దిశ దశ, మంచిర్యాల:
రాష్ట్ర చరిత్రలోనే అత్యంత అరుదైన సంఘటన అక్కడ చోటు చేసుకుంది. ఇద్దరు అగ్రవర్ణ నేతలు బీసీ పల్లవి ఎత్తుకున్న తీరు అన్ని వర్గాల వారిని ఆశ్చర్యంలోకి ముంచెత్తింది. అధికారంలో ఉన్న అగ్రవర్ణ నేతకు వ్యతిరేకంగా అదే వర్గాలకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అగ్రవర్ణ నేతలు ఎత్తుకున్న సరికొత్త పల్లవితో ఆ స్థానంలో బీసీలకు అవకాశం దొరుకుతుందేమోనని కూడా ఆశించారు. కానీ తీరా ఇప్పుడా నినాదం అటకెక్కిందో లేక కావాలనే పక్కనపెట్టారో తెలియదు కానీ అగ్రవర్ణ నేతకే ఓ నేత సానుకూలంగా మారిపోయినట్టుగా కనిపిస్తోంది.
దివాకరునికి చెక్ పెట్టేందుకు…
మంచిర్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే దివాకర్ రావు వ్యవహారశైలిపై వ్యతిరేకత చాలా కాలంగా వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఆయనకు టికెట్ ఇవ్వకూడదన్న డిమాండ్ వినిపిస్తున్నప్పటికీ అక్కడి నాయకులు మాత్రం బాహాటంగా అసమ్మతిని వ్యక్తీకరించలేదు. కానీ ఇటీవల మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యేలు గోనె ప్రకాష్ రావు, అరవింద్ రెడ్డిలు మీడియా ముందుకు వచ్చారు. మంచిర్యాలలో బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని, ఇక్కడ బీసీ సామాజిక వర్గాలు పెద్ద ఎత్తున ఉన్నాయన్నారు. ఈ సారి మంచిర్యాల టికెట్ బీసీలకు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా గెలుస్తారని కూడా మాజీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. అంతేకాకుండా గోనె ప్రకాష్ రావు అయితే బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చినట్టయితే తనకు సంబంధించిన భూమి విక్రయించి మరీ ఆ అభ్యర్థి ఎన్నికల ఖర్చుకు వెచ్చించాలని కోరారు. మరో వైపున గతంలో బీసీలకు టికెట్ ఇప్పించిన చరిత్ర కూడా తమ కుటుంబానికి ఉన్నదని మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి కూడా వ్యాఖ్యానించారు. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు బీసీ పల్లవి ఎత్తుకోవడంతో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా అభ్యర్థిని మార్చుతారేమోనన్న ఊహాగానాలు వచ్చాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ అధినేత మాత్రం మంచిర్యాల అభ్యర్థిని మార్చే విషయంలో నో కాంప్రమైజ్ అన్నట్టుగానే వ్యవహరించారు. దీంతో ఈ ఎన్నికల్లో కూడా దివాకర్ రావే అధికార పార్టీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు.
మారిన అరవిందుడి నినాదం…
అయితే గోనె ప్రకాష్ రావు, అరవింద్ రెడ్డిలు మీడియా ముందు ప్రకటించిన తరువాత ఈ అంశం మరుగునపడిపోయినప్పటికీ తాజాగా మారిన పరిణామాలు సరికొత్త చర్చకు దారి తీశాయి. మంచిర్యాల ఎన్నికల్లో దివాకర్ రావుకు అనుకూలంగా వ్యవహరించాలని బీఆర్ఎస్ అధిష్లానం అరవింద్ రెడ్డిని ఒప్పించింది. పలుమార్లు ఆయనతో సమావేశం కావడంతో ఆయన దివాకర్ రావుకు అనుకూలంగా ప్రకటన ఇచ్చారు. అగ్రవర్ణ నాయకులు బీసీ పల్లవిని నెల రోజుల క్రితం ఎత్తుకున్నప్పటికీ ఇప్పుడు మాత్రం అనుకూలంగా మారిపోయారా అన్న చర్చ సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావుకు సానుకూల ప్రకటన విషయంతో సంబంధం లేకపోయినప్పటికీ ఆయనతో పాటు బీసీ నినాదం ఎత్తుకున్న అరవింద్ రెడ్డి మాత్రం అగ్రవర్ణ అభ్యర్థికి మద్దతు పలకడం గమనార్హం. అయితే మారిన పరిస్థితులపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు ఎలా స్పందిస్తారోనన్న చర్చ సాగుతోంది.