ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ తీరు దేనికి సంకేతం… బీజేపీ వైపు చూస్తున్నట్టేనా..?

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పుతో రెండు పార్టీలను డిఫెన్స్ లో పడేేసే అవకాశాలు లేకపోలేదు. ప్రధానంగా గ్రాడ్యూయేట్స్ నియోజకవర్గం విషయంలో అయితే స్పష్టత ఏర్పడింది. అభ్యర్థి అంతగా పరిచయం లేకున్నా కూడా బీజేపీ వైపు ఓటర్లు మొగ్గు చూపిన తీరు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో చర్చకు దారి తీస్తోంది. సొంత జిల్లా అయిన మెదక్ ప్రాంతంలో అంజిరెడ్డికి ప్రాధాన్యత లభిస్తుందని ఆశించినప్పటికీ ఆయనకు వచ్చిన ఓట్లు మాత్రం పట్టభద్రుల ఆసక్తి ఏంటో చెప్పకనే చెప్పినట్టయింది. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన పట్టభద్రులు పాల్గొన్న ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి తొలి ప్రాధాన్యత ఓట్లు అందరికంటే ఎక్కువ కావడం గమనార్హం. అంజిరెడ్డి అంటేనే తెలియదని, బీజేపీ నేతలకు డబ్బులు ఇచ్చి టికెట్ కొనుగోలు చేశారంటూ ప్రచారం చేసినా కూడా మెజార్టీ పట్టభద్రులకు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ఒకప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి మీనామేషాలు లెక్కించిన బీజీపీ ఈ సారి అభ్యర్థిని బరిలో నిలిపి తన సత్తా ఏంటో చూపించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువతతో పాటు వివిధ వర్గాలకు చెందిన వారు కమలం పార్టీవైపు చూపుతన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చకు దారి తీసింది.

వ్యతిరేకత…

ఆర్థికంగా బలహీనపడిపోయిన తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను అమలు చేసే విషయంలో విఫలం అవుతోందన్న విమర్శులు తీవ్రంగా ఉన్నాయి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ తీరుపై మండిపడుతున్నాయి ప్రతిపక్ష పార్టీలు. కొంతమేర ప్రజల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ వ్యతిరేకత తమకు లాభిస్తుందని అంచనా వేసుకుంటున్న క్రమంలోనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు గమనిస్తే మాత్రం రెండు పార్టీల ఓటర్లు ప్రత్యామ్నాయ పార్టీ వైపునకు చూస్తున్నారన్న సంకేతాలు ఇచ్చినట్టయింది. గ్రాడ్యూయేట్లు ఓటు ద్వారా ఇచ్చిన తీర్పు గురించి అటు బీఆర్ఎస్ పార్టీలో ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చించే అవకాశం లేకపోలేదు. ఇంతకాలం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఆయా పార్టీల నాయకులు అంచనా వేసుకోగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు ప్రజల దృష్టి బీజేపీ వైపు మళ్లిందని స్పష్టం అవుతోంది.

బీజేపీ దూకుడు…

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ కూడా దూకుడు ప్రదర్శించే అవకాశం లేకపోలేదు. రాష్ట్ర స్థాయి నుండి క్షేత్ర స్థాయి కమిటీల నిర్మాణం చేసుకునే పనిలో నిమగ్నం అయిన కమలనాథులు నేడో రేపో రాష్ట్ర అధ్యక్షున్ని కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీకి పెరిగిన ప్రాధాన్యత ఆధారంగా ప్రజా క్షేత్రంలోకి వెల్లి ఉద్యమాలు చేసే అవకాశాలు లేకపోలేదు. దీంతో పార్టీ మరింత బలోపేతం అయ్యేందుకు దోహదపడుతుందని కూడా పార్టీ నాయకులు కార్యాచరణ కూడా రూపొందించే అవకాశం లేకపోలేదు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ప్రసన్న హరికృష్ణ పేరు ప్రముఖంగా వినిపించినా ఓటు విషయానికి వచ్చేసరికి బీజేపీ అనుకూలంగా మల్చుకోగలిగింది. బయట వచ్చిన టాక్ కు ఓటర్లు ఇచ్చిన తీర్పుతో పొంతనలేకుండా ఉండడాన్ని గమనించి బీజేపీ నాయకులు మరింత సీరియస్ గా పార్టీ నిర్మాణంపై దృష్టి సారించే అవకాశం లేకపోలేదు.

You cannot copy content of this page