చక్రబంధంలో ఆ జిల్లాల అధికారులు
దిశ దశ, హైదరాబాద్:
సర్కారుకు కాసుల కురిపిస్తున్న ఇసుక కొన్ని జిల్లాల అధికారులను ఛక్రబంధంలో చుట్టేసిందా? డిసిల్ట్రేషన్ పేరిట తీసిన ఇసుక నిబంధనల మేరకే జరిగిందా? ఈ వ్యవహారంలో బంధనాల్లో చిక్కుకున్న అధికారులకు ముప్పు తిప్పలు తప్పదా? వరస పెట్టి ఒక్కో జిల్లాపై ఎన్జీటీ ఇస్తున్న ఉత్తర్వులు గమనిస్తే మాత్రం అధికారులకు ఇబ్బందులు తప్పవనే చెప్పాలి.
ఒక్క సర్టిఫికెట్ చుట్టే అంతా…
వందలకొద్ది లారీల్లో ఇసుక రవాణా అవుతున్నా… ఈ రీచుల అనుమతి వ్యవహారం మాత్రం కేవలం ఒక్క సర్టిఫికెట్ చుట్టే తిరుగుతోంది. అధికారులు ఇచ్చిన అనుమతుల ఆధారంగా పెద్దపల్లి జిల్లాలో మానేరు పరిరక్షణ సమితి చేపట్టిన న్యాయ పోరాటం ప్రభావం మానేరు పరివాహక ప్రాంతాలపై తీవ్రంగా పడుతోంది. పెద్దపల్లి జిల్లాలో ఇసుక రీచుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ మానేరు పరిరక్షణ సమితి నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ చెన్నై సౌత్ బెంచ్ లో విచారణ జరుగుతోంది. కేంద్ర పర్యావరణ విభాగం నుండి ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్ సర్టిఫికెట్ లేదన్న అంశంపై మానేరు పరిరక్షణ సమితి ప్రతినిధులు ఎన్జీటీ ముందు బలమైన వాదనలు వినిపించారు. కేంద్ర పర్యావరణ చట్టాలు ఏం చెప్తున్నాయి..? పెద్దపల్లి మీదుగా ప్రవహిస్తున్న మానేరు నదిలో ఏం జరుగుతోంది అన్న విషయాలపై ఆధారాలతో సహా బెంచ్ ముందు ఉంచారు. దీంతో ఈసీ క్లియరెన్స్ ఇవ్వాలని చెన్నై ఎన్జీటీ బెంచ్ పదేపదే అడుగుతోంది. ఇసుక టెండర్లు నిర్వహించి ఇందుకు సంబంధించిన లావాదేవీలను పర్యవేక్షిస్తున్న టీఎస్ఎండీసీ ఈసీ లేదని బెంచ్ ముందు ఒప్పుకుంది. దీంతో కేంద్ర పర్యావరణ విభాగం కూడా వివరాలు అందించాలని చాలా రోజులుగా బెంచ్ అడుగుతోంది. ఇప్పటివరకూ సంబంధిత శాఖ అధికారులు మాత్రం ఎలాంటి నివేదిక ఇవ్వలేదు. ఇదే సమయంలో ఈసీ ఇచ్చేవరకూ పెద్దపల్లి జిల్లా మానేరు నదిలో ఇసుక తవ్వకాలు జరపొద్దని ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈసీ విషయం పెండింగ్ లో ఉండడంతో ఎన్జీటీ తీర్పు వెలువడే అవకాశాలు లేవని చాలామంది బలంగా విశ్వసించారు. ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం, ఇసుక వ్యాపారుల బలం ముందు మానేరు పరిరక్షణ సమితి బలమెంతా? వీరికి ఇసుక రీచులను నిలవరించే శక్తి లేదన్న చర్చలు సాగాయి. ఇందుకు తగ్గట్టుగానే కొన్ని నెలల పాటు పెద్దపల్లి జిల్లాలో ఇసుక తవ్వకాల ప్రక్రియ కొనసాగింది. పట్టువదలని విక్రమార్కుడిని మరిపించే విధంగా సమితి ప్రతినిధులు వ్యూహాత్మక ఎత్తులు వేసి ఇసుక రవాణాకు సంబంధించిన ఆధారాలు జియో ట్యాగింగ్ తో సహా ఎన్జీటీ బెంచ్ ముందు ఉంచారు. దీంతో ధిక్కరణకు సంబంధించిన పిటిషన్ దాఖలు చేయాలని బెంచ్ మానేరు పరిరక్షణ సమితి ప్రతినిధులకు సూచించింది.
ఆ ఆనవాయితీతో…
పెద్దపల్లిలో ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ ఇచ్చిన ఉత్తర్వులను బేస్ చేసుకుని కరీంనగర్ ఇసుక రీచులపై మరో పిటిషన్ ఎన్జీటీలో దాఖలైంది. దీంతో కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన రీచులకు ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్(ఈసీ) ఉంటేనే నడిపించాలని లేనట్టయితే మూసివేయాలని ఎన్జీటీ స్పష్టం చేసింది. ఈ ఆదేశాల కాపీలను ప్రజావాణిలో ఇచ్చి కరీంనగర్ జిల్లాలోని ఇసుక రీచులను నిలిపివేయాలని కోరారు. ఇప్పటికే జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని సోమవారం బాధిత గ్రామాలకు చెందిన వారు ప్రజావాణిలో బైఠాయించారు.
నేడో రేపో ఆ జిల్లాలో సైతం…
మానేరు నది ప్రవహిస్తున్న ఇతర జిల్లాలకు చెందిన వారు కూడా ఎన్జీటీని ఆశ్రయించేందుకు సమాయత్తం అవుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా ఇసుక రీచుల నిర్వహణపై ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేస్తే కరీంనగర్ జిల్లాలోని రీచులకు ఇచ్చిన ఆదేశాలే రిపిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో మానేరు నదిలో ఇసుక రీచులను నడిపించడం టీఎస్ఎండీసీకి కత్తిమీద సామేనని చెప్పక తప్పదు.
ధిక్కారంపై పిటిషన్?
పెద్దపల్లి జిల్లా ఇసుక రీచుల్లో ఎన్జీటీ ఉత్తర్వులు అమలు చేయలేదని మానేరు పరిరక్షణ సమితి ప్రతినిధులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి, కర్ణాకర్ రెడ్డిలు పిటిషన్ దాఖలు చేశారు. ఎన్జీటీ ఉత్తర్వులు ధిక్కరించారన్న విషయంపై చర్యలు తీసుకోవాలని, ఇందుకు పెద్దపల్లి జిల్లాలోని కొంతమంది అధికారులతో పాటు, టీఎస్ఎండీసీ అధికారులను బాధ్యుల్ని చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో దేశంలోని వివిధ ఎన్జీటీ బెంచులు ఇచ్చిన తీర్పుల వివరాలు, ఆయా తీర్పుల ద్వారా విధించిన పనిష్మెంట్లకు సంబంధించిన డిటైల్స్ కూడా మానేరు పరిరక్షణ సమితి ప్రతినిధులు ఎన్జీటీ తీర్పు ధిక్కారం పిటిషన్ విచారణ సందర్భంగా చెన్నై బెంచ్ ముందు ప్రవేశ పెట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఎన్జీటీ ఎవరెవరిని బాధ్యుల్ని చేస్తుంది..? ఎలాంటి చర్యలు తీసుకోనుందనేది హాాట్ టాపిక్ అవుతోంది.