త్రివేణి సంగమం నుండి సరయూ వరకు… ఆనాడేం జరిగింది..? 1990 కరసేవకులు

దిశ దశ, భూపాలపల్లి:

కరసేవ… విశ్వహిందూ పరిషత్ సృష్టించిన ఓ చరిత్ర. 1990లో అయోధ్యకు కరసేవకులు కదలిరావాలన్న పిలుపుతో దేశ వ్యాప్తంగా కూడా లక్షలాది మంది  బయలుదేరారు. అయితే ఈ కార్యక్రమంలో మారుమూల ప్రాంతాలకు చెందిన వారూ ‘మేము సైతం’ అంటూ కదనరంగంలోకి దూకారు. సమాచార వ్యవస్థ అంతగా లేని ఆ సమయంలో కూడా ఆ ప్రాంతం నుండి 16 మంది కరసేవకులు అయోధ్యకు వెళ్లారంటే శ్రీరాముడి ప్రభావం ఎంతటితో అర్థం చేసుకోవచ్చు. కలిసి వెల్లిన వారంతా  మార్గ మధ్యలో ఎదురైన అవాంతరాలతో వీడిపోయి కలుసుకున్నారు. ఎటు వైపు నుండి లాఠీలు తమపై నాట్యం చేస్తాయోనన్న భయం ఒక వైపు అయితే… మన సహచరులు ఏమయ్యారోనన్న ఆందోళన మరో వైపు… అయినా వారంతా కూడా అయోధ్య చేరడమే లక్ష్యంగా పెట్టుకుని వాగులు వంకలు, అడవుల్లో నడుచుకుంటూ ముందుకు సాగారు.

వారణాసి జైలు జీవితం గడిపినప్పటి సర్టిఫికెట్

అటవీ ప్రాంతం నుండి…

గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల సంగమ సమీపంలోని మహదేవపూర్ అటవీ ప్రాంతం నుండి 16 మంది కరసేవకులు అయోధ్య రాముని ఆలయం కోసం కదం తొక్కగా స్థానిక ప్రజలంతా వారికి ఘనమైన సత్కారాలు చేసి సాగనంపారు. సరయూ నది తీరాన వెలిసిన సాకేతపురానికి చేరుకోవాలన్న లక్ష్యంతో రైలెక్కిన వీరికి జోన్ పూర్ వద్ద పోలీసులు అరెస్ట్ చేసి ఓ బీడి ఫ్యాక్టరీలోకి తరలించారు. మరునాడు ఉదయం వారందరని వదిలేయగా సమీపంలోని ఓ ప్రాజెక్టు వద్ద కాలకృత్యాలు ముగించుకుంటున్నారు. వీహెచ్పీ కార్యకర్తలు ఆహారం తీసుకొచ్చి వారికి చేరవేస్తున్న క్రమంలో ప్రాజెక్టుకు మరో వైపు నుండి భారీగా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. ఏదో ఉప ధృవం ముంచుకొస్తుందేమోనన్న భయంతో ప్రాజెక్టు దిగువ ప్రాంతం వైపు పరుగు అందుకున్నారు. ఆ రోజు నుండి మరునాడు ఉదయం వరకు అలా నడక సాగిస్తూనే ఉన్న వారికి ఓ ఊరు తారసపడగా అక్కడ కనిపించిన ఓ రైతును కలిసి అభ్యర్థిస్తే ఆయన అక్కడి వీహెచ్పీ నేత ఇంటికి తరలించారు. ఆయన వారికి సపరిచర్యలు చేసిన అనంతరం మళ్లీ అయోధ్య వైపు పయనం సాగించడం ఆరంభించారు. అలహాబాద్ చేరుకున్న తరువాత లాఠీ చార్జి చేసిన పో్లీసులు అందరినీ తీసుకెళ్లి వారణాసి సెంట్రల్ జైలుకు తరలించారు. అంతకు ముందు డబోరా అనే ప్రాంతంలోనూ పోలీసులు అరెస్ట్ చేసి ఓ మందుల ఫ్యాక్టరీకి తరలించారు. అంటూ మూడు దశాబ్దాల క్రితం అయోధ్య కరసేవకు వెల్లిన వారు వివరించారు. వారణాసి జైలు నుండి విడుదలైన తరువాత అయోధ్యకు వెల్లి సరయూ నదిలో పుణ్య స్నానాలు చేసి శ్రీరాముని సన్నిధిని దర్శించుకున్నాం అంటూ కరసేవకులు వివరించారు. రైళ్లో సాగిన మా ప్రయాణాన్ని ఎక్కడికక్కడ నిలువరించి తమను అరెస్ట్ చేయడం, మిలటరీ బలగాలు లాఠీఛార్జీలు చేస్తూ ఝులూం ప్రదర్శించడం వంటి చర్యలకు పూనకున్నా తాము మాత్రం అయోధ్యకు చేరాలన్న సంకల్పంతోనే ముందుకు సాగామని తెలిపారు. మహదేవపూర్ ప్రాంతం నుండి 16 మందిమి ఒక్కటిగా కలిసి వెల్తే మార్గమధ్యలో ఎదురైన అవాంతరాలతో తామంతా చెల్లచెదురైపో్యాం. ఎవరికీ వారుగా విడిపోవల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎటు వైపు నుండి బలగాలు తమను చుట్టుముడ్తాయోనన్న భయం మమ్మల్ని వెంటాడుతోంది. మిలటరీ కళ్లకు చిక్కకుండా తప్పించుకుంటూ తిరుగుతున్న మేం ప్రాణాలతో బయటపడతామా అన్న ఆందోళన గురవుతున్నా తమతో వచ్చిన సహచరులు ఏమయ్యారోనన్న కలవరంతోనే ముందుకు సాగాం. ఆహ్మదాబాద్ లో అరెస్ట్ చేసినప్పుడు విడిపోయిన మేమంతా మళ్లీ కలుసుకోవడంతో మా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ ఆ ఆనందం ఎంతో సేపు మాలో లేదు మమ్మల్ని వదిలేసిన తరువాత అయోధ్య వైపు సాగుతున్న మమ్మల్ని పోలీసులు వాహనాల్లో తరించే క్రమంలో మళ్లీ విడిపోవల్సి వచ్చింది. భయం గుప్పిటనే సాగిన కరసేవ చివరకు అయోధ్యకు వెల్లేందుకు అనుమతి లభించడంతో సంతోషంతో ఆనందంతో అక్కడకు చేరుకున్నాం. మహదేవపూర్ కు చెందిన బన్సోడ రామారావు, తడకమట్ల విఠల్, కొలిపాక వెంకటేశ్వర్లు, కేదారి జ్యోతిశ్వర్ రావు, మేరుగు కిష్టయ్య, సిరంగి రామయ్య, బొమ్మాపూర్ కు చెందిన నాగుల బాల్ రెడ్డి, వెన్నపురెడ్డి రాంరెడ్డి, సురారంకు చెందిన అల్లంకి వెంకటేశ్వర్లు, అంబటిపల్లికి చెందిన కొర్రిపల్లి శంకర్ రావు, బ్రాహ్మణపల్లికి చెందిన కొర్రిపల్లి కిషన్ రావు, మేచినేని అచ్యుత్ రావు, సముద్రాల వెంకటేశ్వర్ రావు, కొర్రిపల్లి రాజేశ్వర్ రావు, కాళేశ్వరానికి చెందిన మాడ్గులు బాపు శర్మ, మహాముత్తారం మండలం మాదారం గ్రామానికి చెందిన పంతకాని సమ్మయ్యలు 1990లో జరిగిన కరసేవలో పాల్గొన్నారు.


