రక్షణ చర్యలు కరువయ్యాయా..?
గస్తీ చర్యలు ఏమయ్యాయ్..?
దిశ దశ, వేములవాడ:
కోడె మొక్కుల రాజన్న సన్నిధికి చేరుకుంటేనే సకల కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం… భక్తులకు కొంగు బంగారంమై నిలిచే శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణానికి వచ్చే భక్తులకు రక్షణ లేకుండా పోయింది. భక్తుల విషయంలో నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాల్సిన ఆలయ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
సెక్యూరిటీ చర్యలేవి..?
వేములవాడ రాజన్న ఆలయ ప్రాంగణం అంతా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన అధికారులు గస్తీ విషయంలో పట్టించుకోని వైఖరి అవలంభిస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న సంఘటనలు కూడా ఇందుకు ఊతమిస్తున్నాయని చెప్పక తప్పదు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం, ప్రధాన ఆలయం వద్ద సెక్యూరిటీ చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకంగా ఎస్పీఎఫ్ సిబ్బందిని నియమించినప్పటికీ వరస ఘటనలు ఆలయ పరిసరాల్లో జరుగుతున్న బందోబస్తు చర్యలకు సవాల్ విసురుతున్నాయి. సీసీ కెమెరాలు ఉన్నాయన్న ధీమాతో భక్తుల రక్షణ విషయాన్ని విస్మరించారా లేక మరేదైనా కారణమా అన్నది తెలియదు కానీ తరుచూ జరుగుతున్న ఘటనలు మాత్రం దేవాదాయ అధికారుల నిర్లక్ష్యం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.
వరస ఘటనలు…
గత డిసెంబర్ 23న జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చింతలపల్లికి చెందిన లాస్య తన నాలుగేళ్ల కూతురితో కలిసి వేములవాడ రాజన్న ఆలయానికి చేరుకుంది. మానసిక అనారోగ్యానికి గురైన లాస్య రాజన్న క్షేత్రంలో నిద్రించినట్టయితే మానసిక పరివర్తన చెందుతుందన్న నమ్మకంతో ఆమె కుటుంబ సభ్యులు రాజన్న ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయ ప్రాంగణంలో నిద్రిస్తున్న లాస్య వద్ద ఉన్న ఆమె కూతురును అగంతకులు ఎత్తుకెళ్లారు. అనుమానిత వ్యక్తులతో లాస్య కూతురు ఉన్నట్టుగా ఈఓ కార్యాలయం సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు అయినట్టుగా అధికారులు గుర్తించారు. బాధితుల నుండి ఫిర్యాదు అందుకున్న వేములవాడ పట్టణ పోలీసులు నిందితుల ఆచూకి కోసం గాలిస్తున్నారు. రెండు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి నాలుగేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లిన నిందితుల కోసం ఆరా తీస్తున్నామని వేములవాడ పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటన వెలుగులోకి రాకపోగా డిసెంబర్ 25న అన్య మతస్తులు ఆలయ ప్రాంగణంలోకి వచ్చి నాన్ వెజిటేరియన్ పంపిణీ చేసిన ఘటన జరిగింది. యేసు జన్మదిన పురస్కరించుకుని వేములవాడ రాజన్న ఆలయ ప్రాంగణంలో ఉన్న వారికి మాంసాహర ప్యాకెట్లను అందించి వెళ్లిపోయారు. ప్యాకెట్లు ఓపెన్ చేయడంతో అందులో మాంసం ముక్కలు ఉన్న విషయం గమనించిన కొందరు ఆలయ ప్రాంగణంలోనే పడేశారు. ఈ విషయం తెలిసిన విశ్వహిందూ పరిషత్, బీజేపీ నాయకులు రాజన్న ఆలయం వద్దకు వచ్చి వివరాలు సేకరించారు. అన్యమతస్తులు వచ్చి మాంసాహారాన్ని పంచి పెట్టారని వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఆలయంలోని హుండీల్లో చిన్నారులు చేతులు పెట్టి చోరీలకు పాల్పుడుతున్న ఘటనలు అత్యంత సాధారణంగా మారిపోయాయి. చిన్నారులు చోరీ చేస్తున్న విషయాన్ని గమనించిన భక్తులు వారిని పట్టుకుని దేవాలయ ఉద్యోగులకు అప్పగించినట్టు సమాచారం.
