అక్టోబర్ 4నాటి ఎదురు కాల్పులపై లేఖ
బస్తర్ తూర్పు డివిజన్ కమిటీ విడుదల
దిశ దశ, దండకారణ్యం:
చత్తీస్ గడ్ లోని దంతెవాడ, నారాయణపూర్ సరిహద్దుల్లోని తుల్ తుల్ అడవుల్లో ఇటీవల జరిగిన భారీ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు ఓ లేఖ విడుదల చేసింది. ఆ రోజు అసలేం జరిగింది..? బలగాలు చుట్టు ముట్టు ఎలా దాడి చేశాయి..? ఎన్ని సార్లు ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి అన్న వివరాలతో కూడిన ప్రెస్ నోట్ బస్తర్ తూర్పు డివిజన్ కమిటీ మీడియాకు పంపించింది. ప్రెస్ నోట్ లో అందించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి…
అక్టోబర్ 4న….
అక్టోబర్ 4వ తేది వేకువ జామున 6 గంటల సమయంలో రోలింగ్ చేస్తున్నప్పుడు బలగాలు చుట్టుముట్టిన విషయాన్ని గమనించిన నక్సల్స్ అప్రమత్తం అయ్యారు. 6.30 గంటల నుండి 11 గంటల వరకు శిబిరం చుట్టు ముట్టిన డ్రోన్లు అదృశ్యం అయ్యాయి. 10 గంటల ప్రాంతంలోనే బలగాలు మావోయిస్టుల షెల్టర్ జోన్ ను ముట్టడించాయన్న సమాచారం అందుకున్నాం. వెంటనే శిబిరాన్ని ఖాలీ చేసి వెల్లిపోవాలన్న సమాచారాన్ని షెల్టర్ జోన్ లో ఉన్న సమాచారం చేరవేశాం. 15 నిమిషాల్లోనే కాల్పులు ప్రారంభం కావడంతో ఎదురు కాల్పులు మొదలు పెట్టారు మావోయిస్టులు. మొదట ఓ మహిళా నక్సల్ గాయపడి బలగాల వలయంలో చిక్కుకోగా వారిని ఛేదించేందుకు ఓ బృందం ముందుకు రాగా… బీజీఎల్ గన్స్ ద్వారా కాల్పులు జరుపుతున్న క్రమంలో ఎదురు దాడికి పూనుకున్నారు. బలగాలు జరిపిన కాల్పుల్లో 8 మంది నక్సల్స్ మొదట మరణించగా 12 మంది గాయపడ్డారు. 15 నిమిషాల పాటు ఎదురు కాల్పుల ఘటన తరువాత గాయపడ్డ సహచరులతో కలిసి వెల్లిన కొద్దిసేపటికీ నాలుగోసారి కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు నక్సల్స్ గాయపడ్డారు, అక్కడి నుండి 30 నిమిషాల పాటు కాలినడకన వెల్తున్న క్రమంలో బలగాలు ఎల్ ఫార్మేషన్ లో కూర్చుని కాల్పులు జరిపడంతో రెండు జట్లుగా మావోయిస్టులు విడిపోయారు. ఉదయం 11.30 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మొత్తం 11 సార్లు ఎదురు కాల్పులు కొనసాగాయి. ఈ ఘటనలో 14 మంది మావోయిస్టులు మరణించగా, 17 మంది గాయాలపాలయ్యారు. అక్కడి అడవుల్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని 5వ తేది ఉదయం 8 గంటలకు బలగాలులు కాల్చి చంపాయి. సూరజ్ కుండ్ నిర్ణయం మేరకు విప్లవ పోరాటాలను అణిచివేసేందుకు వ్యూహాత్మక పథకాన్ని అమలు చేస్తున్నారని బస్తర్ తూర్పు డివిజన్ కమిటీ ఆరోపించింది. కార్పోరేట్ అనుకూల విధానాలను అమలు చేసేందుకు ఆపరేషన్ కగార్ చేపట్టి పేద గిరిజనులపై దాడులు చేస్తున్నారని కమిటీ మండిపడింది.
మొత్తం 35 మంది…
అయితే బస్తర్ తూర్పు డివిజన్ కమిటీ పేరిట విడుదలైన లేఖలో మొత్తం 35 మంది మావోయిస్టులు మరణించారని పేర్కొనడం గమనార్హం. అక్టోబర్ 4న జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో 31 మంది మాత్రమే మరణించారని పోలీసులు ప్రకటించగా, తాజాగా మావోయిస్టు పార్టీ విడుదల చేసిన లేఖలో మాత్రం 35 మంది పేర్లను వెల్లడించింది.