దిశ దశ, మహదేవపూర్:
మహదేవపూర్ మండల కేంద్రంలోని బట్టి కొట్టు భూముల వ్యవహారంలో తవ్వినా కొద్ది కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 40 ఏళ్ల క్రితం భూ స్వామికి చెందిన భూమిని కొనుగోలు చేసినట్టుగా రికార్డులు తేల్చి చెప్తున్నాయి. అయితే అధికారులు అప్పుడు ప్రైవేటు వ్యక్తుల భూమిని కొనుగోలు చేసేంత అవసరం ఏమోచ్చిందన్నదే పజిల్ గా మారింది. తాలుకా కేంద్రమైన మహదేవపూర్ లో 600 బంచరాయి, 473తో పాటు పలు సర్వే నంబర్లలో ప్రభుత్వ భూమి వందల ఎకరాల్లో ఉంది. అంతేకాకుండా మహదేవపూర్ శివారును అనుకుని ఉన్న కొత్తపేట, బొమ్మాపూర్, బ్రాహ్మణపల్లి, ఎడపల్లి, కుదురుపల్లి తదితర గ్రామాల్లో కూడా ప్రభుత్వ భూమి ఉండే అవకాశం లేకపోలేదు. అయినప్పటికి 1980లో ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూమిని కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతు అప్పటి తహసీల్దార్ కార్యాలయం నుండి ప్రతిపాదనలు ఎందుకు పంపించారన్నదే అంతుచిక్కకుండా పోతోంది. మరో వైపున 1973 ప్రాంతంలోనే సీలింగ్ యాక్టు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో భూ స్వామికి సంబంధించిన భూమిని కొనుగోలు చేసేందుకు సీలింగ్ రికార్డులను పరిశీలించకుండానే ప్రపోజల్స్ పంపి అనుమతి తీసుకోవడం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటన్నదే అసలు చర్చగా మారింది. సీలింగ్ యాక్టు అమల్లోకి వచ్చిన ఏడేళ్లలోగానే భూ సేకరణ జరిపిన అధికారులు సీలింగ్ పరిధిలోకి ఈ భూములు వస్తాయా లేదా అన్న విషయాన్ని విస్మరించడం విడ్డూరం.
1987లోనే పట్టాలు…
బట్టి కొట్టు ఏరియాలోని 463, 464 సర్వే నెంబర్లలోని భూమిలో కొంతమందికి 1987లో నివేశన స్థలాల కోసం పట్టాలు ఇచ్చినట్టుగా లబ్దిదారుల వద్ద ఉన్న లావాణి పట్టా ప్రొసిడింగ్స్ కాపీలు స్పష్టం చేస్తున్నాయి. అయితే 1980లో సేకరించిన ఈ భూమిని 1987లో మాత్రమే పంపిణీ చేశారా..? లేక అంతకు ముందు కూడా నిరుపేదలకు పంచిపెట్టారా, ఇతర ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించారా అన్న విషయం తేలాల్సి ఉంది. ఒకవేళ 1987 వరకు కొనుగోలు చేసిన భూమిని ప్రభుత్వ అవసరలాకు వినియోగించనట్టయితే 1980లో కొనుగోలు కోసం కలెక్టర్ అనుమతి ఎందుకు తీసుకున్నారన్నది మిస్టరీగా మారింది. మరో వైపున 1987లో 463, 464 సర్వే నెంబర్లలోని 6 ఎకరాల 29 గుంటల భూమిలో పట్టాలు ఇచ్చామని అయితే వాటిని రద్దు చేస్తున్నామని లబ్దిదారులకు రెవెన్యూ అధికారులు బి/2871/2003 షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అయితే ఇదే సర్వే నెంబర్లకు సంబంధించిన భూమిని 1988, 1998-1999లో కొనుగోలు చేసినట్టుగా కూడా రికార్డులు చెప్తున్నాయి. 1999లో కూడా కొనుగోలు చేసిన ఇదే సర్వే నంబర్లలోని భూమిని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా లబ్దిదారులకు పట్టాలు ఇచ్చారు. అయితే లే ఔట్ ప్రకారం ఇఛ్చిన ఈ భూమిలో కమ్యూనీటి అవసరాలు, అంతర్గత రోడ్లకు కూడా భూమిని కెటాయించారు. ప్రభుత్వ భూమిలో లే ఔట్ వేసి మరి లబ్దిదారులకు భూమిని కెటాయించిన అధికారులు అక్కడ మౌళిక వసతులు కల్పించకుండానే రద్దు చేస్తున్నట్టుగా నోటీసులు ఇవ్వడం విచిత్రం. అప్పుడు లబ్దిదారులు తమకు కెటాయించిన భూముల్లో ఇండ్ల నిర్మాణం చేసుకున్నప్పటికీ విద్యుత్, తాగు నీటి వంటి మౌళిక వసతులు లేకపోవడంతో ఇండ్లను వదిలేసి వెల్లిపోయారు. కానీ అధికారులు మాత్రం కబ్జాలో లేరన్న సాకుతో రద్దు చేస్తున్నట్టుగా వెల్లడించారు.
