నిబంధనలు పాటించారా..? చిరుద్యోగుల బదిలీల్లో అసలేం జరిగింది..?

దిశ దశ, కరీంనగర్:

రాష్ట్ర ప్రభుత్వం బదిలీల ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాత వివిధ శాఖల్లో బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. కౌన్సిలింగ్ నిర్వహించడంతో పాటు ప్రాధాన్యతాంశాలను పరిగణనలోకి తీసుకుని వారికి పాయింట్లు కెటాయించాల్సి ఉంటుంది. ఉద్యోగులకు వచ్చిన పాయింట్లను ఆధారంగా తీసుకుని వారు అభ్యర్థించిన చోటికి అర్హత ఉన్నట్టయితే ట్రాన్స్ ఫర్ ఆడర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే కొన్ని విభాగాల్లో బదిలీల ప్రక్రియకు సంబంధించిన వ్యవహారంలో నిబంధనలు అమలు కాలేదన్న విమర్శలు ఉన్నాయి. కరీంనగర్, సిరిసిల్ల జిల్లా పరిషత్ పరిధిలో పని చేస్తున్న అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్, అటెండర్ల కౌన్సిలింగ్ విషయంలో చిరుద్యోగులు అంతర్మథనానికి గురవుతున్నారు. న్యాయంగా రావాల్సిన స్థానాలకు కాకుండా ఇతర ప్రాంతానికి బదిలీ చేసేందుకు అధికారులు మొగ్గు చూపారని దీంతో తమకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా జూనియర్ అసిస్టెంట్లు, అటెండర్ల బదిలీల విషయంలోనే అధికారులు తీసుకున్న నిర్ణయాలపై ఆవేదన వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం బదిలీల ప్రక్రియకు సంబంధించి తయారు చేసిన నిబంధనల ప్రకారం స్పౌజ్, మెడికల్ గ్రౌండ్, వితంతువులు, దివ్యాంగులతో పాటు అత్యంత ప్రాధాన్యతాంశాలను పరిగణనలోకి తీసుకుని వారికి కూడా అవకాశం కల్పించాలని దిశానిర్దేశ చేసింది. అయితే కొంతమంది ఉద్యోగుల విషయంలో అధికారులు తీసుకున్న నిర్ణయాలు అశనిపాతంగా మారాయన్న ఆందోళన జడ్పీ ఉద్యోగుల్లో వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం ఆదేశించినట్టుగానే 40 శాతం జాబితా తయారు చేసినప్పటికీ బదిలీలు చేసే ప్రాంతాల విషయంలో పారదర్శకత పాటించలేదన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. కొంతమంది అటెండర్లు తమకు ఫలనా పాఠశాలకు బదిలీ చేయాలని కోరుకోగా అక్కడ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నందున వందకు పైగా సంఖ్య పాఠశాలలకు వెల్లాలన్న సూచనలు కూడా చేశారని తెలుస్తోంది. దీంతో కౌన్సిలింగ్ విధానంలో తమకు మెరిట్ పాయింట్లు ఉన్నప్పటికీ అధికారులు చేసిన ప్రతిపాదనతో అటెండర్లు ఇబ్బందులు పడ్డట్టుగా తెలుస్తోంది. అధికారులు చేస్తున్న సూచనలను గమనించిన అటెండర్లు తమను మండల పరిషత్ కార్యాలయాలకు బదిలీ చేయాలని కోరినట్టుగా తెలుస్తోంది. దీంతో ఎక్కువ మంది అటెండర్లు మండల పరిషత్ కార్యాలయాల్లో విధులు నిర్వర్తించేందుకు మొగ్గు చూపినట్టుగా సమాచారం. సిరిసిల్ల జిల్లాలో జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ బదిలీల్లో అర్హత ఉన్న వారు తమను జడ్పీ కార్యాలయానికి బదిలీ చేయాలని అభ్యర్థించగా అక్కడ ఖాలీ లేదని చెప్పి… సీనియారిటీ జాబితాలో వెనక ఉన్న వారికి జడ్పీలో అవకాశం కల్పించారన్న ప్రచారం జరుగుతోంది. అలాగే కరీంనగర్ జిల్లాలో కూడా అనుకూలమైన ప్రాంతాలను పక్కనపెట్టి తక్కువ పాయింట్లు ఉన్నవారికి న్యాయం చేశారన్న అపవాదు మూటగట్టుకున్నారు అధికారులు.

యూనియన్ల పేరిట…

మరో వైపున యూనియన్లకు సంబంధించిన ఆఫీసు బేరర్లను అభ్యర్థించిన చోట పోస్టింగ్ ఇవ్వాలన్న నిబంధనలు ఉన్నాయి. అయితే ఆయా సంఘాల ప్రతినిధులను పోస్టింగు ఇచ్చే విషయంలో అదికారులు నిర్ణయం తీసుకున్నప్పటికీ ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఆవశ్యకత లేని సంఘాలకు చెందిన బేరర్స్ ను కూడా పరిగణనలోకి తీసుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్ జడ్పీ కౌన్సిలింగ్ విషయంలో అయితే రెండు సార్లు కౌన్సిలింగ్ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. బదిలీలకు అర్హత ఉన్న ఉద్యోగుల సంఖ్య వంద లోపునే ఉన్నా రెండు సార్లు కౌన్సిలింగ్ నిర్వహించాల్సి రావడం వెనక కారణాలు ఏంటో ఉన్నతాదికారులు చొరవ తీసుకోవల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎన్నికల మాటేమిటో..?

అయితే ఉద్యోగ సంఘాల ఆఫీస్ బేరర్లకు సంబంధించి వారు కోరుకున్న చోట పోస్టింగ్ ఇవ్వాలన్న నిబంధనలు ఉన్నాయి. ఇందుకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ సంఘాల కార్యవర్గ ఎన్నికలు నిబంధనలకు అనుగుణంగా జరిగాయా..? అసలు ఆ సంఘాల ఎన్నికలు ఎప్పుడు ఎప్పుడు జరిగాయి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్టయితే ఆఫీస్ బేరర్ల బదిలీల విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండేది. కానీ సకాలంలో ఎన్నికలు జరపకుండా… కొన్నేళ్లుగా ఆఫీస్ బేరర్లుగా కొనసాగుతున్న వారికి జిల్లా కేంద్రాల్లోనే నియమించే ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా విస్మయం కల్గిస్తోంది. జడ్పీ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ విషయంలో సమగ్రంగా విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page