నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్.. పరోక్షంగా ముందస్తు ఎన్నికలు వస్తాయని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ స్ఫష్టం చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాకతీయ సాండ్ బాక్స్ డెవలప్‌మెంట్ డైలాగ్ కార్యక్రమంలో పాల్గొని ‘టెక్నాలజీ ఫర్ ఇంపాక్ట్ అండ్ స్కేల్’ అనే అంశంపై ప్రసంగించారు. నిజామాబాద్‌లో అన్ని స్థానాలు గెలవాలని కోరారు.
నాలుగేళ్లలో ప్రపంచంలోనే అతి పెద్ద నీటి పారుదల ప్రాజెక్టును నిర్మించామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. లక్ష కిలో మీటర్ల పైప్‌లైన్ వేసి కోటి ఇళ్లకు మంచి నీరు అందిస్తున్నామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో వ్యవసాయంలో తెలంగాణ స్వయం సమృద్ధి సాధించిందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుపై అవగాహన లేనివారు అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతుపక్షపాతి సీఎం కేసీఆర్ విధానాలతో తెలంగాణలో ఐదు రకాల విప్లవాలు వచ్చాయని తెలిపారు. సాగుకు సాంకేతికతను జోడించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని.. ఇందుకు రైతులు కూడా కలిసిరావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
దేశంలోనే విజయవంతమైన స్టార్టప్‌గా తెలంగాణ నిలిచిందన్నారు. గ్రామీణ ప్రాంతాలకు సైతం ఐటీ పరిశ్రమ విస్తరించామన్నారు. ఐటీ ఎగుమతులు రూ.లక్షా 18వేల కోట్లకు పెరిగిందని తెలిపారు. 1987లో ఉన్న జీడీపీ ప్రస్తుతం ఉందని అన్నారు. దేశంలో రాజకీయాల వల్ల ఎకానమీలో వృద్ధి చెందడం లేదని విమర్శించారు. 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు చాలా మంది విమర్శలు చేశారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అధికారం చేపట్టాక 24 గంటలు విద్యుత్ సరఫరా ఇస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.