కావాలని చేశారా… కక్షతో చేశారా..? శనిగకుంటకు పట్టిన శని ఎవరి వల్లనో..?

దిశ దశ, మంచిర్యాల:

ఓ వైపున రాష్ట్ర ప్రభుత్వం నీటి వనరుల అస్థిత్వాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో జరిగిన నిర్మాణాలను కూల్చిందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అయితే అక్కడ మాత్రం సాగునీటి కుంట మత్తడినే ధ్వంసం చేసేశారు. ప్రభుత్వ లక్ష్యానికే సవాల్ విసిరిన ఈ ఘటన సంచలనంగా మారింది.

చెన్నూరులో…

జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని శనిగకుంట మత్తడినే పేల్చేశారు దుండగులు. మందుగుండు సామాగ్రిని పెట్టి మరీ పేల్చి వేయడం స్థానికంగా కలకలం సృష్టించింది. డిటోనేటర్లను పెట్టి మరీ మత్తడిని పేల్చివేయడం స్థానికంగా ఆందోళన కల్గిస్తోంది. నేషనల్ హైవే సమీపంలో ఉన్న శనిగకుంట మత్తడిని అగంతకులు పేల్చివేసేంత సాహసం ఎందుకు చేశారన్నదే మిస్టరీగా మారింది. దశాబ్దాల క్రితం నిర్మించిన కాంక్రీట్ మత్తడిని పేల్చి వేసి కుంటలోని నీటిని దిగువ ప్రాంతానికి పంపించడం వెనక దాగి ఉన్న కుట్ర ఏమిటన్న చర్చ సాగుతోంది. కుంట దిగువ భాగాన ఉన్న ఇతర నీటి వనరుల్లో సమృద్దిగా నీరు లేకపోవడం వల్ల ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారా అంటే… గోదావరి తీరంలో ఉన్న ఈ ప్రాంతంలో నీటి కొరత అంతగా ఉండదు. ఇటీవల కురిసిన వర్షాలతో ఈ ప్రాంతంలోని చెరువులు, కుంటలన్ని కూడా జలకళ సంతరించుకునే ఉన్నాయి. అయితే విధ్వంసకారులు కావాలనే ఈ చర్యకు పాల్పడ్డారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నా కేవలం 42 ఎకరాల ఆయాకట్టుకు నీరందించే ఈ కుంటను ధ్వంసం చేయడం వల్ల ఈ ప్రాంతానికి ఒరిగే నష్టం ఏమీ లేదు కదా అని అంటున్నవారూ లేకపోలేదు. విధ్వంసకారులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుకున్నా… నీటి వనరులను నాశనం చేసే ఆలోచన వారికెందుకు వస్తోందన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది.

మందుగుండు ఎలా…

ఘటనా స్థలాన్ని పరిశీలించిన స్థానికులు డిటోనేటర్లను 20 చోట్ల ఏర్పాటు చేసి మత్తడిని పేల్చివేశారని అంటున్నారు. సాధారణంగా పేల్చివేయాలనుకున్న చోట రంధ్రాలు చేసి జిలెటిన్ స్టిక్స్ అమర్చి డిటోనేటర్లను అనుసంధానం చేసి పేల్చివేయాల్సి ఉంటుంది. అయితే శనిగకుంట మత్తడి కాంక్రీట్ తో నిర్మించింది కాబట్టి సాధారణంగా డ్రిల్లింగ్ చేయడం అసాధ్యమనే అంటున్నారు. మందుగుండును అమర్చేందుకు డ్రిల్లింగ్ చేయాల్సి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే కుంట మత్తడి ప్రాంతంలో విద్యుత్ సరఫరా కూడా లేనందును డ్రిల్లింగ్ మిషనరీని ఉపయోగించేందుకు జనరేటర్లు లేదా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాంక్రీట్ నిర్మాణాన్ని కూల్చివేయడం అంత ఈజీగా మాత్రం ఉండదని, ఖచ్చితంగా వ్యూహం రచించే పేల్చివేతకు పాల్పడి ఉంటారని స్పష్టం అవుతోంది. అసలు ఈ కుంట మత్తడిని పేల్చివేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందోనన్నదే అంతు చిక్కకుండా పోతోంది. 

డిటోనేటర్లు ఎక్కడివో..?

అయితే శనిగకుంటను పేల్చివేసేందుకు కుట్ర చేసిన వారు మందుగుండు సామాగ్రిని ఎక్కడి నుండి తీసుకొచ్చారన్న చర్చ కూడా సాగుతోంది. స్థానికంగా మందుగుండు సామాగ్రి వినియోగించే పరిశ్రమలు లేకపోయినప్పటికీ దుండగుల చేతికి పేలుడు పదార్థాలు ఎలా వచ్చి చేరాయోనన్నది కూడా పజిల్ గా మారింది. ముందుగానే తమ పథకాన్ని అమలు చేసేందుకు పేలుడు పదార్థాలను ఈ ప్రాంతానికి తరలించినట్టయితే అవి ఎక్కడ దాచి ఉంచారు..? వాటిని అమర్చినప్పుడు ఎవరి కంట పడకుండా జాగ్రత్తలు పకడ్భందీగా తీసుకున్న చర్యల తీరే విస్మయపరుస్తోంది.

టెక్నాలజీ సహకారంతో…

చెన్నూరు శనిగకుంట మత్తడిని పేల్చివేసిన ఘటనపై ఇరిగేషన్ అధికారి బి విష్ణు ప్రసాద్ చెన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని కూడా సందర్శించిన ఇరిగేషన్ అధికారులు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కుంటలోని నీరు దిగువ ప్రాంతానికి వెల్లిపోకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని ఇరిగేషన్ అధికారి తెలిపారు. మరో వైపున కుంట మత్తడి పేల్చివేత సమాచారాన్ని అందుకున్న చెన్నూరు సీఐ రవిందర్ నేతృత్వంలో పోలీసు యంత్రాంగం ఘటనా స్థలాన్ని సందర్శించింది. ఘటనా స్థలం నుండి పేలుడు కోసం ఉపయోగించిన వైరును స్వాధీనం చేసుకున్నామని సీఐ రవిందర్ తెలిపారు. ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించడంతో పాటు సాంకేతికతను అందిపుచ్చుకుని దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. మొబైల్ కాల్స్ డాటాతో పాటు పట్టణ శివార్లల్లోని సీసీ కెమెరాల రికార్డులు, ఇతరాత్రా టెక్నాలజీ ఆధారంగా ఆరా తీస్తే అసలు నిందితులు దొరికే అవకాశాలు ఉంటాయని పోలీసు వర్గాలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

You cannot copy content of this page