ఎగువకు నీళ్లు… దిగువకు కన్నీళ్లు…

గోదావరి పరివాహక ప్రాంత రైతుల కష్టాలు…

దిశ దశ, భూపాలపల్లి:

సమృద్దిగా నీరున్నా శతాబ్దాల కాలంగా అక్కడి ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడలేదు… పాలకులు కూడా నీటిని వినియోగించుకునే విధంగా కార్యాచరణ చేపట్టలేదు. వందల కిలోమీటర్లపైగా గోదావరి నది ప్రవహిస్తున్నా అక్కడి ప్రజల గొంతు శతాబ్దాలుగా తడిచిన పాపాన పోలేదు. తాగు నీటి కోసం మైళ్లకు మైళ్లు నడిచి… సాగు నీటి కోసం వందలాది ఫీట్ల లోతున బోర్లు వేసుకుని కాలం వెల్లదీశారు ఇంతకాలం. వాణిజ్య పంటలు వేస్తే విక్రయించుకునేందుకు పొరుగూరికి వెల్దామన్న రహదారుల బాగాలేక నరకయాతన పడిందక్కడి రైతాంగం. దీంతో కడుపు నింపుకునేందుకు ఆహార పంటలు వేస్తూ అవస్థలు పడి జీవనం సాగించింది. అయితే ఇప్పుడిప్పుడే రవాణా సౌకర్యం మెరుగు పడడంతో వాణిజ్య పంటల సాగుపై ఆసక్తి చూపుతున్న ఆ రైతాంగాన్ని నమ్ముకున్న గోదారమ్మే నట్టేట ముంచుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రోడ్ల రూపు రేఖల మారిపోయినా… గోదారమ్మ ఎదురీదడం ఆరంభిస్తుండడంతో ఇక తాము జీవించడం ఎలా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాళేశ్వరం నేర్పిన పాఠం…

తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశామలం చేయాలన్న నినాదంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇక్కడి రైతాంగానికి ఎన్నో పాఠాలు నేర్పింది. అత్యంత సారవంతమైన భూములు ఉన్నగోదావరి పరివాహక ప్రాంత రైతులు ఇంతకాలం ఎలాంటి ప్రాజెక్టులు లేకున్నా బోర్లు వేసుకుంటూ పంటలు పండించారు. ఇక్కడి భూములకు సాగు నీరందించేందుకు ఏర్పాటు చేసిన ప్రాజెక్టులు నత్తలకే నడకలు నేర్పుతుంటే భారీ ప్రాజెక్టు కాళేశ్వరం మాత్రం చకాచకా నిర్మాణం జరిగిపోయి యావత్ తెలంగాణాకు నీటిని అందించే స్థితికి చేరుకుంది. అయితే ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు ఇక్కడి రైతాంగానికి చుక్కలు చూపుతున్నాయి. బ్యాక్ వాటర్ అన్నట్టయితే ఎగువ ప్రాంత భూములు, వరద నీటి ప్రవాహం పెరిగితే దిగువ ప్రాంత భూములు ముంపునకు గురవుతున్నాయి. వేసవి కాలంలో అయితే చుక్క నీరు కానరాక గోదావరి నది వెలవెలబోతోంది. దీంతో మూడు కాలల్లో కూడా దిగువ ప్రాంత రైతాంగం పంటలు పండించుకునే పరిస్థితి లేకుండా పోయింది. అన్నారం కారణంగా మంథని మండలం మల్లారం, అయ్యగారిపల్లెతో పాటు మరో రెండు మూడు గ్రామాలకు చెందిన 500 ఎకరాల్లో పంటలు వేయక ఐదేళ్ల అవుతోంది. ఇక్కడి భూములు నీళ్లలోనే మునిగిపోతుండడంతో ఆయా గ్రామాల భూములు బీళ్లుగా మారిపోయాయి. ఒకప్పుడు మానేరు నదిలో బోర్లు వేసుకుని పచ్చని పైర్లతో కలకలలాడిన ఈ గ్రామాలకు చెందిన రైతులు నేడు అన్నమో రామచంద్రా అంటూ బ్రతుకులు వెళ్లదీయాల్సిన దుస్థితికి చేరుకున్నాయి. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల బ్యాక్ వాటర్ కారణంగా తమ పంటలన్ని నాశనం అవుతున్నాయని వరదలు వచ్చినప్పుడు దిగువ ప్రాంత రైతులు, బ్యాక్ వాటర్ ఉన్నప్పుడు బ్యారేజీ ఎగువన ఉన్న పరివాహక ప్రాంత రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఏటా ఈ పరిస్థితులు రివాజుగా మారిపోవడంతో రాజకీయ పార్టీలు ఆందోళనలు చేయడం ఆ తరువాత మర్చిపోవడం సాధారణంగా మారిపోయింది. దీంతో ఈ రెండు బ్యారేజీల పరివాహక ప్రాంత రైతుల దయనీయ పరిస్థితి చూస్తే కన్నీళ్లు రాకమానవు.

