దిశ దశ, వరంగల్:
ములుగు జిల్లా మేడారం అటవీ ప్రాంతం కేంద్రీకృతంగా భూకంపం రావడానికి కారణాలు ఏంటీ..? భూమి పొరల్లో కదలికలు జరగడం వల్లే భూకంపం వచ్చిందా..? మూడు నెలల క్రితం క్లౌడ్ బ్రస్ట్ అయిన ఇదే ప్రాంతంలోనే భూకంపం రావడానికి కారణం ఏంటన్నదే అంతు చిక్కకుండా పోయింది. అధికారులు మాత్రం మేడారంలో నేల కూలి పోయిన చెట్లకు… భూకంపానికి ఏ మాత్రం సంబంధం లేదని ప్రకటించారు. కానీ ఒకే చోట వరసగా రెండు సార్లు ప్రకృతి బీభత్సం సృష్టించడానికి కారణాలేంటన్నదే తేల్చాల్సిన అవసరం ఉంది.
టెక్టోనిక్ ప్లేట్…
గోదావరి పరివాహక ప్రాంతంలోని మేడారం అడవుల్లో సంభవించిన భూకంపం టెక్టోనిట్ ప్లేట్లలో వచ్చిన కదలికలు మాత్రమేనని సహజంగానే భూమిలో ఇలా జరుగుతూ ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అయితే ఇక్కడే భూకంపం రావడానికి ప్రధానంగా ఆగస్టులో వచ్చిన క్లౌడ్ బ్రస్ట్ కూడా ఓ కారణమై ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి సృష్టించిన ఆనాటి బీభత్సం కారణంగా మేడారం అడవుల్లోని భూమిలోని పొరల మధ్య అంతరం ఏర్పడడం కానీ, సాయిల్ లూజ్ కావడం కానీ జరిగి ఉంటుందని దీనివల్లే బలహీనంగా ఉన్న ఆ ప్రాంతం కేంద్రీకృతంగా భూకంపం సంభవించి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 1969లో ములుగు ప్రాంతానికి దిగువన ఉన్న భద్రాచలం ప్రాంతంలో భూకంపం సంభవించిందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. రిక్టర్ స్కేల్ పై 5.7గా భూకంప తీవ్రత అప్పుడు నమోదు కాగా తాజాగా వచ్చిన భూకంపం 5.3గా రికార్డు అయింది. 55 ఏళ్ల క్రితం వచ్చిన తీవ్రత కంటే ఇప్పుడు వచ్చిన తీవ్రత తక్కువేనని స్పష్టం అయింది. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ ఏంటంటే… సింగరేణి ప్రభావిత ప్రాంతం కూడా అయిన తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతంలో అండర్ గ్రౌండ్, ఓపెన్ కాస్ట్ బావులు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఆరు జిల్లాల్లో విస్తరించిన సింగరేణి వల్ల తరుచూ భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేల్ పై 2.0గా నమోదు అవుతుందని కొంతమంది నిపుణులు చెప్తున్నారు. ఈ లెక్కన చూసుకున్నట్టయితే సింగరేణి గనులు విస్తరించిన ప్రాంతంలో భూమి బలహీనంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. నల్ల బంగారాన్ని వెలికి తీసేందుకు పేలుడు పదార్ధాలను ఉపయోగించి బ్లాస్టింగ్ చేస్తుండడం సింగరేణి ఏరియాలో సర్వ సాధారణం. పేలుళ్ల వల్ల భూమి లోపలి పొరలు కూడా బలహీన పడుతుంటాయి. భూకంపం బొగ్గు బావులు ఉన్న ప్రాంతాల్లో రాకుండా సాధారణ ఏరియాలో కేంద్రీకృతమై రావడమేంటన్నదే అంతు చిక్కడం లేదు. అయితే ములుగులో జరిగిన క్లౌడ్ బ్రస్ట్… బొగ్గుబావుల్లో జరిపే బ్లాస్టింగులకంటే ఎక్కువ ప్రభావాన్ని చూపించిందా అన్న విషయంపై క్లారిటీ రావల్సిన అవసరం ఉంది.
