బలయ్యాడా… బలి చేశారా..?

సంచలనాల కేసుల్లో ఆయన పేరు

దిశ దశ, హైదరాబాద్:

రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన సంచలనాల కేసుల్లో ఆ అధికారి పేరు ప్రముఖంగా వినిపిస్తుండడం పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత ప్రభుత్వంలో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన కేసులో ప్రముఖంగా వినిపించిన ఆ పోలీసు అధికారి తాజాగా దర్యాప్తు జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ నిందితునిగా వెలుగులోకి రావడం గమనార్హం.

నయీం కేసులో…

ఉమ్మడి నల్గొండ జిల్లాకు అలాట్ అయిన తిరుపతన్న ఉన్నత అడిషనల్ ఎస్పీ స్థాయికి ఎదిగారు. గతంలో భువనగిరి ప్రాంతంలో పనిచేసినప్పుడు అక్కడ జరుగుతున్న వ్యభిచారాన్ని కట్టడి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారన్న పేరుంది. అయితే ఆయన గత ప్రభుత్వం హయాంలో జరిగిన ఎన్ కౌంటర్ లో చనిపోయిన మాజీ నక్సల్ నయీంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ చర్చల్లో నిలిచారు. నయీంతో కలిసి వినాయక ఉత్సవాల్లో పాల్గొనడంతో పాటు ఆయనతో కలిసి తిరిగిన ఫోటోలు ఎన్ కౌంటర్ సమయంలో బయటకు వచ్చాయి. దీంతో తిరుపతన్న వ్యవహారంపై అప్పటి పోలీసు ఉన్నతాధికారులు చాలా సీరియస్ గా వ్యవహరించారు. శాఖాపరంగా కూడా ఆయనపై చర్యలు తీసుకుంటారన్న ప్రచారం కూడా జరిగింది. నయీం ఘటన తరువాత చాలా కాలం వరకు వార్తల్లో వ్యక్తిగా నిలిచారు తిరుపతన్న. ఈయనతో పాటు మరికొంతమంది పోలీసు అధికారుల ఉనికి కూడా వెలుగులోకి వచ్చినప్పటికీ వారంతా కూడా తెరమరుగు అయ్యారు. కొంతకాలానికి ఉమ్మడి మెదక్ జిల్లాలో పోస్టింగ్ అందుకున్న తిరుపతన్న అడిషనల్ ఎస్పీగా కూడా పదోన్నతి పొందారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో…

అయితే తాజాగా కాంగ్రేస్ ప్రభుత్వం దర్యాప్తు చేయిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులోనే తిరుపతన్న పాత్ర ఉందని గుర్తించిన దర్యాప్తు అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసులో అరెస్ట్ అయిన మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కన్ఫెషన్ రిపోర్టులో కూడా తిరుపతన్న ట్యాపింగ్ కేసులో ఏ స్థాయిలో పనిచేశారన్న విషయాన్ని ఊటంకించారు. ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీసు అధికారులంతా కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే కాగా… ఒక్క తిరుపతన్న మాత్రమే యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం. తాజాగా కస్టడీలోకి తీసుకున్న దర్యాప్తు అధికారులు కూడా తిరుపతన్న నుండి సేకరించిన అంశాలను కోర్టు ముందు ఉంచారు. ప్రస్తుతం అయన జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు.

దగ్గరెలా అయ్యాడు..?

అయితే నయీం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసు అధికారులు చాలా మంది కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయనతో సాన్నిహిత్యంగా ఉన్నానరన్న విషయం వెలుగులోకి సదరు పోలీసు అధికారిపై ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించారు. అప్పుడు పోలీసు బాసుల చెప్పుచేతల్లోనే కార్యకలాపాలు కొనసాగించిన నయీంకు ఆశ్రయం ఇచ్చారని… భోజనాలు ఏర్పాటు చేశారని ఇలాంటి చిన్న చిన్న కారణాలతో చార్జి మెమోలు… మెమోలను అందుకున్నారు. చివరకు నయీం డైరీలో పేర్కొన్న అంశాలను డీ కోడ్ చేయమంటూ కూడా ఉన్నతాధికారుల నుండి శ్రీముఖాలు అందుకున్నారు క్షేత్ర స్థాయి అధికారులు. నయీం లింకుల పుణ్యామా అని పోస్టింగులు రాక… పదోన్నతులు అందుకోక నరకయాతన అనుభవించారు. ఇదే కోవలో ఉన్న తిరుపతన్నను అప్పటి పోలీసు అధికారులు అక్కున ఎలా చేర్చుకున్నారన్నదే మిస్టరీగా మారింది. అప్పటి పోలీసు ఉన్నతాధికారులకు నయీం కేసులో టార్గెట్ అయిన గ్రౌండ్ లెవల్ ఆఫీసర్లలో ఒకడైన తిరుపతన్నను విశ్వసనీయమైన వ్యక్తిగా పరిగణంచి ఆయనకు స్పెషల్ ఆపరేషన్లు అప్పగించడానికి అసలు కారణమేంటన్నదే అంతుచిక్కకుండా పోతోంది. అప్పటి అధికారులు తిరుపతన్నను నయీం కేసు బూచిగా చూపించి తమకు అనుకూలంగా మల్చుకున్నారా లేక… నయీం కేసు నుండి బయట పడడానికి తిరుపతన్నే వాళ్లకు అనుకూలంగా మారిపోయాడా అన్న చర్చ తీవ్రంగా సాగుతోంది. అప్పటి సర్కారులో కీలక భూమిక పోషించిన పోలీసు ఉన్నతాధికారులను తమకు అనుకూలంగా మల్చుకోవడంలో తిరుపతన్న సక్సెస్ అయ్యాడని అనుకున్నట్టయితే ఆయనకన్నా ఎక్కువగా లాబీయింగ్ చేసిన వారు, నక్సల్స్ ఆపరేషన్లలో సక్సెస్ అయిన ఆపీసర్లకు కూడా గాడ్ ఫాదర్ లు ఉన్నారు. వారి అండదండలతో మిగతా అధికారులూ ఇలాంటి స్పెషల్ ఆపరేషన్లలో తమ వంతు పాత్ర పోషించే అవకాశం ఉండేది కదా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. నయీం ఘగన తరువాత ఆయనతో క్లోజ్ గా ఉన్నారన్న ఆరోపణలతో చాలామంది పోలీసు అధికారుల పేర్లు తెరపైకి వచ్చినా అందులో ఒక్క తిరుపతన్న మాత్రమే క్రియాశీలక పాత్ర పోషించే స్థాయికి చేరుకోవడం వెనక జరిగిన మతలబు ఏంటన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రధానంగా నయీం విఫయాన్ని అత్యంత తీవ్రంగా అప్పటి ప్రభుత్వం పరిగణించిన సంగతి తెలిసిందే. అలాంటి కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న తిరుపతన్న అదే ప్రభుత్వానికి విశ్వసపాత్రుడిగా ఎలా మారాడన్నదే పజిల్ గా మారింది.

You cannot copy content of this page