ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ ఇంటికి వినతి పత్రం
హుజురాబాద్ నియోజకవర్గంలోని దళితులు అందరికీ పథకం అమలు కాలేదంటూ దళితులు వినూత్న కార్యక్రమం నిర్వహించారు. దళితబంధు వంద శాతం అమలు కానందున అందరికీ ఇప్పించాలని కోరుతూ హుజురాబాద్ ప్రాంత దళితులు ఆదివారం ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ బండ శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నారు. అయితే ఆయన అందుబాటులో లేక పోవడంతో శ్రీనివాస్ ఇంటికి వినతి పత్రాన్ని అతికించారు. నియోజకవర్గంలోని దళితులందరికి దళితబంధు అమలు చేయాలని కోరుతూ తామీ వినతి పత్రం అందజేశామన్నారు. పత్రికల్లో ప్రకటించినట్టుగా నియోజకవర్గంలో వంద శాతం దళితం బంధు స్కీం అమలు కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ స్కీం అమలు చేయనట్టయితే ముందు ముందు తమ ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని వారు వెల్లడించారు.