అడ్మినిస్ట్రేషన్ వైఫల్యమేనా…
కాలు జారడం నేరం కాదు కారణం తెలుసుకోక పోవడం ఘోరం అన్న నానుడుని గుర్తుకు తెచ్చుకోవల్సి ఉందిప్పుడు. గ్రూప్స్ ప్రశ్నా పత్రాల లీకేజీకి మూల కారణం వలపు వలేనని నిర్దారించిన యంత్రాంగం ఈ విషయాన్ని ముందస్తుగా ఎందుకు పసిగట్టలేకపోయారు..? ఓ యువతి ప్రవీణ్ తో సాన్నిహిత్యంగా ఉంటున్న విషయమే అయినా పేపర్లు లీకవుతున్నాయన్న విషయమే అయినా ముందుగా గమనించడంలో విఫలం ఎందుకయ్యారన్నదే ఇప్పుడు ఎదురవుతున్న అసలు ప్రశ్ర.
అడ్మినిస్ట్రేషన్ వైఫల్యం ఉందా..?
రాష్ట్రంలో నోటీఫికేషన్ల జాతర నడుస్తోంది… ఎక్కువగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే రిక్రూట్ మెంట్ ప్రక్రియకు సర్కారు ప్రాధాన్యత ఇచ్చింది. రాజ్యంగా బద్దమైన ఈ కమిటీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదన్నది వాస్తవం. అయితే అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ కు కారణం ఎవరు..? అత్యంత కీలకమైన పరీక్షలు జరుగుతున్న సమయంలో కింది స్థాయి సిబ్బందిని కట్టడి చేయాల్సిన బాధ్యత ఎవరిపై ఉంటుందన్నదే అసలు ప్రశ్న. ఈ కేసులో 9 మందిపై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచిన పోలీసులు తిరిగి కస్టడి పిటిషన్ వేశారు. ఇందుకు కోర్టు అనుమతించడంతో నిందితులను జైలు నుండి కస్టడీలోకి తీసుకుని పోలీసులు వివిధ కోణాల్లో విచారించనున్నారు. ప్రధానంగా ఇలాంటి పరీక్షలు నిర్వహించేప్పుడు రక్షణ విభాగంలో తీసుకుంటున్న విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే సాంప్రాదాయం ఉండాలి. సాంకేతికత ఆధారంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షా పత్రాలు తయారు చేస్తున్న క్రమంలో ఈ బాధ్యతలు అప్పగించిన టీమ్ పై ఉన్నత స్థాయిలో అజమాయిషీ లేకపోవడమే అక్రమార్కులకు లాభించిందా అన్న విషయం తేలాల్సి ఉంది. పరీక్షా పత్రాలు లీక్ కాకుండా ఉండేందుకు విధుల్లోకి వచ్చే ఉద్యోగులను క్షుణ్ణంగా పరిశీలించడం… తిరిగి వారు ఇంటికి వెల్లేప్పుడు పూర్తి స్థాయి తనిఖీలు నిర్వహించడం చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీరు పని చేస్తున్న కార్యాలయ గదుల చుట్టూ కూడా భద్రాతా వలయాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాగే వీరి మెయిల్స్, సోషల్ మీడియా అకౌంట్స్ తో పాటు ఇతరాత్ర రహస్య యాప్స్ ద్వారా కూడా పేపర్ లీకేజీ చేసే అవకాశం ఉందన్న విషయాన్ని పసిగట్టి ముందు నుండే కట్టడి చర్యలు తీసుకోవల్సి ఉంటుంది. వారి ఇంటి వద్ద కానీ ప్రైవేటు ప్లేసెస్ లో కానీ ఏం చేస్తున్నారన్న విషయంపై నిఘా వేయాల్సి ఉంటుంది. కానీ ఇవన్నింటిపై దృష్టి సారించకపోవడం వల్లే ఇంతదూరం వచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రవీణ్ పెన్ డ్రైవ్ లో మరి కొన్ని పేపర్లకు సంబంధించిన ప్రశ్నా పత్రాలు కూడా ఉన్నాయని పోలీసుల విచారణలో తేలింది. అంటే ఆయన పెన్ డ్రైవ్ లోకి వాటిని కాపీ చేసుకునేంత సాహసం చేయడం వెనకున్న కారణాలేంటి..? ఆయన తనపై అధికారులను ప్రలోభాలకు గురి చేశాడా లేక వారిని మాయ మాటల్తో బోల్తా కొట్టించి తన పనిని సులువుగా చేసుకుంటూ వెల్లాడా అన్న విషయంపై దృష్టి సారించాల్సి ఉంది. సాధారణంగా ఇలాంటి సంఘటనలు అతి నమ్మకం కల్గించిన తరువాతే పై అధికారులను బోల్తా కొట్టించేందుకు ప్రయత్నించి ఉంటారన్నది వాస్తవం. ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఆయన పై అధికారులు వ్యవహరించారా లేక సీక్రెట్ గా సాగుతున్నదన్న అతి నమ్మకంతో ప్రవీణ్ కు స్వేచ్ఛనిచ్చారా అన్న అనుమనాలూ వ్యక్తం అవుతున్నాయి.
