దిశ దశ, వరంగల్:
ఒకే ప్రాంతంలో ప్రకృతి ప్రకోపం చూపిస్తున్న తీరు ఆందోళన కల్గిస్తున్నది. దక్కన్ పీఠభూముల చివరి ప్రాంతంలోనే ఈ మార్పులకు కారణం ఏంటన్నదే అంతు చిక్కకుండా పోయింది. పంచ భూతాల విలయతాండవం చేస్తున్న తీరుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అనుకోకుండా ఎదురయిన విపత్తులు దేనికి సంకేతం అన్నదే అంతు చిక్కకుండా పోతోంది.
ఒకే కారిడార్…
2023 జులై నుండి ఇప్పటి వరకు వచ్చిన విపత్తులు అన్ని కూడా ఒకే కారిడార్ లో నెలకొనడం గమనార్హం. మొదట మోరంచపల్లి సమీపంలో వరద బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. రాత్రికి రాత్రే జల ప్రళయం సృష్టించిన తీరు అందరిని భయభ్రాంతులకు గురి చేసింది. వరద నీటిలో పశువులు, మనషులు కొట్టుకపోవడమే కాకుండా మోరంచపల్లి గ్రామస్థులు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీశారు. ఆ సమయంలో మోరంచపల్లి పరిసర ప్రాంతంలో 600 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదు కావడం గమనార్హం. ఎగువ ప్రాంతాల నుండి వచ్చిన వరద పెద్ద ఎత్తున దిగువన ఉన్న ఏటూరునాగారం సమీపంలోని కొండాయి వంటి గిరిజన గ్రామాలను చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. గోదావరి పరివాహక ప్రాంతాల గ్రామాల వాసులు కూడా రెండు మూడు రోజుల పాటు వరద నీటిలోనే జీవనం సాగించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ములుగు జిల్లాలోని మేడారం అటవీ ప్రాంతంలో ప్రకృతి విలయ తాండవం చేసింది. భారీగా వీచిన సుడిగాలులతో పాటు వాటర్ స్పౌట్స్ ఏర్పడడంతో ఇక్కడి అటవీ ప్రాంతంలో ప్రళయం ఏర్పడింది. గత ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ఈ ప్రాంతంలో 300 మిల్లి మీటర్ల మేర వర్షపాతం నమోదు కావడం గమనార్హం. క్లౌడ్ బ్రస్ట్ కారణంగానే ఈ పరిస్థితి ఎదురైందని ప్రాథమికంగా నిర్దారించారు అధికారులు. బుధవారం ఉదయం తెలంగాణ, ఆంద్రప్రధేశ్, మహారాష్ట్ర, చత్తీస్ గడ్ రాష్ట్రాలలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 5.3గా నమోదయిన ఈ భూకంపం వల్ల ఆయా ప్రాంతాల్లో భారీ నష్టమేమి జరగలేదు. కానీ ప్రకృతిలో ఒక్కసారిగా చోటు చేసుకున్న మార్పులు మాత్రం ఆందోళన కల్గిస్తున్నాయని చెప్పక తప్పదు.
దక్కన్ పీఠ భూములు…
దక్కన్ పీఠ భూములుగా పిలవబడుతున్న తెలంగాణాలో 650 ఏళ్లలో భూకంపం సంభవించిన దాఖలాలు లేవని చరిత్ర చెబుతోంది. 1960 ప్రాంతంలో భద్రాచలం ప్రాంతంలో భూకంపం సంభవించగా తిరిగి ఈ రోజే తెలంగాణ వ్యాప్తంగా భూమిలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూభాగానికి 40 కిలో మీటర్ల లోతు నుండి భూకంపం సంభవించినట్టుగా భగర్భ అధ్యయన శాస్త్రవేత్త కేఎస్ఆర్ మూర్తి వెల్లడించారు. భారతదేశంలో నాలుగు భూకంప మండలాలు ఉండగా వాటిని జోన్ II, జోన్ III, జోన్ IV మరియు జోన్ Vగా గుర్తించారు. ఇందులో జోన్ Vగా గుర్తించిన ప్రాంతంలో అత్యధిక స్థాయిలో భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తేల్చారు జియో సైంటిస్టులు. జోన్ II అత్యల్ప స్థాయిలో భూకంపాలు చోటు చేసుకుంటాయని చెప్తున్నారు నిపుణులు. దేశంలోని 11% ఏరియా జోన్ Vలో, సుమారు 18% ప్రాంతం జోన్ IVలో, 30% జోన్ IIIలో చేర్చగా మిగతా ప్రాంతం జోన్ IIలో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇందులో జోన్ II పరిధిలోనే తెలంగాణ ప్రాంతం ఉందని, ఇక్కడ అత్యల్ప శాతం భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. గత కొంతకాలంగా మాత్రం వికారాబాద్ ప్రాంతంలో భూకంపం సంభవించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసినప్పటికీ తాజాగా వచ్చిన ప్రకంపనలు నాలుగు రాష్ట్రాల్లోనూ ఏర్పడడం సంచలనంగా మారింది. నిపుణులు అంచనా వేసినట్టుగా దక్కన్ పీఠభూములు విస్తరించిన తెలంగాణాలో 1960 తరువాత ఇప్పుడే అధికారికంగా భూకంపం సంభవించిందని చెప్తున్నారు. అయితే 1987, 1990 ప్రాంతంలో కూడా ఓ సారి తెలంగాణాలో భూమి కంపించిందన్న ప్రచారం జరిగినప్పటికీ అధికారిక రికార్డుల్లో మాత్రం ఈ ఘటన నమోదు కాలేదు. దీంతో 1960లో వచ్చిన భూకంపమే చిట్ట చివరిదని రికార్డులు చెప్తున్నాయి.