అయోధ్య రాంరెడ్డిగా మారిన వెన్నపురెడ్డి రాంరెడ్డి

ఇంటిపేరే మారిన వైనం…

మహదేవపూర్ మండలం బొమ్మాపూర్ గ్రామానికి చెందిన వెన్నపురెడ్డి రాంరెడ్డి అయోధ్యకు కరసేవకు వెల్లొచ్చిన తరువాత ఇంటిపేరే మారిపోయింది. గ్రామంలో రాంరెడ్డి పేరిట చాలా మంది ఉండడంతో పాటు వెన్నపురెడ్డి అనే ఇంటి పేరు కల కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. దీంతో గ్రామంలో ఫలనా రాంరెడ్డి ఎక్కడ ఉన్నాడు అని అడిగితే ఫలనా వాళ్ల అబ్బాయనో, పంచాయితీ లేదా స్కూలు వద్ద ఇల్లుంటుందనో చెప్పే వారు. కానీ ఈ రాంరెడ్డి అయోధ్యకు వెల్లొచ్చిన తరువత ఆయన పేరే అయోధ్య రాంరెడ్డిగా మారిపోయింది. వెన్నపురెడ్డి రాంరెడ్డి అనగానే అయోధ్య రాంరెడ్డా..? అని అడగడం మొదలైంది. దీంతో బొమ్మాపూర్ గ్రామస్థులే కాకుండా మహదేవపూర్ ప్రాంత వాసులు కూడా ఆయన్ని ఆయోధ్య రాంరెడ్డి అని పిలవసాగారు. మూడు దశాబ్డాలు దాటినా ఆయన్ని నేటికీ అయోధ్య రాంరెడ్డి అని పిలుస్తుంటారు. నేటి తరానికి చెందిన కొందరు ఆయనను అయోధ్య రాంరెడ్డి అని ఎందుకు పిలుస్తారో తెలియక వాకబు చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు. అయితే ఆయన కరసేవకు వెల్లి రావడం వల్ల ఇంటిపేరు మారిపోయిందని ఈ ప్రాంతానికి చెందిన వారు నేటి తరం వారికి వివరిస్తుంటారు.