టెక్నాలజీపై పట్టుందా..?
సాంకేతిక విషయంలో ఒకప్పటి తరానికి నేటి తరానికి చాలా తేడా ఉంటుందన్నది మాత్రం వాస్తవం. అప్ డేటెడ్ వర్షెన్లకు నేటి తరం కేరాఫ్ అయితే ఔట్ డేటెడ్ వర్షెన్లుగా నాటి తరం మిగిలిపోయారన్నది నిజం. బేసిక్స్ పై పట్టు సాధించడం తప్ప లోతుగా సాంకేతికతను అందిపుచ్చుకున్న వారి సంఖ్య అతి తక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో టెక్నికల్ సమస్యలు ఎదురైనప్పుడు థర్ట్ పార్టీలను ఆశ్రయిస్తున్నారు తప్ప శాశ్వత పరిష్కారం చేసేందుకు సంస్థల్లో పని చేస్తున్న వారు లేకపోవడం గమనార్హం. మరో వైపున టెక్నాలజీ విషయంలో కూడా ప్రవీణ్, రాజశేఖర్ లు ఇద్దరూ కూడా తమ పై అధికారులను మిస్ గైడ్ చేసినట్టుగా స్పష్టమవుతోంది. వారి సిస్టమ్స్ సంబందించిన అన్నింటిని తస్కరించినట్టుగా సిట్ విచారణలో తేలింది. అంటే అక్కడ పనిచేస్తున్న పై అధికారులు సాంకేతికత విషయంలో అంతగా పట్టు లేదన్న విషయం తేటతెల్లం అవుతోంది. ఒక వేళ టెక్నాలజీపై పట్టున్నట్టయితే… రాజశేఖర్ కీలకమైన అంశాలను తన గుప్పిట పెట్టుకున్నా గుర్తిచలేకపోవడం వెనక కారణాలేంటనన్న ప్రశ్న మొదలవుతోంది.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఎలా..?
ఇకపోతే లక్షలాది మంది నిరుద్యోగుల భవితవ్యానికి సంబందించిన ఈ అంశంపై టీఎస్పీఎస్సీ కూడా అంతగా సీరయిస్ గా తీసుకోలేదోమోననన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఔట్ సోర్సింగ్ అయినా కాంట్రాక్టు ఉద్యోగి అయినా సంస్థలో పనిచేసినంత సేపటి వరకే సంబంధం కానీ ఆ తరువాత ఆ ఉద్యోగిని తొలగించాలని అధికారులు కానీ, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ కానీ నిర్ణయించినట్టయితే ఉద్యోగిని ఇంటికి పంపిచేయవచ్చు అంతేకాకుండా వీరిపై కీలకమైన బాధ్యతలు అప్పగించే విషయంలో కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ విషయంలో మాత్రం అధికారులు అంత స్వేచ్ఛనివ్వడానికి కారణాలేంటన్నదే మిస్టరీగా మారింది. సాంకేతిక నిపుణుడు అయినంత మాత్రాన రెగ్యూలర్ ఉద్యోగి కాడన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కాన్ఫిడెన్షియల్ విషయాల్లో అతన్ని పక్కన పెట్టకపోవడం విస్మయం కల్గిస్తోంది. సిస్టమ్స్ ను తన ఆధీనంలోకి తీసుకునేందు స్వేచ్ఛ రాజశేఖర్ కు ఇవ్వడం వెనక కారణాలేంటీ అన్నది కూడా తెలుసుకోవల్సిన అవసరం ఉంది. కేవలం సాంకేతిక నిపుణుడన్న కారణాన్ని అధికారులు చూపించిన పూర్తి స్వేచ్ఛనివ్వడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గత అక్టోబర్ నుండే వీరు పేపర్ల లీకేజీలకు శ్రీకారం చుట్టారని ఏడాది క్రితమే స్కెచ్ వేశారని సిట్ దర్యాప్తులో తేలినందున నిర్లక్ష్యపు నీలి నీడలో… వీరితో మిలాఖత్ అయిన హస్తాలెవరివో వెలుగులోకి తీసుకరావలని, ఇక ముందు ఇలాంటి తప్పిదాలు జరగకుండా ఉండాలంటే ఇందులో భాగస్వామ్యం ఉన్న ప్రతి ఒక్కరిపై కఠినంగా వ్యవహరించాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇతరుల జీవితాలతో ఆడుకుంటే కఠిన చర్యలు ఇలా ఉంటాయన్న విషయాన్ని చేతల్లో చూపించినట్టయితే భావితరాలు కూడా తప్పుడు మార్గాలు ఎంచుకునే అవకాశాలు ఉండవు.