దిశ దశ, దండకారణ్యం:
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు ఏమైనట్టు..? ఎన్ కౌంటర్ స్థలం నుండి తప్పించుకున్నాడా..? లేక పోలీసుల కాల్పుల్లో గాయపడ్డాడా..? అత్యంత కీలకమైన నాయకత్వం ఉన్నప్పుడు వారికి రక్షణ వలయంగా ఉండాల్సిన భద్రత వ్యవస్థ ఏమైంది..? ఇప్పుడిదే చర్చ సాగుతోంది వివిధ రాష్ట్రాల్లో.
పూజారి కంకేర్…
ఈ నెల 16వ తేది నుండి 18వ తేది ఉదయం వరకు పూజార్ కంకేర్ వద్ద భారీ ఎన్ కౌంటర్ జరిగినట్టుగా బస్తర్ రేంజ్ పోలీసు అధికారులు మీడియాకు సమాచారం ఇచ్చారు. మొదట నలుగురు మావోయిస్టులు చనిపోయారని ఆ తరువాత 17 మంది వరకు మరణించారని ప్రచారం జరిగింది. తెలంగాణ, చత్తీస్ గడ్ సరిహద్దు అటవీ ప్రాంతం అయిన బీజాపూర్ జిల్లా పూజారి కంకేర్ వద్ద మూడు రాష్ట్రాలకు సంబంధించిన మావోయిస్టులు సమావేశం అయ్యారన్న సమాచారం అందుకుని బలగాలకు సెర్చింగ్ ఆపరేషన్ మొదలు పెట్టగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ సమావేశానికి కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాద రావు అలియాస్ చంద్రన్న, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు, సెంట్రల్ మిలటరీ కమిషన్ లో కీలక బాధ్యతల్లో ఉన్న హిడ్మాలతో పాటు మరికొంత మంది ముఖ్య నాయకులు హాజరైనట్టుగా తెలుస్తోంది. స్వీయ రక్షణ చర్యలు తీసుకున్న తరువాతే ఈ భేటీ జరిగినప్పటికి బస్తర్ రేంజ్ పోలీసు అధికారులు అత్యంత కీలకమైన సమాచారం అందుకుని నక్సల్స్ ఏరివేత కోసం స్పెషల్ ఆఫరేషన్ నిర్వహించారు. ఈ ఘటనలో 12 మంది చనిపోగా 10మందిని గుర్తించామని పోలీసు అధికారులు వెల్లడించగా, బడే దామోదర్ చనిపోయాడని సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగా పేరిట ఓ లేఖ విడుదల అయింది. దీంతో శనివారం మద్యాహ్నం నుండి ఈ ఎధురు కాల్పుల ఘటనలో బడే దామోదర్ మరణించాడన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది.
విశ్వసించని వారెందరో..?
పార్టీకి అత్యంత కీలకమైన నాయకులు హాజరైన భేటీ కావడంతో అక్కడ భద్రతా చర్యలు కూడా పకడ్భందీగా తీసుకున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అగ్రనేతల్లో ఒకరైన బడే దామోదర్ మరణించడం అనేది అసాధ్యమన్న వాదనలు వినిపిస్తున్నాయి. బలగాలు ఆ ప్రాంతంలోకి చొచ్చుకుని రావడంతో సెంట్రీలు అప్రమత్తం చేయడంతో భేటీలో ఉన్న ముఖ్య నేతలంతా కూడా అక్కడి నుండి వెల్లిపోయారని వేర్వేరు మార్గాల్లో వీరు సేఫ్ జోన్ లోకి వెల్లిపోయి ఉంటారని బలంగా వాదనలు వినిపిస్తున్నారు. బడే దామోదర్ బంధువులు కూడా ఆయన చనిపోయి అవకాశం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండగా మాజీల్లో కొంతమంది కూడా బ్రతికి ఉండవచ్చనే అంటున్నారు. అయితే సేఫ్టీ జోన్ కు చేరుకున్న తరువాత అగ్రనాయకత్వానికి సమాచారం ఇవ్వడంతో పాటు మీడియాకు వివరంగా ప్రకటన విడుదల చేస్తే తప్ప బడే దామోదర్ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం లేదు. అయితే ఎన్ కౌంటర్ నేపథ్యంలో గాయాల బారిన పడిన కొంతమందిన మావోయిస్టు పార్టీకి చెందిన క్యాడర్ అక్కడి నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించిందని పోలీసు వర్గాలు కూడా చెప్తున్నాయి. గాయపడ్డ వారిలో ఎవరెవరు ఉన్నారన్నదే తెలియాల్సి ఉంది. మరో వైపున గంగా పేరిట విడుదల అయిన లేఖ బూటకమని, కావాలని ఎవరో క్రియేట్ చేశారని గందరగోళం సృష్టించేందుకే ఈ ప్రయత్నం చేసి ఉంటారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
