ప్రజా భాగస్వామ్యంతో గ్రామ వేదికలు అవసరం
జనశక్తి అగ్రనేత కూర రాజన్న
దిశ దశ, రాజన్న సిరిసిల్ల:
గ్రామీణ ప్రాంతాల్లో భూతగాదాలు పెరిగిపోయిన నేపథ్యంలో వాటి పరిష్కారం కోసం ఆ ప్రాంత ప్రజల భాగస్వామ్యంతో గ్రామ వేదికలు ఏర్పాటు కావలసిన అవసరం ఉందని జనశక్తి అగ్రనేత కూర రాజన్న అభిప్రాయపడ్డారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వ భూములు ధరణీ రికార్డుల్లోకి ఎక్కలేదని, కోటి 20 లక్షల ఎకరాలకు పైగా మిగులు భూములు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో నక్సల్స్ తో చర్చలు జరిగినప్పుడు కోటి 20 లక్షల ఎకరాల మిగులు భూములు ఉన్నాయని తేలిందని అవి ధరణీ రికార్దుల్లోకి ఎక్కలేదన్నారు. నిరుపేదలకు చెందాల్సిన అసైన్డ్, శిఖం, గ్రామ కంఠంతో పాటు ఇతరాత్ర ప్రభుత్వ భూములు ఏమయ్యాయని అడిగారు. భూ సమస్యలను పరిష్కారం చేయాల్సిన రెవెన్యూ, పోలీస్, పొలిటిషియన్లు రియాల్టుగా మారిపోవడంతో గ్రామాల్లో వాస్తవ హక్కు దారుల నుండి భూములు చేజారిపోయే పరిస్థితులు ఎదురయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణీకరణతో గ్రామాల విధ్వంసం చేస్తున్నారని దీనివల్ల గ్రామీణ వ్యవస్థ అంతా కూడా ఛిన్నాభిన్నమై పోతోందని కూర రాజన్న ఆందోళన వ్యక్తం చేశారు. గత చరిత్ర నుండి పాఠాలు నేర్చుకుని మసలుకుంటే భవిష్యత్ ఉంటుందని, ప్రజలే చరిత్ర నిర్మాతలన్న విషయాన్ని గమనించి గ్రామ వేదికలు ఏర్పాటు చేసుకోవల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సంపూర్ణ అధికారం గ్రామ వేదికలకే ఉండేలా 16 ఏళ్ల నుండి పండు ముదసలి వరకు అందరూ వేదికలో సభ్యులుగా ఉండేలా నిర్మాణం చేయాల్సి ఉందన్నారు. తెలంగాణాలోని అన్ని గ్రామాల్లో ఈ వేదికలు భూ సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకోవల్సి ఉందని, అయితే ఈ వేదికల్లో సంపన్న వర్గాలు, భూ స్వాములు కాకుండా నిరుపేదలో సభ్యులుగా ఉండాలని సూచించారు. ప్రజలను కేవలం ఓటర్లుగా చూస్తున్న పాలకవర్గాలు సమస్యల పరిష్కారం కోసం మార్గం చూపించ లేదని, ప్రజలే ముందుకు వచ్చి వాటిని పరిష్కరించకోవల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని కూర రాజన్న అన్నారు.