని కట్టేసి వాళ్లకు కొరడా ఇచ్చి కొట్టమన్నట్టుగా ఉందని అన్నారు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు కౌంటర్‌ ఇచ్చారు. కొరడాతో తాము కొట్టడం లేదని, మీకు మీరే కొట్టుకుంటున్నారని సెటైర్లు వేశారు. కాళేశ్వరం దగ్గరకు రేపు వెళ్తామంటే చెప్పండి.. దగ్గరుండి తీసుకెళ్తానని అన్నారు. వరద వచ్చినప్పుడు వెళ్తే జారిపడతారని భట్టిని పంపలేదన్నారు. కాళేశ్వరం మునిగిందని కాంగ్రెస్‌ నేతలు సంబర పడుతున్నారని.. కానీ ప్రకృతి విపత్తు వచ్చిందని చెప్పారు. నయా పైసా ఖర్చు లేకుండా ఏజెన్సీ రిపేర్‌ చేయించామని హరీశ్ రావు తెలిపారు.

కాంగ్రెస్‌ హయాంలో పాలమూరు బిడ్డలు ఎందుకు వలస పోయారని మంత్రి హరీష్‌ రావు ప్రశ్నించారు. ఏడు లక్షల ఎకరాలకు నీరందిస్తున్నామని చెప్పారు. పాలమూరు గోస తీర్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక మూడు వేల 600 కోట్లు ఖర్చు పెట్టి ఐదు లక్షల ఎకరాలకు నీరిచ్చామన్నారు. తాము కట్టిన ప్రజెక్టుల వల్లే నీళ్లు వచ్చాయని స్పష్టం చేశారు.

You cannot copy content of this page