అనుమతులు రాకుండానే అత్యుత్సాహం ప్రదర్శించారా..?

మానేరు రివర్ ఫ్రంట్ పై సరికొత్త చర్చ…

దిశ దశ, కరీంనగర్:

సబర్మతిని మరిపించే విధంగా లోయర్ మానేరు డ్యాంను పర్యాటకంగా  అభివృద్ది చేస్తామని చెప్పిన మాటలకు వాస్తవానికి పొంతన లేదా..? టూరిజం స్పాట్ అంటూ ప్రకటనల పర్వం గుప్పించినప్పటికీ పద్దతి ప్రకారం పనులు చేపట్టడంలో విఫలం అయ్యారా..? నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించి భ్రమల ప్రపంచాన్ని సృష్టించారా..? ఇప్పుడిదే చర్చ సాగుతోంది కరీంనగర్ వాసుల్లో.  తాజాగా తెలంగాణ టూరిజం అధికారులు NGTకి ఇచ్చిన నివేదిక మాత్రం అధికార యంత్రాంగం తప్పిదాలను ఎత్తి చూపుతోంది.

అదెలా సాధ్యం..?

వందల కోట్లు వెచ్చించి మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జిల్లా అదికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు పలువురు కూడా దేశ విదేశాల్లో టూర్లు చేసి మరీ ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలోనన్న విషయంపై తెలుసుకునే ప్రయత్నం చేశారు. గుజరాత్ లోని సబర్మతి నది తీరంలో అభివృద్ది చేసినట్టుగానే కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం వద్ద కూడా చేపట్టాలని నిర్ణయించారు. అంతేకాకుండా మానేరు రివర్ ఫ్రంట్ లో భాగంగా చేపట్టాల్సిన నిర్మాణాల కోసం రాష్ట్రంలోని ప్రముఖులు, అధికారులు విదేశాలకు కూడా వెల్లి స్టడి చేసి వచ్చారు. అంతేకాకుండా లోయర్ మానేరు డ్యాం డౌన్ స్ట్రీమ్ ఏరియాలో కొన్ని నిర్మాణాలు చేపట్టగా, డ్యాంలో కూడా పలు నిర్మాణాలు చేపట్టేందుకు సమాయత్తం అయ్యారు. అయితే ఇదంతా బాగానే ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర టూరిజం అభివృద్ది కార్పోరేషన్ అధికారులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ కు ఇచ్చిన నివేదిక ఇప్పుడు వారి తప్పిదాలను ఎత్తి చూపుతున్నాయి. ఎల్ఎండిలో చేపట్టాల్సిన నిర్మాణాలకు సంబంధించిన అనుమతులను ఇరిగేషన్ అధికారులు ఇవ్వకపోవడంతో 2023 జూన్ నుండి ఇక్కడ పనులను నిలిపివేశామని చెప్పారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పర్యాటక రంగం అభివృద్ది చేపట్టాల్సిన ప్రాంతం ఏ విభాగం పరిధిలో ఉందో తెలుసుకుని ఆ విభాగం నుండి అనుమతులు తీసుకోకుండానే దూకుడు ప్రదర్శించడమే. TSTDC అధికారులు 2023 జూన్ నుండే మానేరు రివర్ ఫ్రంట్ పనులకు ఇరిగేషన్ వింగ్ అధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతో నిలివేయాల్సి వచ్చిందని అంటున్నారు. ఇదే సమయంలో ప్రముఖులంతా కూడా దక్షిణ కొరియా, సింగపూర్, సియోల్, ఒసోలలో టూర్లు వేసి ఏం సాధించారనన్నోదే అంతు చిక్కకుండా పోతోంది. టూరిజం పరంగా అభివృద్ది చేయాలనుకున్న ఎలఎండికి ఎగువ ప్రాంతంలో ఫౌంటన్ ఏర్పాటు, గ్యాలరీల నిర్మాణం, దిగువన చెక్ డ్యాం వంటివి కట్టించి బోటింగ్ కు అనుకూలమైన వాతావరణం ఏర్పడేందుకు నీటి నిలువ చేసేందుకు అవసరమైన అనుమతులను ఇరిగేషన్ అధికారుల నుండి తీసుకోకపోవడం విచిత్రం. మానేరు రివర్ ఫ్రంట్ ప్రతిపాదనలు చేశామని, కరీంనగర్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబోతున్నామని ఏళ్లుగా ప్రకటనలు చేసినప్పటికీ సంబంధిత ఇరిగేషన్ విబాగం నుండి పర్మిషన్ తీసుకోకపోవడమే విస్మయం కల్గిస్తోంది. తెలంగాణ టూరిజం కార్పోరేషన్ అధికారులు కూడా తమ పనిని తాము చేసుకుంటూ వెళ్లారు కానీ తాగు, సాగు నీటికి అవసరమైన ఎల్ఎండిలో ఇలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇస్తారా లేదా అన్న విషయాన్ని కూడా పట్టించుకోకపోవడంపై గమనార్హం. ఇరిగేషన్ అధికారులు అనుమతులు ఇవ్వక ముందే TSTDC అధికారులు మానేరు రివర్ ఫ్రంట్ పనులను ప్రారంభించడం వెనక ఆంతర్యం ఏంటన్నదే మిస్టరీగా మారింది.

ఇరిగేషన్ అధికారుల తీరిలా…

ఇకపోతే టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ చేపట్టిన మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు ఇరిగేషన్ అధికారుల నుండి రాకముందే TSTDC యంత్రాంగం అత్యుత్సాహం ప్రదర్శించినట్టుగా స్పష్టం అవుతోంది. అయితే తమ విభాగంతో సంబంధం లేకుండా నిర్మాణాలు ఎలా జరుపుతారంటూ TSTDC చేపట్టిన పనులను ఇరిగేషన్ అదికారులు అడ్డుకోకపోవడం గమనార్హం. పర్మిషన్ లేకుండా పనులు చేపడుతున్నా ఇరిగేషన్ అధికారులు చూసి చూడనట్టుగా ఎలా నిమ్మకుండి పోయారన్న ప్రశ్న తలెత్తుతోంది. TSTDC అధికారులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ కు ఇచ్చిన నివేదిక ప్రకారం అయితే రూ. 4 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణం కోసం మట్టిని కూడా నింపడంతో పాటు, మరిన్ని పనులను చేపట్టారు. లోయర్ మానేరు డ్యాం గేట్లకు దిగువ భాగాన రెండు వైపుల బండ్ నిర్మాణం చేపట్టారు. పెద్ద ఎత్తున మిషనరీలను తీసుకొచ్చి ఇక్కడ పనులు చేపట్టినప్పుడే ఇరిగేషన్ అధికారులు అభ్యంతరాలు చెప్పకపోవడం కూడా అధికారుల చూసి చూడని తీరును స్ఫస్టం చేస్తోం. ఒకే రాష్ట్ర పరిధిలో ఉన్న రెండు విభాగాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాల ప్రక్రియ విషయంలోనే పారదర్శకత లేకుండా వ్యవహరించడం అధికారుల తప్పిదాలను ఎత్తి చూపుతోంది. అనుమతులు లేకపోవడంతో అర్థాంతరంగా పనులు నిలిపివేశామని TSTDC చెప్తున్నదంటే ఇరిగేషన్ అధికారులు తమ విభాగం పరిధిలో నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకోలేదని తేటతెల్లం అవుతోంది.

You cannot copy content of this page