మరో ట్విస్ట్…
2009లో అప్పటి తహసీల్దార్ జిల్లా కలెక్టర్ కు లేఖ నంబర్ B/3098/07 తేది 12.01.2009న ఇచ్చిన నివేదిక సారాంశాన్ని బట్టి 463, 467 సర్వే నెంబర్లలో 89 మందికి ఇచ్చిన పట్టాలను, అలాగే 459 సర్వే నెంబర్ భూమిలో ఇచ్చిన పోజిషన్ సర్టిఫికెట్లను కూడా 2004లోనే రద్దు చేశామని వెల్లడించారు. అంతేకాకుండా 463 సర్వే నెంబర్ లో 14.03 ఎకరాల భూమిలో 2007లో 7.37 ఎకరాల భూమిని నిరుపేదలకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం కెటాయిస్తున్నామని వెల్లడించారు. ఈ లెక్కన ఖాజా మోహినోద్దీన్ కు సంబంధించిన మూడు సర్వే నంబర్లలోని భూమి ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నట్టుగా ఈ లేఖ ద్వారా స్ఫష్టం అవుతోంది. మరో వైపున 2010లో అప్పటి మంథని ఆర్డీఓ విజయ సునిత 463 నంబర్లలోని భూమి మీదుగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పైప్ లైన్ వెలుతున్నందున అక్కడ ఇండ్ల నిర్మాణం చేసుకున్నందున ఇందుకు సంబంధించిన అంచనాలు తయారు చేసి వారికి పరిహారం ఇవ్వాలని మంథని RWS EEకి లేఖ రాశారు. 2004లో కేవలం 89 మంది పట్టాలు మాత్రమే రద్దు చేశామని అధికారి ఇచ్చిన నివేదిక వెల్లడి చేస్తున్నందున మిగతా భూమి లబ్దిదారుల చేతుల్లోనే ఉందా లేక కబ్జాకు గురైందా అన్న విషయాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది.
రికార్డులు అప్ డేట్ చేయలేదా..?
అయితే మహధేవపూర్ మండల కేంద్రంలోని 463, 464, 459 సర్వే నెంబర్ భూములు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని మహదేవపూర్ తహసీల్దార్ ఇచ్చిన నివేదిక సారాంశం వెల్లడి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ భూమిలో ఎలాంటి క్రయవిక్రయాలు జరపకూడదని ఇటు రెవెన్యూ రికార్డులను, అటు రిజిస్ట్రేషన్ రికార్డులను ఎందుకు సవరించలేదన్నదే అర్థం కావడం లేదు. రికార్డుల్లో పట్టాదారుల పేర్లే ఉండడంతో దర్జాగా క్రయవిక్రయాలు జరుపుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది దళారులు ఈ భూములను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని, దీంతో అమాయకులు బలవుతున్నారన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. పహాణీ నఖల్లో ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమి అని రికార్డులు సవరించి, రిజిస్ట్రేషన్ కార్యాలయానికి కూడా సమాచారం ఇచ్చినట్టయితే ఈ పరిస్థితి తలెత్తేది కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం కొనుగోలు చేసిన ఈ భూములతో పాటు సీసీఎల్ఏలోని సీలింగ్ విభాగం రికార్డుల ఆధారంగా ఆయా ప్రాంతాల్లోని భూమిని స్వాధీనం చేసుకున్నట్టయితే బావుంటుందని స్థానికులు అంటున్నారు. దీనివల్ల ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది.