హైకోర్టులో రిట్ దాఖలు చేసిన సింగరేణి బాధిత రైతులు…

ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు

దిశ దశ, పెద్దపల్లి:

పెద్దపల్లి జిల్ల బుధవారంపేట గ్రామనికి చెందిన భూములను సేకరించిన విషయంలో బాధిత రైతులు సింగరేణి యాజమాన్యంపై పట్టువీడకుండా న్యాయ పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. తమతో సంబంధం లేకుండానే భూ సేకరణ జరిపి పరిహారం ఓ బ్యాంకులో జమ చేసి తీరని అన్యాయం చేశారని గతంలోనే రైతులు హైకోర్టును ఆశ్రయించారు. గ్రామ సభలు ఏర్పాటు చేయకుండా తమ నిర్ణయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించిన తీరు వల్ల తాము నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు రైతులు. చివరకు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే రెవెన్యూ అధికారులు కూడా పట్టాదారుల కాలంలో సింగరేణి సంస్థను యాజమాన్యంగా చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యం, రెవెన్యూ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల తమకు ప్రభుత్వం అందించే పథకాలు అందడం లేదని, అలాగే పరిహారం కూడా తమ చేతికి రాలేదని హై కోర్టుకు విన్నించారు. దీంతో గతంలోనే హైకోర్టు కూడా రెవెన్యూ రికార్డుల్లో రైతుల పేర్లు చేర్చాలని, ప్రభుత్వ పథకాలు అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు తమ పేర్లను రికార్డుల్లో చేర్చకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని గ్రామానికి చెందిన బుద్దార్థి బుచ్చయ్యతో పాటు పలువురు రైతులు కోర్టును ఆశ్రయించారు. అడ్వకేట్ పొనంపల్లి రవి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయగా గురువారం సింగిల్ బెంచ్ ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా రైతుల సమస్యను విన్న హై కోర్టు రైతుల పేర్లు రికార్డుల్లో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించింది. పరిహారం అందకపోవడంతో పాటు పట్టాదారులుగా గుర్తించకపోవడం వల్ల రైతు బంధు, రైతు భీమా, పీఎం కొసాన్, క్రాప్ లోన్స్ వంటి సంక్షేమాన్ని అందుకోలేక పోతున్నారని కూడా ఆ పిటిషన్ లో రైతులు వివరించారు. ఈ విషయంపై నాలుగు వారాల్లో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. లేనట్టయితే రిట్ పిటిషన్ ను అనుమతించి ప్రభుత్వానికి జరిమానా విధించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

You cannot copy content of this page