కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో డొల్లతనం
దిశ దశ, భూపాలపల్లి:
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపం ఎక్కడ జరిగింది..? పిల్లర్లు కుంగిపోవడానికి కారణమేంటీ..? ప్రాజెక్టు కోసం తయారు చేసిన డీపీఆర్ దశ నుండే తప్పిదాలు చోటు చేసుకున్నాయా..? అంటే అవుననే చెప్తోంది NDSA నివేదిక.
తక్కువ సమయంలో…
ప్రాజెక్టు నిర్మాణం కోసం ముందుగా తయారు చేసే డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (DPR) తయారు చేసినప్పటి నుండే తప్పటడుగులు వేశారని NDSA రిపోర్ట్ తేల్చి చెప్తోంది. ఎగువ ప్రాంతానికి ఎత్తిపోస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సస్య శామలం చేసేందుకు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాకులోని 20వ పిల్లర్ కుంగిపోవడంతో రంగంలోకి దిగిన NDSA నిపుణుల కమిటీ తాజాగా ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్ లో సంచలన విషయాలు బహిర్గతం అయ్యాయి. డీపీఆర్ తయారు చేసేందుకు కనీసం ఏడాది సమయం పట్టాల్సి ఉన్నప్పటికీ కేవలం నాలుగు నెలల్లోనే సిద్దం చేయడం వల్ల ఈ పరిస్థితి తయారైందని NDSA అభిప్రాయపడింది. సాంకేతిక, ఆర్థిక సాధ్యా సాధ్యాలను పరిశీలించి నిధులు వెచ్చించేందుకు డీపీఆర్ అనేది అత్యంత ముఖ్యమైందని, ప్రాజెక్ట్ నిర్మాణం కోసం అవసరమైన పరిశోధనలు, సాంకేతిక అంశాలపై సమగ్ర అధ్యయనాల తరువాత డీపీఆర్ తయారు చేయాల్సి ఉంటుంది. ప్రతి అంశాన్ని క్షుణ్నంగా పరిశోధించి, పరిశీలించిన తరువాత మాత్రమే సిద్దం చేయాల్సిన డీపీఆర్ విషయంలో హాడావుడిగా తయారు చేయాల్సిన అవసరం ఉండకూడదని ఎన్డీఎస్ఏ స్పష్టం చేసింది. ఆశించిన లక్ష్యాలను చేరుకునేందుకు త్వరితగతిన నివేదిక తయారు చేయకుండా ఇందుకు అవసరమైన సమయాన్ని, వనరులను కెటాయించాల్సి ఉంటుందని దీనివల్ల ప్రాజెక్టులో స్వల్ప మార్పులు, చేర్పులు చేసుకునేందుకు వీలుండడంతో పాటు ప్రాజెక్టుకు వెచ్చించే వ్యయం కూడా పెరగకుండా ఉంటుందని ఎన్డీఎస్ఏ తేల్చింది. అయితే కేవలం నాలుగు నెలల కాలంలోనే తయారు చేసిన డీపీఆర్ వల్ల బ్యారేజీల నిర్మాణం జరిపినప్పడు అసాధారణమైన మార్పులు చేశారని పేర్కొంది. నిర్మాణ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్న తరువాత బ్యారేజీల నిర్మాణ స్థలాలను మార్చేశారని గుర్తించింది. అన్నారంలో బ్యారేజీ నిర్మించాల్సిన ప్రతిపాదిత స్థలాన్ని 2.2 కిలో మీటర్లు, సుందిళ్ల బ్యారేజీ 5.4 కిలో మీటర్ల మేర దిగువకు మార్చారని, ప్రతిపాదించిన ప్రాంతంలో కాకుండా ఈ రెండు బ్యారేజీలను నిర్మించిన ప్రదేశాలు నదీ పరివాహక ప్రాంతానికి దిగువన ఉండడం సరికాదని అభిప్రాయపడింది. దీనివల్ల అన్నారం బ్యారేజీకి ఎగువన భారీగా ఇసుక మేటలు వేయడానికి కారణమైందని తేల్చింది. బ్యారేజీ నిర్మాణ స్థలాలను మార్చాలని నిర్ణయించుకున్న తరువాత కొత్త ప్రతిపాదిత ప్రాంతంలో భూగర్భ పరీక్షలు నిర్వహించలేదని, దీంతో మూడు బ్యారేజీల్లోనూ గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని వివరించింది. కటాఫ్ కోసం షీట్ పైల్స్ స్థానంలో సీకెంట్ పైల్స్ నిర్మించారని, భూగర్భ, భౌగోళిక అనిశ్చితలు వైవిద్యాన్ని గుర్తించేందుకు మూడు బ్యారేజీల నిర్మాణం కోసం నిర్వహించిన జియో టెక్నికల్ పరిశోధనలను మరింత లోతుగా చేయాల్సి ఉందని ఎన్డీఎస్ఏ సూచించింది. బ్యారేజీల నిర్మాణ సమయంలో బోర్ల తవ్వకాల విషయంలో సీబీఐపీ మార్గదర్శకాలను, బీఐఎస్ కోడ్ లలో సిఫార్సు చేసిన ప్రతిపాదనలకు భిన్నంగా నడుచుకున్నారని వివరించింది. సీబీఐపీ మాన్యూవల్ ప్రకారం 85 బో్ర్లను తవ్వించాల్సి ఉండగా 6 బోర్ హోల్స్ మాత్రమే తవ్వారని, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కోసం మొదట ప్రతిపాదించిన స్థలంలో బోర్ హోల్స్ రిపోర్టులు నిర్మాణ ప్రాంతాలను మార్చడంతో నిరుపయోగం అయ్యాయని అభిప్రాయపడింది.