ధర్మాచరణ లేని భక్తి ప్రదర్శన ప్రయోజనాన్ని చేకూర్చదు…

మాధవానంద సరస్వతి ఉద్భోద…

దిశ దశ, కరీంనగర్:

సమాజంలో ఆధ్యాత్మికత వాతావరణం నెలకోవడం శుభదాయకమే అయినప్పటికీ ధర్మాచరణ లేని దైవభక్తితో ఏ మాత్రం ప్రయోజనం ఉండదని, ధర్మ సంస్థాపన కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని తొగుట పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి అన్నారు.. కరీంనగర్ పట్టణంలోని శ్రీ గణేశ శారద శంకరాలయంలో మూడు రోజులపాటు జరుగుతున్న కోటి రుద్ర పారాయణ కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు స్వామి భక్తులను ఉద్ధేశించి ప్రవచించారు. అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో మహా రుద్ర ,శ్రీ సూక్త, లక్ష పుష్పార్చన కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగుతోంది. 80 మందికి పైగా వేద పండితులు ఉదయం 8 గంటల నుండి నమక చమక సహిత రుద్ర పారాయణాలతో పాటు శ్రీ సూక్త పారాయణం చేస్తున్నారు. వేద పండితుల మంత్రోచ్చరణలతో ఆలయ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొని శ్రీ మాత్రే నమః జపం చేస్తూ తరించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ… ధర్మరక్షణ అంటే ధర్మాన్ని ఆచరించేందుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని ఇందుకోసం ప్రతి ఒక్కరూ దైవ భక్తిని పెంపొందించుకోవడంతో పాటు ధర్మ కార్యాచరణ కొనసాగించాలని పిలుపనిచ్చారు. కోటి రుద్ర పారాయణ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులంతా పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి వైదిక పరమైన కార్యక్రమాలను నిర్వహించినా అందులో కరీంనగర్ వాసుల భాగస్వామ్యం ఉండడం ఆధర్శప్రాయమన్నారు. ధర్మో రక్షతి రక్షితః అన్న సూక్తిని అనుసరించినట్టయితే మనల్ని ఆ ధర్మమే కాపాడుతుందేన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల బ్రాహ్మణ సేవా సంఘం కరీంనగర్ అధ్యక్షులు కస్బా భూమేశ్వరరావు, శ్రీ గణేశ శారద శంకర ఆలయం కమిటీ అధ్యక్షులు బండపెల్లి ఉపేందర్ శర్మ, ప్రధాన కార్యదర్శులు రామక విఠల్ శర్మ, పురం ప్రేమ్ చందర్ రావు , మూగు హరిశంకర్, మూగు నాగేశ్వర్ శర్మ, జీవీ రంగారావు,యెరబాటి శశికాంత్, గౌరవ అధ్యక్షులు నేదునూరి వామన్ రావు, బ్రాహ్మణ సంఘ ప్రతినిథులు పాల్గొన్నారు.

You cannot copy content of this page