పార్టీ సైలెంట్…
అయితే మావోయిస్టు పార్టీ మాత్రం ఈ ఎన్ కౌంటర్ ఘటనపై ఇంతవరకు మరో ప్రకటన అయితే చేయలేదు. సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగా పేరిట విడుదల అయిన లేఖతో పాటు బడే దామోదర్ గురించి పూర్తి వివరాలు తెలియ జేయకపోవడం వెనక కారణం ఏంటన్నదే అంతు చిక్కడం లేదు. కనీసం గంగా పేరిట విడుదలైన లేఖ తప్పని, అది కావాలనే క్రియేట్ చేశారని కూడా పార్టీ ఎలాంటి ప్రకటన చేయడం లేదు. లేఖ విడుదల అయి 24 గంటలు దాటినా పార్టీ నుండి మాత్రం ఎలాంటి స్పందన రాకపోవడంతో అయోమయం నెలకొంది. దీంతో అసలేం జరిగింది అన్న విషయం తెలియకుండా పోతోందని, పార్టీ నాయకత్వం స్పందిస్తే తప్ప వాస్తవం తెలిసే అవకాశం లేదని అంటున్నారు. అయితే చత్తీస్ గడ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నిఘా వర్గాలు కూడా బడే దామోదర్ చనిపోయినట్టుగా ధృవీకరించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నప్పటికీ పూజారి కంకేర్ అడవుల్లో జరిగిన ఈ ఎన్ కౌంటర్ ఘటనకు సంబంధించి వివరాలను వెల్లడించాల్సింది మావోయిస్టు పార్టీ మాత్రమే. కీకారణ్యంలో జరిగిన ఎదురు కాల్పులపై ఇప్పటికే పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ ఘటనలో బడే దామోదర్ మరణించాడని మావోయిస్టు పేరిటనే లేఖ విడుదల కాగా, ఆయన పార్టీ శ్రేణుల నడుమ సేఫ్ గా ఉన్నాడా లేదా అనేది తేల్చి చెప్పాల్సింది దండకారణ్య జోన్ కమిటీ బాధ్యులే. ఘటనా స్థలం నుండి బడే దామోదర్ తప్పించుకుని వెల్లిన తరువాత క్యాడర్, లీడర్లకు ఇంకా కమ్యూనికేషన్ కాలేదా..? షెల్టర్ జోన్ లో ఉండి బయటకు రాకపోవడంతో కమ్యునికేషన్ మిస్ అయి ఉంటుందా అన్న విషయంపై తర్జనభర్జనలు సాగుతున్నాయి.
ఒక్కడు వెళ్లడమా..?
ఘటనా స్ధలం నుండి బడే దామోదర్ ఒక్కడే వెల్లిపోయే అవకాశం అయితే లేదని తెలుస్తోంది. ఆయన రక్షణగా ఉండే వారిలో ఒకరిద్దరైనా ఆయన వెంట వెల్లే అవకాశం లేకపోలేదు. మరో వైపున అసలు ఆ సమావేశానికి బడే దామోదర్ వెళ్లలేదన్న ప్రచారం ఆదివారం రాత్రి నుండి ఊపందుకుంది. దీంతో ఆయన క్షేమంగానే ఉన్నాడన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అనారోగ్యం బారిన పడిన ఆయన చికిత్స చేయించుకుని ఇటీవలే దండకరాణ్యానికి చేరుకున్నాడని కూడా అంటున్నారు. ఈ నేఫథ్యంలో అనారోగ్యంతో ఉన్న ఆయనను ప్రతికూల పరిస్థితుల్లో సమావేశానికి హాజరు కావాలని నాయకత్వం సూచించే అవకాశమే లేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా పార్టీ అధికారికంగా ప్రకటన విడుదల చేస్తే తప్ప చొక్కారావు విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం లేదు.