SPF ఉన్నా…
వేమలవాడ ఆలయ భద్రత కోసం ప్రత్యేకంగా స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్ ను కూడా నియమించారు ఆలయ అధికారులు. ఒక ఏఎస్ఐతో పాటు మరో 12 మంది ఉద్యోగులు నిరంతరం ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో సెక్యూరిటీ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. వీరికి కొన్ని ఆయుధాలను కూడా దేవాదాయ శాఖ సమకూర్చినట్టుగా తెలుస్తుండగా వీరి వేతనాల పేరిట రూ. 12 నుండి 13 లక్షల వరకు నిధులు వెచ్చిస్తున్నట్టుగా సమాచారం. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకునేందుకు లక్షలాది రూపాయల ధనం ఖర్చు చేస్తున్నా రాజన్న ఆలయంలో సెక్యూరిటీ డొల్లతనం బట్ట బయలు అవుతూనే ఉంది. ఆలయ ఉద్యోగులు చేతివాట ప్రదర్శిస్తున్న సంఘటనలు కూడా సర్వ సాధారణంగా జరుగుతున్నా పట్టించుకునే వారు లేకుండా పోయారన్న విమర్శలు ఉన్నాయి.
అంతా పోలీసులే…
రాజన్న ఆలయంలో అంతర్గత భద్రతా చర్యల కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకున్నా ఫలితం లేకుండా పోతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఇక్కడ తరుచూ సివిల్ పోలీసులు జోక్యం చేసుకోక తప్పని సరిపరిస్థితిగా మారింది. భక్తులతో పాటు రాజన్న ఆలయంలో చోరీలు జరుగుతున్నా పట్టించుకునే పని పోలీసులపైనే పడుతోంది. గతంలో దేవుని కోసం తయారు చేసిన వెండి వస్తువులు కూడా చోరీకి గురి కాగా పోలీసుల విచారణలోనే తేలింది. ఇంత జరుగుతున్న ఎస్పీఎఫ్ సేవలపై సమీక్షించే వారు కరువయ్యారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అటు శాంతి భద్రతలు, ఇటు ఆలయంలో సెక్యూరిటీ చర్యలు చూసుకోవల్సిన భారం అంతా కూడా సివిల్ పోలీసులపైనే వేయడం ఎంత వరకు సమంజసమో ఆలయ అధికారులు గమనించాల్సిన అవసరం ఉంది. లక్షలాది రూపాయలు వేతనాలు ఇచ్చి సెక్యూరిటీ చర్యలు చేపడుతున్నా తరచూ చట్టవ్యతిరేక కార్యకలాపాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఎస్పీఎఫ్ సిబ్బంది గస్తీ చర్యలు ముమ్మరంగా చేసినట్టయితే ఇలాంటి ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విభాగానికి చెందిన సేవలను కేవలం ఆలయ ద్వారాల వద్ద, అడపాదడపా గర్భాలయ పరిసరాల్లో సంచరించేందుకు మాత్రమే పరిమితం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ధర్మగుండంతో పాటు కళ్యాణ కట్ట, క్యూ లైన్లు, ఆలయ ప్రాంగణం అంతా ఎస్పీఎఫ్ సేవలు వినియోగించుకున్నట్టయితే అసాంఘీక కార్యకలాపాలకు తావు ఉండదని అంటున్నారు స్థానికులు. దేవాదాయా ఉన్నతాధికారులు ముందు ఆలయంలో సెక్యూరిటీ చర్యలపై సమీక్ష జరిపి ఎస్పీఎఫ్ యంత్రాంగం సేవలను వీఐపీల సేవలో తరించేందుకు కాకుండా ఆలయ ప్రాంగణంలో గస్తీ కోసం వినియోగించే విధంగా చొరవ తీసుకుంటే బావుంటుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.