అప్పన్నపేట ఘటనపై పోస్టుమార్టం రిపోర్ట్
రాత్రి కూడా కుటుంబ సభ్యుల విచారణ
దిశ దశ, పెద్దపల్లి:
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన అప్పన్నపేట ఘటన పోస్టుమార్టం రిపోర్టుతో ఉల్టాపల్టాగా మారింది. ఏదో జరిగిందన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగడంతో పోలీసు యంత్రాంగం అంతా కూడా హై అలెర్ట్ అయింది. గుట్టు చప్పుడు కాకుండా ప్రాణాపాయ స్థితిలో ఉన్న మైనర్ ను సొంత గ్రామానికి తరలించడంతో అనుమానాలకు మరింత బలం చేకూరింది. దీంతో హుటాహుటిన పోలీసులు అన్ని కోణాల్లో ఆరా తీయడం ఆరంభించారు. ఓ వైపున బాలిక చివరి సారిగా చెప్పిన మాటల ఆడియో రికార్డ్ ఆధారంగా పోలీసులు ఆరా తీస్తూనే వివిధ రకాలుగా దర్యాప్తు చేపట్టారు. బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందని చెప్తున్న రోజున ఆమె ఏఏ ప్రాంతాల్లో తిరిగిందోనని తెలుసుకున్న పోలీసులు ఆయా ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్ కూడా సేకరించారు. ఆమె మొదట రెండు మూడు దుకాణాల్లోకి వెల్లి ఎలుకల మందు కొనుగోలు చేయాలని ప్రయత్నించినప్పటికీ షాపు యజమానులు ఇవ్వలేదని, చివరి దుకాణంలో మాత్రం యజమాని విక్రయించాడాని గుర్తించారు. ఆ తరువాత రాత్రి 12 గంటల ప్రాంతంలో తన అక్కా బావ నివాసం ఉన్న చోటకు వచ్చి తనపై గ్యాంగ్ రేప్ జరిగిందని చెప్పడం… ఆమె వాయిస్ రికార్డ్ చేయడం… ఆ తరువాత ఆమెను మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ జిల్లా కాజ్రీ గ్రామానికి తరలిస్తుండగా మరణించడంతో కేసు సంచలనంగా మారింది. అయితే దుకాణంలో ఎలుకల మందు కొనుగోలు చేసి 12 గంటల వరకు ఇంటికి చేరేవరకు ఏం జరిగింది..? మద్యాహ్నం ఇంటి నుండి బయటకు రాకముందు ఏం జరిగింది అన్న కోణంలో కూడా ఆరా తీసే పనిలో పోలీసులు నిమగ్నం అయ్యారు. అయినప్పటికీ ఇతర రాష్ట్రానికి చెందిన వలస కూలీ కావడంతో చట్టపరమైన సమస్యలు ఎదురుకాకుండా ఉండేందుకు రామగుండం సీపీ రెమా రాజేశ్వరీ రెండు స్పెషల్ టీమ్స్ ను మధ్యప్రదేశ్ కు కూడా పంపించారు. ఏసీపీ ఎడ్ల మహేష్ ఆధ్వర్యంలో పోలీసు బృందం కాజ్రీ చేరుకుని బాలిక మృతదేహాన్ని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం తెల్లవారు జామున 2.40 గంటల ప్రాంతంలో హైదరాబాద్ గాంధీకి మైనర్ మృతదేహాన్ని తీసుకొచ్చిన పోలీసులు శుక్రవారం ఉదయం పోస్ట్ మార్టం చేయించారు. డాక్టర్లు ఇచ్చిన ప్రాథమిక నివేదికపై పోలీసు అధికారులు సమగ్రంగా చర్చించిన అనంతరం రాత్రి 11 గంటల ప్రాంతంలో రామగుండం కమిషనరేట్ కు చేరుకున్నారు. అక్కడే మైనర్ కుటుంబ సభ్యులను కూడా ప్రత్యేకంగా విచారించినట్టుగా తెలుస్తోంది. బాలికపై సామూహిక అత్యాచారం జరగలేదని ప్రాథమికంగా నిర్దారణకు వచ్చిన పోలీసు అధికారులు గ్యాంగ్ రేప్ తో పాటు పోక్సో యాక్టులో నమోదయిన ఈ కేసులో సెక్షన్లను మార్చేందుకు లీగల్ ఓపినియన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
14 వందల కిలో మీటర్ల జర్నీ…
ఈ నెల 14న సామూహిక అత్యాచారం జరగగా 17న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి దాదాపు 1400 కిలోమీటర్ల దూరం వెళ్లి మైనర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుండి నేరుగా హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం తంతు పూర్తయి, సీపీ కార్యాలయం చేరుకునే వరకు దాదాపు 40 గంటల పాటు ఈ కేసు దర్యాప్తులోనే మునిగి తేలారు. చివరకు గ్యాంగ్ రేప్ జరిగినట్టుగా పోస్టుమార్టం నివేదికలో నిర్దారణ కాకపోవడంతో విచారణ అంతా ఒక్కసారిగా మలుపు తిరిగినట్టయింది.
అటు తీసుకెళ్లనట్టయితే…
అనారోగ్యానికి గురైన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి కేసు నమోదు చేయించినట్టయితే ఇంత దూరం వచ్చేది కాదన్న అభిప్రాయాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. బాలిక బ్రతికి ఉన్నందున పోలీసులు కూడా మెజిస్ట్రేట్ వాంగ్మూలం తీసుకునే అవకాశాలు ఉండేవని, అంతేకాకుండా ఆమెకు సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాలు కాపాడేందుకు స్థానిక డాక్టర్లు ప్రయత్నించేవారని అంటున్నారు కొందరు. మంథని మధూకర్ రీ పోస్టుమార్టానికి సంబంధించిన ఓ నివేదికలో అతని శరీరీంపై గాయాలున్నాయని నిర్దారించడంతో రామగుండం పోలీసులు హై అలెర్ట్ గా ఉన్నారు. ఇదే సమయంలో గ్యాంగ్ రేప్ అంశం వెలుగులోకి రావడంతో విభిన్నమైన కోణాల్లో దర్యాప్తు చేశారు. చివరకు ఆ మైనర్ పోస్ట్ మార్టం రిపోర్టులో కూడా అత్యాచారానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నట్టుగా తేలకపోవడంతో పోలీసులు మరో కోణంలో ఆరా తీయడం ఆరంభించారు. అయినప్పటికీ బాలిక మృతదేహంలోకి కొన్ని భాగాలను ఫోర్సెనిక్ లాబోరేటరీకి(ఎఫ్ఎస్ఎల్)కు పంపించేందుకు రామగుండం పోలీసులు సమాయత్తం అయ్యారని సమాచారం. బాలిక చివరి సారిగా మాట్లడిన ఆడియోల ఆధారంగా కూడా ఇంకా విచారించనున్నట్టుగా తెలుస్తోంది. పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా కేసును క్లోజ్ చేయకుండా అనుమానస్పద కేసుగానే పరిగణిస్తూ మరిన్ని ఆధారాల కోసం పోలీసులు ప్రయత్నించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.
Disha Dasha
1884 posts
Prev Post