‘మహా’రైతుల దీనస్థితి…

మేడిగడ్డ బ్యారేజ్ కారణంగా పొరుగునే ఉన్న మహారాష్ట్ర రైతుల దీనస్థితిని గమనిస్తే రానున్న కాలంలో గోదావరి పరివాహక ప్రాంత రైతుల పరిస్థితి ఎలా ఉండబోతుందో కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తుంది. సిరొంచ తాలుకాలోని 12 గ్రామాల రైతులు నిరవధిక నిరహారా దీక్షలు చేపడుతున్నా పాలకులు మాత్రం స్పందించడం లేదు. రేపు, ఎల్లుండి పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామంటూ చెప్తున్న మహా సర్కార్ ఇక్కడి రైతాంగం విషయంలో నిస్సహాయం వ్యక్తం చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం నిర్మించుకున్న ప్రాజెక్టు అయినందున తాము డబ్బులు ఇవ్వలేమని చెప్పకనే చెప్తూనే… తెలంగాణ ప్రభుత్వానికి లేఖలు రాశామంటూ ప్రకటిస్తోంది. దీంతో తమ పరిస్థితి ఏంటని అక్కడి యువత, రైతులు, మహిళలు అంతా కూడా సిరొంచ తాలుకా కేంద్రంలో నిరవధిక దీక్షలు చేపట్టారు. మాహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ను ఇప్పటికి రెండు సార్లు కలిసిన బాధిత గ్రామాల రైతులకు మాత్రం పరిహారం చేతికి అందలేదు. రేపు భూపాలపల్లి జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతమైన మహదేవపూర్, పలిమెల మండలాల పరిస్థితి అలాగే మారనుందన్న ఆందోళన ఇక్కడి రైతాంగంలో వ్యక్తమవుతోంది.

ఎగువ ప్రాంతాలకే…

గోదావరి జలాలను ఎగువ ప్రాంతాలకు తరలించేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయని తేటతెల్లం అయింది. దీంతో ఇక్కడి సారవంతమైన భూములు ముంపునకు గురైనప్పుడు కొంతమందికి పరిహారం అందించడంతో సరిపెట్టి సర్కారు తన పని తాను చేసుకుంటూ వెల్తోందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. కాళేశ్వరం నీళ్లు రాష్ట్రం నలుమూలాలకు తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రం కూడా గోదావరి, కావేరి నదుల అనుసంధాన ప్రక్రియను మొదలు పెట్టడంతో ప్రాణహిత, ఇంద్రావతి, గోదావరి నదుల జలాలు ఎగువ ప్రాంత భూముల్లో బంగారం పండిస్తే పరివాహక ప్రాంత భూముల్లో పరిగెలు ఏరుకునే దుస్థితి ఎదురు కానుంది. ఉద్యమ ప్రస్థానంలో బోరు బావులతో పంటలు పండించుకుంటున్నామన్న ఆందోళన ఎలా అయితే వ్యక్తమయిందో గోదావరి, కావేరి లింకేజీతో పరివాహక ప్రాంత రైతులు కూడా బోర్లు వేసుకునే సాగు చేసుకోవల్సిన పరిస్థితి ఎదురు కానుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఇంజనీర్లు వేసిన అంచనాల తప్పిదమో లేక ఇతరాత్ర కారణమో తెలియదు కానీ బ్యారేజీల కారణంగా ముంపునకు గురవుతున్న భూములపై ఐదేళ్లయినా సర్వేలపై సర్వేలు, గ్రామ సభలు జరుగుతూనే ఉన్నాయి. రేపు కేంద్ర నిర్మించనున్న గోదావరి, కావేరీ లింకేజీ విషయంలోనూ ఇదే పరిస్థితి పునరావృతం కానుంది.

