అసలేం జరిగింది..? మేడిగడ్డ బ్యారేజ్ ఏందుకు కుంగిపోయింది..?

దిశ దశ, భూపాలపల్లి:

అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కాళేశ్వరం ప్రాజెక్టు రెండేళ్లుగా ఇబ్బందులు పెడుతోంది. ఉన్నట్టుండి బ్యారేజ్ కుంగి పోవడానికి కారణాలు ఏంటన్నదే మిస్టరీగా మారింది. శనివారం రాత్రి నుండి రాష్ట్రం అంతటా కూడా హాట్ టాపిక్ గా మారిన ఈ అంశం గురించి అధికారులు మాత్ర క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో బ్యారేజ్ పై నుండి రాకపోకలకు సంబంధించిన వంతెన కుంగిపోయిందా..? పిల్లర్స్ కుంగిపోయాయా..? గ్రౌండ్ లెవల్లో వేసిన బెడ్ ఏమైనా డ్యామేజ్ అయిందా అన్నదే అంతు చిక్కకుండా పోయింది. 10 టీఎంసీలకు పైగా నీరు ఉండడంతో గ్రౌండ్ లెవల్లో జరిగిందేమిటో తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో శనివారం సాయంత్రం వరకు 8 గేట్ల ద్వారా దిగువకు నీటిని వదిలిన ఇరిగేషన్ అధికారులు బ్యారేజ్ కుంగిపోయిన అంశం వెలుగులోకి రాగానే బ్యాక్ వాటర్ అంతా కూడా దిగువకు వదులుతున్నారు. 45 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలి బ్యారేజ్ ఖాలీ చేస్తున్నారు. ఆదివారం ఉదయం 6 గంటల వరకు బ్యారేజ్ లో బ్యాక్ వాటర్ 2.154 టీఎంసీలకు చేరడంతో దిగువకు నీటిని వదిలే ప్రక్రియను నిలిపివేశారు.

నో ఎంట్రీ…

మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందన్న విషయం వెలుగులోకి వచ్చిన తరువాత నుండి అటు వైపు ఎవరినీ వెల్లనివ్వడం లేదు. సీఆర్పీఎఫ్ బలగాల పహారతో బ్యారేజ్ పైకి అధికారులు తప్ప వేరేవాళ్లు ఎవరూ వెళ్లకుండా నిలువరిస్తున్నారు. ఆదివారం ఉదయం కూడా ఇదే పరిస్థితి ఉండడంతో అటువైపు సామాన్యులు ఎవరూ కూడా వెళ్లడం లేదు. మీడియాతో పాటు పొలిటికల్ పార్టీల నాయకులను కూడా వెళ్లనివ్వకూడదని ఆదేశాలు వచ్చాయి. దీంతో అక్కడ బందోబస్తు చేస్తున్న పోలీసు అధికారులు ఎవరినీ కూడా బ్యారేజీ వద్దకు అనుమతించడం లేదు. బ్యారేజ్ గేట్ల ద్వారా వదులుతున్న నీరు పూర్తిగా తగ్గిపోయిన తరువాత అక్కడి పరిస్థితులను అంచనా వేసేందుకు ఇరిగేషన్ అధికారులు సిద్దంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే 16వ గేట్ నుండి 21వ గేట్ వద్ద మాత్రం ‘V’ షేపులో బ్యారేజ్ పై భాగం కుంగిపోయినట్టుగా సమాచారం అందుతోంది. ఆ ప్రాంతంలో ఒకటే పిల్లర్ కుంగిపోయిందా లేక మరిన్ని పిల్లర్స్ కూడా కుంగిపోయాయా లేదా వంతెన కోసం వేసిన స్లాబ్ కుంగిపోయిందా అన్న విషయం తేలాల్సి ఉంది.

వాహనాల రాకపోకలా..?

మేడిగడ్డ బ్యారేజ్ మీదుగా వాహనాల రాకపోకలకు అనుమతించడం వల్లే ఈ సమస్య తలెత్తిందన్న వాదనలు తెరపైకి వచ్చాయి. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన మూడు బ్యారేజీలు కూడా రోడ్ కం బ్యారేజ్ గా నిర్మాణం జరుపుతున్నట్టు అప్పట్లోనే అధికారులు, ప్రభుత్వం ప్రకటించింది. వీటి మీదుగా వాహనాల రాకపోకలు కూడా అనుమతిస్తామని కూడా చెప్పారు. ఇప్పుడు మాత్రం వాహనాల రాకపోకల వల్లే కుంగిపోయిందని చెప్తుండడం విస్మయం కల్గిస్తోంది. మరో వైపున ఈ బ్యారేజీలపై కేవలం కార్లు మాత్రమే అనుమతిస్తున్నారు కానీ భారీ వాహనాల రాకపోకలు సాగడం లేదు. దీంతో టన్నుకు మించి బరువు ఉండని వాహనాలే ఈ బ్యారేజ్ మీదుగా తిరుగుతుంటాయని, ఆ ఆ మాత్రం సామర్థ్యాన్ని కూడా తట్టుకునేంత శక్తి లేకుండా బ్యారేజి నిర్మాణం జరిగిందా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఈ లెక్కన ఎగువ ప్రాంతం నుండి వచ్చే భారీ వరద ప్రవాహపు నీటి ధాటికి పిల్లర్లు ఎలా తట్టుకుంటున్నాయన్నదే మిస్టరీగా మారింది.

You cannot copy content of this page