మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం: కేటీఆర్

తెలంగాణలో వ్యాపారులు, పెట్టుబ‌డుల‌కు అద్భుత‌మైన వాతావ‌ర‌ణం ఉంద‌ని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బేగంపేట‌లో ఏర్పాటు చేసిన సీఐఐ తెలంగాణ వార్షిక స‌మావేశానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు. ఇటీవ‌ల బ‌యో ఏషియా సదస్సు విజయవంతంగా నిర్వహించుకున్నామని తెలిపారు. మ‌ళ్లీ తామే అధికారంలోకి వస్తామని.. మ‌రిన్ని సీఐఐ స‌ద‌స్సులు నిర్వ‌హిస్తామ‌ని కేటీఆర్ వెల్లడించారు.

లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబ‌డుల‌కు విస్తృత అవ‌కాశాలు ఉన్నాయ‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. 2013తో పోలిస్తే రాష్ట్రంలో పెట్టుబ‌డులు రెట్టింపు అయ్యాయని స్పష్టం చేశారు. 2030 నాటికి 250 బిలియ‌న్ డాల‌ర్లు సాధించాల‌నే ల‌క్ష్యంతో ఉన్నామ‌ని చెప్పారు. హైద‌రాబాద్ న‌గ‌రానికి ఎన్నో అనుకూల‌త‌లు, బ‌లాలు ఉన్నాయని.. తొమ్మిది బిలియ‌న్ టీకాలు హైద‌రాబాద్‌లోనే ఉత్ప‌త్తి అవుతున్నాయని తెలిపారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉత్ప‌త్తి అయ్యే టీకాల్లో 50 శాతం హైద‌రాబాద్‌లోనే త‌యారు అవుతున్నాయ‌ని కేటీఆర్ తెలిపారు. ప్ర‌పంచంలో అతిపెద్ద స్టెంట్ త‌యారీ కేంద్రం మ‌న డివైజెస్ పార్కులోనే ఉంద‌న్నారు. తెలంగాణ‌లో అతి పెద్ద మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేశామని చెప్పారు. దేశానికే హైద‌రాబాద్ మొబిలిటీ కేంద్రంగా మారుతుంద‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఫార్మా ప‌రిశ్ర‌మ‌ల‌కు ఒకే చోట అత్యుత్త‌మ వ‌స‌తులు క‌ల్పిస్తున్నామ‌ని పేర్కొన్నారు.

ప్ర‌పంచ ప్ర‌సిద్ధ సంస్థ‌లు హైద‌రాబాద్‌లో త‌మ కేంద్రాల‌ను ఏర్పాటు చేశాయ‌ని కేటీఆర్ గుర్తు చేశారు. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి సంస్థ‌లు హైద‌రాబాద్‌లో అతి పెద్ద ప్రాంగ‌ణాలు ఏర్పాటు చేసుకున్నాయ‌ని వివ‌రించారు. పలు కంపెనీలు మాత్ర‌మే కాదు.. విభిన్న‌మైన ఆచారాలు, ఆహారం కూడా హైద‌రాబాద్‌లో క‌నిపిస్తాయ‌న్నారు. ఎల‌క్ట్రిక్ వాహ‌న రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులు రానున్నాయ‌ని కేటీఆర్ తెలిపారు. ముందుచూపుతో ఈవీ, బ్యాట‌రీల త‌యారీ రంగంలో ప‌రిశ్ర‌మ‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నామ‌ని చెప్పారు. తెలంగాణ ప‌త్తికి దేశంలో మంచి డిమాండ్ ఏర్ప‌డింద‌న్నారు.

You cannot copy content of this page