ఫలాలు వారికే: అజ్మీరా పూల్ సింగ్ నాయక్, ఎస్టీ సంఘం రాష్ట్ర కో ఆర్డినేటర్

గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నా మా పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. మా నీళ్లు మేం వినియోగించుకోలేకపోతున్నాం. వందల ఏళ్లుగా తిండిగింజలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్న మా భూములను ప్రాజెక్టుల కోసం ఇచ్చి మేం ఉపాధి కోసం దిక్కులు చూడాల్సిన దయనీయమైన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాం. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. వర్షం పడ్డా, పడకున్నా భయం గుప్పిట్లో గోదావరి పరివాహక ప్రాంతంలో కాలం వెల్లదీయాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన గోదావరి, కావేరీ నదుల అనుసంధానంతో అయితే ఈ ప్రాంత రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారే ప్రమాదం ఉంది. ఈ ప్రాంతం మీదుగా ప్రవహిస్తున్న నీటిని ఇతర ప్రాంతాలకు తరలించి ఆయా ప్రాంత భూములను సస్యశామలం చేస్తు ఫలాలు వారికి అందిస్తున్నారు తప్ప గోదావరి నదినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న రైతాంగం మాత్రం కష్టాలు ఎదుర్కోవల్సి వస్తోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయం.

ప్రత్యామ్నాయాలేవి..?: బచ్చల ఎర్రయ్య, ఆదివాసి హక్కుల పోరాట సమితి ఉపాధ్యక్షుడు

గోదావరి నదుల్లోని నీటిని ఇతర ప్రాంతాలకు తరలించుకపోతున్న ఇక్కడి ప్రభుత్వాలు పరివాహక ప్రాంతాలపై చిన్నచూపు చూస్తున్నాయి. ఇక్కడి భూములకు సాగునీరందించేందుకు ఏర్పాటు చేసిన చిన్న కాళేశ్వరం, పలిమెల ఎత్తిపోతల పథకాలను గమనిస్తే సర్కారు చూపుతున్న వివక్ష కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తుంది. దశాబ్దాల కాలంగా ఈ ప్రాజెక్టుల నుండి చుక్క నీరు కూడా బయటకు రాలేదు. కానీ వీటి తర్వాత మొదలు పెట్టిన పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం ఎగువ ప్రాంతాలకు నీరందిస్తోంది. ఇదే పరిస్థితి గోదావరి, కావేరీ నదుల అనుసంధానంతో ఎదురు కానుంది. కాబట్టి తమ భూములు అప్పగించి ఉపాధి కోల్పోతున్న రైతులను ఆదుకోవాలి, అలాగే ముంపునకు గురి కాని భూములకు శాశ్వత ప్రాతిపదికన సాగు నీరందించాలి.

https://dishadasha.com/the-area-that-has-come-to-the-fore-again-the-central-government-is-working-on-connecting-the-two-rivers/

https://dishadasha.com/is-it-possible-to-connect-godavari-and-kaveri-rivers/

You cannot copy content of this page