10వేల మంది చనిపోయారు: బన్సోడ రామారావు, మహదేవపూర్

అయోధ్య శ్రీరామ జన్మభూమిలో ఆయన మందిరమే నిర్మించాలన్న లక్ష్యంతో చేపట్టని కరసేవలో పాల్గొన్నప్పుడు ఎన్నో రకాలుగా మనో వేదనకు గురయ్యా. బలగాలు చేపట్టిన కాల్పుల్లో 10 వేల మంది చనిపోయారన్న విషయం తెలిసి చలించిపోయాను. చారిత్రాత్మక అయోధ్య రాముని ఆలయం కోసం అంతమంది ప్రాణాలు కోల్పోవడం ఏంటని నేను కలిసిన వీహెచ్పీ నాయకులను కూడా పలు సందర్భాల్లో అడిగాను. అయోధ్య చేరుకునే వరకు నిర్భందాలు ఎదుర్కొంటూ ఎన్నో కష్టాలు, నష్టాలు పడ్డాం. అయితే వాహనాల్లో వెల్తే పోలీసులు అరెస్ట్ చేస్తుండడంతో కాలిబాటన కూడా నడచుకుంటూ వెల్లాం. రోజులకొద్ది నడుచుకుంటూ సాగుతున్న మా ప్రయాణంలో ఉత్తరప్రదేశ్ గ్రామాలు తారసపడినప్పుడు అక్కడి ప్రజలు మమ్ములను అక్కున చేర్చుకున్న తీరు మరిచిపోలేనిది. ఆహారం ఇస్తూ షెల్టర్ ఇచ్చిన తీరు తో పాటు అయోధ్యలో రాముని కోసం వచ్చిన యోధులుగా మాకు మర్యాదలు చేశారు. వారణాసి జైలు నుండి మమ్మల్ని విడుదల చేసిన తరువాత అధికారికంగా అనుమతి లభించింది. ఆ తరువాత రైళ్లలో అయోధ్య నుండి ఇంటి చేరుకున్నాం. 34 ఏళ్లకు తాము పడ్డ కష్టం ఆలయ నిర్మాణంతో ఆనందాన్ని కల్గిస్తోంది.

బన్సోడ రామారావు, మహదేవపూర్

ఆలయ నిర్మాణం సంతోషాన్నిస్తోంది: పంతకాని సమ్మయ్య, మాదారం

అయోధ్య రామయ్య ఆలయం నిర్మించాలన్న లక్ష్యంతో విశ్వహిందూ పరిషత్ ఇచ్చిన పిలుపునందుకుని ఓ కుగ్రామమైన మాదారం నుండి కూడా కరసేవలో పాల్గొనేందుకు పంతకాని సమ్మయ్య వెల్లారు. ఆ నాడు అయోధ్యకు వెల్తున్న క్రమంలో ఎదురైన పరిస్థితులను ఆయన వివరించారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొవల్సి వచ్చిందని తమను ఎక్కడిక్కడ మిలటరీ బలగాలు అడ్డుకుంటూ జులూం ప్రదర్శించాయి. అయినా ముందుకు సాగాలన్న మా సంకల్ప బలమే అయోధ్యకు చేర్చింది. అరెస్టులు చేయడం వదిలేయడం ఇలా ఎన్నో సందర్భాల్లో జరిగింది. రోజుల కొద్ది కాలి నడకన కూడా గమ్యం వైపు సాగాం. ఆనాటి భయానక పరిస్థితులు ఊహించుకుంటేనే ఒళ్లు జలధరిస్తుంది. అయినప్పటికీ గ్రామాల్లోకి వెల్లినప్పుడు అక్కడి ప్రజలు మమ్ములను కడుపులో పెట్టుకుని కాపాడుకున్నారు. మా ప్రాంతం నుండి వెల్లి అలహాబాద్ నదికి అవతలి వైపు స్థిరపడిన వారింటికి వెళ్లాం. మూడు రోజుల పాటు మాకు వారింట్లోనే స్థావరం ఇచ్చారు. అయితే ఈ విషయం తెలిసి పోలీసులు ఆ ఇంటికి వచ్చి మీ ఇంట్లో కరసేవకులు ఉన్నారట కదా అంటూ ఇంటి యజమానిని హెచ్చరిస్తూ అడిగారు. అయితే వారు కరసేవకులు కాదు మా ఇంట్లో వేడుకకు హాజరయ్యేందుకు వచ్చిన మా బంధువులు అని చెప్పి పంపించారు. ఆ తరువాత వారి ఇంటి నుండి బయలు దేరి అయోధ్యకు చేరుకున్నాం. అయితే ఇన్నాళ్లకు కళ సాకారం కావడం మాత్రం ఆనందాన్ని కల్గిస్తోంది. అయోధ్య జగదబి రాముడిదేనని పోరాటం చేసి చివరకు విజయం కావడం సంతోషం. జనవరి 22న ఆలయాన్ని ప్రారంభించనున్నారు. అయితే ఇప్పుడు రద్దీ తీవ్రంగా ఉంటుంది కాబట్టి మార్చి నెల తరువాత అయోధ్యకు వెల్లి ఆ రాముడిని దర్శించుకుని తనవితీరా చూసి తరిస్తా.

You cannot copy content of this page