ఆనాటి ఘటన…
మేడారం అడవుల్లో ఆగస్టులో జరిగిన క్లౌడ్ బ్రస్ట్ వల్ల సుమారు లక్ష చెట్ల వరకు నేల కూలిన సంగతి తెలిసిందే. వాటర్ స్పౌట్స్ కూడా ఏర్పడడంతో పాటు ఆ రోజు అక్కడి అడవులు భయానక వాతావరణాన్ని సృష్టించాయి. అయితే ఈ ఘటనకు కారణం ఏంటన్న విషయంపై మాత్రం నేటికీ కూడా స్పష్టత లేకుండా పోయింది. అటవీ శాఖ అధికారులు చెప్తున్న విషయాన్ని బట్టి ములుగు ప్రాంతంలోని నేల సారవంతంతో కూడుకున్నదని, ఇక్కడి వాతావరణం ద్వారా కూడా వృక్షాలు బలంగా ఎదిగేందుకు దోహదపడుతాయని చెప్తున్నారు. దీనివల్ల ఇక్కడ చెట్ల వేర్లు భూమి లోపలి పొరల్లోకి చొచ్చుకపోకపోవడం వల్ల భారీగా వీచిన గాలికి నేల కూలిపోయి ఉంటాయని అంచనా వేస్తున్నామని చెప్పారు. అయితే ఇదే అంశంపై నిపుణుల అంచనాలు మరో విధంగా ఉన్నాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో వచ్చిన రెండు సైక్లోనిక్ సర్క్యూలేషన్స్ మేడారం అడవులపై ఢీ కొట్టుకోవడం వల్ల భారీ వర్షంతో పాటు అత్యంత వేగంతో గాలులు వీయడంతో చెట్లు నేలా కూలిపోయి ఉంటాయని అభిప్రాయపడ్డారు. గత సెప్టెంబర్ 24న హైదరాబాద్ లో జరిగిన వర్క్ షాప్ లో నిపుణులు వెల్లడించిన ఈ అభిప్రాయం ఇలా ఉంటే… అటవీ అధికారులు అంచనాలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ములుగు ప్రాంతంలో సారవంతమైన నేల వల్ల చెట్ల వేర్లు భూమిలోకి విస్తరించలేదని ఈదురు గాలులు వీయడం వల్లే అవి కూలిపోయి ఉండవచ్చని చెప్పారు. ఈ లెక్కన అతి తక్కువ లోతు వరకే విస్తరించిన చెట్లు నేల కూలాడానికి వచ్చిన గాలి వేగానికి, రెండు సైక్లోనిక్ సర్క్యూలేషన్స్ ఢీ కొట్టుకోవడం వల్లే వచ్చే గాలి వేగానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆగస్టు నెలలో ఇక్కడ సంభవించిన ప్రకృతి విపత్తు వల్లే భూమిలోపలి భాగం బలహీన పడడం వల్లే ఇక్కడే భూకంపం వచ్చి ఉంటుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ రెండింటిని పోల్చుకుంటే మాత్రం భీకరమైన గాలులతో కూడిన క్లౌడ్ బ్రస్ట్ ఈ ప్రాంతంలో జరిగి ఉంటుందని భావించాల్సి వస్తోంది.
ఎగువన…
అయితే సింగరేణి బావులు విస్తరించి ఉన్న ప్రాంతంలో కాకుండా సాధారణ అటవీ ప్రాంతంలోనే ప్రకృతి తనలోని వైవిద్యతను ప్రదర్శిస్తోంది. 1969లో భద్రాచలంలో్ భూకంపం రాగా ఇప్పుడు సుమారు 30 నుండి 40 కిలోమీటర్ల ఎగువ భాగన ఉన్న మేడారం అడవుల్లో భూకంపం చోటు చేసుకోవడం గమనార్హం. 1969లో భద్రాచలం ప్రాంతం సింగరేణి ప్రభావిత ప్రాంతం కాకపోగా, ఆగస్టులో క్లౌడ్ బ్రస్ట్ అయిన… తాజాగా భూకంపం సంభవించిన మేడారం అడవులు కూడా కామన్ ఏరియానే కావడం విశేషం. తరుచూ పేలుడు పదార్థాలతో దద్దరిల్లిపోయే సింగరేణి బొగ్గు బావులు ఉన్న ఏరియాలోని భూమి కంటే కూడా మేడారం అటవీ ప్రాంతంలోని భూమి బలహీనపడి ఉంటుందా..? లేక ప్రకృతి విపత్తు తీవ్రత పేలుడు పదర్థాల కంటే వేలాది రెట్ల ఎక్కువగా చూపించి ఉంటుందా అన్న చర్చ స్థానికంగా జరుగుతోంది.
జాయింట్ స్టడీ…
ములుగు జిల్లా మేడారం అటవీ ప్రాంతం కేంద్రీకృతంగా వరసగా జరిగిన ఈ ఘటనలపై ఆయా రంగాలకు చెందిన నిపుణులు స్టడీ చేయాల్సిన అవసరమైతే ఉందని స్పష్టం అవుతోంది. అటు క్లౌడ్ బ్రస్ట్ విషయంలో అయినా ఇటు భూకంపం విషయంలో అయినా భిన్నాభిప్రాయాలు, పొంతన లేని అంచనాలు తెరపైకి వస్తున్నందున శాస్త్రవేత్తలను రంగంలోకి దింపినట్టయితే మరింత లోతుగా అధ్యయనం చేసే అవకాశం ఉంటుంది. గోదావరి పరివాహక ప్రాంతం కూడా కావడంతో భూకంపం తీవ్రత మరింత పెరిగినట్టయితే ప్రాణ, ఆస్తి నష్టాలు కూడా సంభవించే ప్రమాదం ఉన్నందున భూమిలో వస్తున్న మార్పులతో పాటు ఈ ప్రాంతంలోని వాతావరణ సమతుల్యతపై సమగ్రంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.