దిశ దశ, పెద్దపల్లి:
ఓ వైపున ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులను ఆహ్వానించడం లేదని, వారికి ప్రయారిటీ ఇవ్వడం లేదని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. మరో వైపున కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం అధికారిక కార్యక్రమాలకు సైతం మాజీలను ఆహ్వానిస్తుండడం విస్మయానికి గురి చేస్తోంది. గత ప్రభుత్వ వైఫల్యాలను పదే పదే ఎత్తి చూపుతూ అధికారంలోకి వచ్చిన విషయాన్ని విస్మరిస్తూ కొంతమంది ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుపై నెటిజన్లు ఘాటుగానే స్పందిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో జరిగిన తీరుపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు విసురుతున్నారు.
తల్లికి బదులు తనయుడు…
ఓదెల సర్పంచ్ గా ఆకుల ఉదయ దేవి కాగా ఆమె తనయుడు మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ వేదికపై కనిపించారు. గోపరపల్లి ఎంపీటీసీ లావణ్యకు బదులుగా ఆమె భర్త నారాయణ రెడ్డి, పిట్టల ఎల్లయ్యపల్లి సర్పంచ్ సరితకు బదులుగా ఆమె భర్త రవికుమార్ లను అధికారికంగా వేదికపైకి ఆహ్వానించడం విమర్శలకు దారి తీస్తోంది. దీంతో నెటిజన్లు అధికారుల తీరును తప్పు పడుతూ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ప్రభుత్వాలు మారాయి… పాలకులు మారారు… అధికారిక కార్యక్రమాల్లో అనధికార వ్యక్తులు మాత్రం స్టేజీపై ఆసీనులు అవుతున్నారు… అధికారులకు ప్రోటోకాల్ కనిపించడం లేదు… కొంచెం ప్రోటోకల్ పాటించడయ్య అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. పెద్దపల్లి ప్రాంతంలోని పలు గ్రూపుల్లో ప్రోటోకాల్ అంశం గురించి విమర్శలు లేవనెత్తుతున్నారు. అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు కూడా ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవల్సిన అవసరం కూడా ఉంది. ఇంతకాలం ఇలాంటి తప్పిదాలనే ఎత్తి చూపి అధికారంలోకి వచ్చిన తరువాత తాము కూడా అదే బాటలో నడుస్తామంటున్న తీరు మాత్రం సరికాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకులు అధికారిక కార్యక్రమాల్లో ఇక ముందు నుండైనా ఇలాంటి అవకాశాలకు తావివ్వకుండా జాగ్రత్త పడితే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.