ఎస్ఐబీ ’‘స్పెషల్ ఇంటలీజెన్స్’’ తీరుపై సరికొత్త చర్చ
దిశ దశ, హైదరాబాద్:
ఫోన్ ట్యాపింగ్, సాక్షాల తారుమారు కేసులో పోలీసులు సాంకేతికతను అందిపుచ్చుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం అరెస్ట్ చేసిన డీఎస్పీ దుగ్యాల ప్రణిత్ రావు మొబైల్ ఫోన్లను రిట్రైవ్ చేస్తున్న పోలీసు అధికారులు వాట్సప్ ఛాటింగ్ ను ఎనలైజ్ చేయడం మొదలు పెట్టారు. అయితే హైదరాబాద్ లోని కొన్ని సెగ్మెంట్లతో పాటు ఖమ్మం జిల్లాలో ఒకరు డబ్బుల పంపణి వ్యవహరాలు చూసుకుంటున్నారని ప్రణిత్ రావుకు మెసేజ్ చేశారు. మీడియాలో పనిచేస్తున్న ఒకరు రూ. 3 కోట్ల రూపాయలతో పాటు లారీలను కూడా అరెంజ్ చేసే స్థాయిలో ఉన్నారని, జీఎంఆర్ ఉద్యోగులు టోల్ గేట్లను, చెక్ పోస్టులను పరిశీలిస్తూ డబ్బులు రవాణా చేస్తున్నారని, అంబూలెన్సుల్లో తరలిస్తున్నారని కూడా ఛాటింగ్ చేశారు. పెద్దపల్లి, ములుగు నియోజకవర్గాలకు ఫలనా వ్యక్తి డబ్బులు తరలిస్తున్నారంటూ మెసెజ్ చేశారు. ఇలా తెలంగాణ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఎలా జరుగుతున్నాయి..? ఎవరెవరు తరలిస్తున్నారు…? ఎక్కడికి వెల్తున్నారు అన్న పిన్ పాయింట్ ఇన్ ఫర్మేషన్ షేర్ చేసుకున్నట్టుగా స్పష్టం అవుతోంది. చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేకానందకు సంబంధించిన డబ్బులు కూడా హైదరాబాద్ శివార్లలో ఆయన సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల నుండి రికవరీ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టాలన్న లక్ష్యంతో ఇంటలీజెన్స్, లా అండ్ ఆర్డర్, షాడో టీమ్స్ తో పాటు ఇతర పోలీసు యంత్రాంగాన్ని మించి ఎస్ఐబీ బృందాలు పనిచేసినట్టుగా స్ఫష్టం అవుతోంది. డబ్బు తరలించే వారు, అంగబలం, ఆర్థిక బలం అందించే వారిపై క్షణక్షణం నిఘా వేసిన స్పెషల్ ఇంటలీజెన్స్ బ్రాంచ్ టీమ్స్ ఎప్పటికప్పుడు వారిని కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారు. సాంకేతికతను అందిపుచ్చుకుని ఫోన్ ట్రాకింగ్ చేస్తూ ట్యాపింగ్ కు కూడా పాల్పడిన నేపథ్యంలో ఖచ్చితంగా వారిని నగదుతో పాటు పట్టుకున్న సందర్భాలు ఉంటాయి. ఎన్నికల సమయం కాబట్టి డబ్బులతో దొరికిన వారు కూడా కిమ్మనకుండా డబ్బులు వారికి ముట్టజెప్పి తాము సేఫ్ అయ్యామని జారుకునే సందర్భాలు కూడా లేకపోలేదు. అయితే ప్రణిత్ రావు ఛాటింగ్ ను బట్టి తెలంగాణాలో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నగదు ఎలా రవాణా అవుతుందన్న విషయాన్ని పక్కాగా ట్రేస్ చేసినట్టుగా స్పష్టం అవుతోంది. ఇందులో ఆయా చోట్ల వీరు స్వాధీనం చేసుకున్న నగదు ఏమై ఉంటుందన్నదే అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఎస్ఐబీ టీమ్స్ నగదు రవాణాను గుర్తించడంతో పాటు వార్ రూముల కేంద్రీకృతంగా ఆయా ప్రాంతాల మీదుగా తీసుకెల్తున్న నగదును పక్కాగా స్వాధీనం చేసుకుని ఉంటారన్నది తేటతెల్లం అవుతోంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్ఐబీ ఆపరేషన్లలో పట్టుకున్న నగదు ఎంత..? ఆ డబ్బు ఎక్కడికి చేరింది అన్న విషయం తేలాల్సి ఉంది. ఆ డబ్బును ఎస్ఐబీ ఎర్పాటు చేసుకున్న స్పెషల్ టీమ్స్ రికార్డ్ చేయకుండా దారి మల్లించాయా..? ఇతర పొలిటికల్ పార్టీల అవసరాల కోసం బదిలీ చేశాయా..? లేకపోతే స్పెషల్ ఆపరేషన్లు చేస్తున్నందున గుట్టు చప్పుడు కాకుండా దిగమింగాయా..? అన్నది కూడా వెలుగులోకి రావల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన ఛాటింగను పరిశీలిస్తేనే పెద్ద మొత్తంలో నగదు రవాణాను ఎక్కడికక్కడ ట్రేస్ చేసినట్టుగా స్పష్టం అవుతోంది. ట్రేస్ చేసిన ఈ నగదు ఏ అవసరాల కోసం వినియోగించారన్న విషయంపై కూడా స్పష్టత వస్తే ఎస్ఐబీ ముసుగులో చేసిన అక్రమ వ్యవహారం గుట్టురట్టయ్యే అవకాశం లేకపోలేదు.
అధికారుల ఆదేశాలు..?
డీఎస్పీ ప్రణిత్ రావును పోలీసు విభాగంలోని కీలక బాధ్యతల్లో ఉన్న అధికారులు ఉసిగొలిపి ఉంటారన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కాన్ఫిడెన్షియల్ వింగ్ లో పనిచేస్తున్న ప్రణిత్ రావు కేవలం పొలిటికల్ లీడర్ల చెప్పు చేతల్లోనే ఉండే అవకాశాలు అయితే కనిపించడం లేదు. పై అధికారులకు తెలియకుండా తాను ఇలాంటి దుస్సాహాసానికి పాల్పడితే మొదటికే మోసం వస్తుందన్న భయం ఆయనను ఖచ్చితంగా వెంటాడి ఉంటుంది. తన స్థాయికి… అవసరానికి మించి వ్యవహరిస్తున్న తీరుకు సొంత శాఖలోని బాసుల ఆదేశాలు లేకుండా ప్రణిత్ రావు అంత ధైర్యంగా ముందుకు సాగడం అసాధ్యమని పోలీసు వర్గాలు కూడా చర్చించుకుటున్నాయి.