అన్నారం బాధిత రైతుల నిరసన
ఐదేళ్లుగా ఎవుసం చేయలేకపోతున్నాం… నాగలి పట్టడం మాని పిడికిలెత్తాల్సిన పరిస్థితికి చేరుకున్నాం… పచ్చని పైర్లతో కళకళలాడిన తమ పొలాలన్ని నీట మునిగిపోతున్నాయంటూ ఆ బ్యారేజ్ బాధిత నిరసన చేపట్టారు.
సోమవారం పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ కేంద్రంలో అన్నారం బ్యారేజ్ బ్యాక్ వాటర్ బాధిత రైతులు ఆందోళన చేపట్టారు. మంథని మండలంలోని ఖాన్ సాయిపేట, ఆరెంద, మల్లారం అమ్మగారిపల్లెలకు చెందిన రైతులు సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఓ వైపున గోదావరి, మరో వైపు నుండి మానేరు నదులు తమ శివారు భూముల్లోనే కలుస్తుంటాయని, అయితే అన్నారం బ్యాక్ వాటర్ ఒత్తిడి కారణంగా తమ భూములన్ని ముంపునకు గురవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వందలాది ఎకరాల్తో అన్నారం బ్యాక్ వాటర్ వల్ల సాగు చేసుకోలేని దుస్థితి చేరుకున్నామని దీనివల్ల తమ కుటుంబాలను పోషించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందని రైతాంగం ఆవేదన వ్యక్తం చేసింది. పంట భూములు మునిగిపోతుండడంతో వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న తమకు జీవనాధారం లేకుండా పోయిందన్నారు. ఐదేళ్లలో ఆరెంద, మల్లారం గ్రామాల్లోని 382 ఎకరాలకు కేవలం నాలుగు సార్లు క్రాప్ హాలిడే ప్రకటించగా, ఖాన్సాయిపేట, అమ్మగారిపల్లె గ్రామాలకు మాత్రం మూడు సార్లు మాత్రమే క్రాప్ హాలిడే ప్రకటించి పరిహారం ఇచ్చారన్నారు. అధికారులు వెంటనే ఐదేళ్లలో నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించడంతో పాటు తమ భూములను సేకరించి పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తమ పూర్వీకుల నుండి ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ భూములు కళ్ల ముందు కనిపిస్తున్న పంటలు పండించుకునే పరిస్థితి లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.