పోలీసులకు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నాయకులు…
దిశ దశ, హైదరాబాద్:
తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నించలేదని, ప్రశ్నించే వారికి… ప్రతిపక్షాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని, లా అండ్ ఆర్డర్ అదుపులో ఉండే విధంగా ప్రయత్నించాం కానీ… ఇప్పుడు మాత్రం అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు చెప్పినట్టుగానే జీ హుజూర్ అంటున్నారని, తమ పార్టీ కార్యకర్తలపై కేసులు, బెదిరింపులు, అరెస్టులంటూ భయభ్రాంతులకు పోలీసులు గురి చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు డీజీపీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఫిర్యదు చేశారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల కాలంలోనే ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రభుత్వం ప్రవర్తిస్తోందని, పోలీసులను అడ్డు పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా ధర్మపురి నియోజకవర్గానికి చెందిన ఉద్యమకారుడు సల్వాజి మాధవరావు సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్నాడని సోగాలి తిరుపతి అనే వ్యక్తిచే హత్యాయత్నం చేయించారన్నారు. ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాధవరావుపై అట్రాసిటీ కేసు కూడా పెట్టించారన్నారు. గత పదేళ్లలో ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు, దాడుల సంఘటనలే లేవని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు, కేసులు, హత్యా ప్రయత్నాలంటూ వార్తలు చూడాల్సి వస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీకి పోలీసులు వంత పాడుతూ వారికి తొత్తులగా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా పారదర్శంగా పోలీసులు పనిచేయాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు సల్వాజి మాధవరావుపై పెట్టిన కేసును ఎత్తి వేయాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ పై పెడుతున్న కేసులపై నిస్పక్షపాతంగా పోలీసు ఉన్నతాధికారులతో విచారణ కమిటీ వేయాలని కూడా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టుగా పనిచేస్తున్న పోలీసులను మందలించి ప్రజా స్వామ్యాన్ని పరిరక్షించానలి కూడా బీఆర్ఎస్ నాయకులు కోరారు.