దిశ దశ, దండకారణ్యం:
దండకారణ్య అటవీ ప్రాంతం అట్టుడికిపోతోంది. అడవుల నుండి మావోయిస్టులు, వారిని ఏరి వేసేందుకు బలగాల ఆపరేషన్లతో దాడులు, ప్రతి దాడులకు వేదికగా నిలిచిపోయింది. ఈ నెల 16న పోలీసు క్యాంపుపై దాడి చేసింది తామేనని దక్షిణ సబ్ జోనల్ ప్రతినిధి సబిత ఒక ప్రకటనలో వెల్లడించారు. ధర్మవరం క్యాంపుపై జరిగిన ఈ దాడిలో తమకు బలగాలకు మధ్య గంటల పాటు ఎదురు కాల్పులు జరిగాయన్నారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) ఆద్వర్యంలో జరిగిన ఈ దాడిలో బలగాలు తీవ్రంగా నష్టపోయాయని, అయితే పార్టీ కూడా ముఖ్యమైన క్యాడర్ ను కోల్పోయింని సబిత వివరించారు. ఈ ఘటనలో సుక్మా జిల్లా చింతగుప్పా థానా పరిధిలోని కర్రెగుండెం గ్రామానికి చెందిన పీఎల్జీఏ కమాండర్ కరటం దేవాల్, బీజాపూర్ జిల్లా చందా గ్రామానికి చెందిన బెటాలియన్ మెంబర్ ముసాక విక్రం, ఎర్రం గ్రామానికి చెందిన పీఎల్జీఏ మెంబర్ మడకం దేవాల్ లు మరణించినట్టు సబిత తెలిపారు.
ఈ పోరాటంలో పాల్గొనకండి
పారా మిలటరీ బలగాల్లో చేరి కుటుంబాలను పోషించుకుంటున్న యువత ప్రజా వ్యతిరేక పోరాటాల్లో పాల్గొనవద్దని సబిత పిలుపునిచ్చారు. ధర్మవరం క్యాంపుపై తాము చేసిన దాడుల్లో చనిపోయిన, గాయాల పాలైన పోలీసులకు సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక పోరాటాల్లో పాల్గొని దోపిడీ వర్గాల కోసం బలగాలు ప్రాణాలు కోల్పోకూడదని సబిత కోరారు. ఈ ఘటన గురించి ప్రభుత్వం కూడా ఎలాంటి ప్రకటన చేయకుండా తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తోందని సబిత ఆరోపించారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్ కంపెనీలకు అప్పగించేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అభివృద్ది అంటు అబద్దపు ప్రచారం చేస్తూ ఒడిశా, చత్తీస్ గడ్, ఝార్ఖండ్, మహారాష్ట్రాల్లోని ఆదివాసి ప్రాంతాల్లో ఖనిజ సంపదను, ప్రకృతి వనరులను, జల్ జంగల్ జమిన్ ను కార్పోరేట్ కంపెనీలకు అప్పగిస్తోందన్నారు. ఈ సంస్థల కోసమే ఆదివాసి ప్రాంతాల్లో బలగాలచే క్యాంపులు ఏర్పాటు చేస్తోందని మండిపడ్డారు.