ఎందుకిలా..?
సహజ వనరులు విస్తరించిన దక్కన్ పీఠభూముల్లో ఖనిజ సంపద కూడా అతి ఎక్కువగా ఉందని పరిశోధకులు చెప్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఖనిజ సంపద దక్కన్ పీఠభూములున్న ప్రాంతాల్లో ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే గోదావరి పరివాహక ప్రాంతంలో బొగ్గు గనుల ద్వారా బొగ్గు నిలువలను వెలికి తీస్తున్న సంగతి తెలిసిందే. మరో వైపున గోదావరి పరివాక ప్రాంతంలో చమురు నిక్షేపాలు కూడా ఉన్నాయని పరిశోధకులు తేల్చారు. ఆయిల్ ఎక్స్ ప్లోరేషన్ కార్పోరేషన్ కు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ టీమ్స్ గోదావరి పరివాహక ప్రాంతంలో 1980, 1999లో సర్వేలు జరిపి నిర్థారించాయి. అయితే చమురు నిక్షేపాలను వెలికి తీసే విషయంలో ముందడుగు పడనప్పటికీ ఇదే ప్రాంతానికి దిగువన ఉన్న ఏపీలోని కాకినాడ కేజీ బేసిన్ లో చమురు వెలికితీత పనులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇవే కాకుండా చాలా రకాల ఖనిజ సంపద ఈ ప్రాంతంలో విస్తరించి ఉన్నట్టుగా స్పష్టం అవుతోంది. బొగ్గు వెలికితీత తరువాత గ్రానైట్ వంటి సహజ వనరుల కోసం తవ్వకాలు జరుపుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే 80 నుండి 100 కిలో మీటర్ల రేడియస్ లోనే ఖనిజాల వెలికితీత కొనసాగుతున్నట్టుగా స్పష్టం అవుతోంది. ఇందులో బొగ్గు నిక్షేపాలు ఒకే ప్రాంతంలో ఉండడం… అక్కడే తవ్వకాలు జరుపుతుండడం గమనార్హం. జులై 2023 నుండి వరసగా ఇదే ప్రాంతంలోని వాతావరణంలో చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తే మాత్రం ఈ ప్రాంతంలో ఏదో వైవిద్యమైన మార్పులు సంభవించి ఉంటాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత 15 నెలలుగా ఈ ప్రాంత ప్రకృతిలో వచ్చిన మార్పులు ఖనిజ సంపద కోసం జరుగుతున్న తవ్వకాల ఎక్కువగా సాగుతుండడం వల్లేనా అన్న విషయంపై నిపుణులు తేల్చాల్సిన అవసరం ఉంది. అయితే ఒక్కోసారి భూమిలోపలి పొరల్లో వచ్చిన కదిలకల వల్ల కూడా భూకంపం సంభవిస్తుందని అంటున్నందున ఇది సహజంగానే జరిగిన పరిణామమా అన్న విషయంపై కూడా స్పష్టత రావల్సిన అవసరం ఉంది. ఒక వేల సహజంగానే భూమిలో వచ్చిన మార్పుల వల్లే కదలికలు సంభవించి ఉన్నట్టయితే మేడారం అడవుల్లో గత ఆగస్టు చివరి వారంలో జరిగిన ప్రకృతి బీభత్సానికి కారణం ఏంటన్నది తేలాల్సి ఉండడమే కాకుండా తాజాగా వచ్చిన భూకంపం కూడా అదే అటవీ ప్రాంతం కేంద్రీకృతంగా రావడానికి కారణం ఏంటన్నది కూడా గుర్తించాల్సిన ఆవశ్యకత ఉంది.
పరిశోధనలు అవసరం: డాక్టర్ అజీజుద్దీన్ ఫైజాన్
15 నెలలుగా ఒకే ప్రాంతంలో జరుగుతున్న ప్రకృతి వైపరిత్యాలపై పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని కాకాతీయ యూనిర్శిటీ పరిశోధకులు డాక్టర్ అజీజుద్దీన్ ఫైజాన్ అభిప్రాయపడుతున్నారు. తెలంగాణాలో జియో సైంటిస్టులు తక్కువ సంఖ్యలో ఉండడం వల్ల వాతావరణంలో అనూహ్యంగా నెలకొంటున్న మార్పులపై పరిశోధనలు జరిపేవారు కరువయ్యారు. ఈ ప్రాంతంలో చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులపై అధ్యయనం చేస్తే వాస్తవాలు తెలిసే అవకాశం ఉంటుంది. తెలంగాణ భూకంపాలు చోటు చేసుకోవడం అత్యంత అరుదని పరిశోధకులు చెప్పారు. బుధవారం వచ్చిన భూకంపం రిక్టర్ స్కేల్ పై 5.3గా నమోదు అయింది. దీనివల్ల తెలంగాణాలో ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ కొంతమేర ఎక్కువ తీవ్రతగా నమోదయిందన్న విషయాన్ని గమనించాలి. మేడారం అటవీ ప్రాంతంలో వర్ష బీభత్సానికి చెట్లు కూడా నేలకూలిపోగా ఇప్పుడు అదే ప్రాంతంలో భూకంపం సంభవించింది. కాబట్టి సమగ్రంగా పరిశోధనలు జరిగినట్టయితే అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది. సహజ సిద్దంగా వచ్చిన మార్పా లేక మానవాళి తప్పిదమా అన్న విషయాన్ని కూడా తేల్చాల్సిన ఆవశ్యకత ఉంది. దీనివల్ల భావి తరాలకు కూడా ఇబ్బంది కలకుండా ఉంటుంది. అలాగే భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితుల్లో జీవనం సాగించాలన్న విషయంపై కూడా అవగాహన కల్పించినట్టు అవుతుంది.