మెడికోలా… సైకోలా..?

అంతర్గతంగా జరుగుతున్నదేంటీ.?

కేఎంసీపై విమర్శల వెల్లువ

వైద్యులుగా పట్టాలు పొంది సమాజానికి సేవలందించాల్సిన మెడికోలు ఇలా వ్యవహరించడం ఏంటీ..? జూనియర్లు, సీనియర్లు అన్న బేధంతో తక్కువగా చూడడానికి వెనక ఉన్న కారణాలు ఏంటీ..? సంస్కారం నేర్పించాల్సిన సీనియర్లు జూనియర్లపై అజమాయిషీ చెలాయించడం క్రమ శిక్షణగా పరిగణిస్తున్నారా అక్కడ..? అసలేం జరుగుతోందా మెడికల్ కాలేజీలో..?

మసక బారుతున్న చరిత…

గతమెంతో ఘనకీర్తిని మూటగట్టుకున్న వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (కెఎంసీ) నేడు అబాసు పాలు అవుతుండడం విస్మయం కల్గిస్తోంది. ఇందుకు అసలు కారణాలను వెతికి పట్టుకుని అక్కడి నుండే చికిత్స మొదలు పెట్టాల్సిన అవశ్యకత ఉందన్నది నిజం. ర్యాగింగ్ చేయడం అనేది సర్వ సాధారణం కానీ ఆత్మహత్య చేసుకునేంతగా ర్యాగింగ్ చేయాల్సిన అవసరం ఉందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. కెఎంసీలో అసలేం జరుగుతోందన్నదే ఇప్పుడు అందరినీ వేదిస్తున్న ప్రశ్న. అనెస్తీషియా స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తరువాత మరోసారి కెఎంసీ వ్యవహారం తెరపైకి వచ్చింది. సీనియర్లు జూనియర్లకు గైడ్ చేసే విధంగా వ్యవహరించాలి కానీ కమాండ్ చేసే స్థాయికి ఎందుకు చేరిందన్నదే అంతు చిక్కకుండా పోతోంది. సాధారణంగా ఏ మెడికల్ కాలేజీలో అయినా సీనియర్లు జూనియర్లకు కాలేజీ వాతావరణం, ప్రొఫెసర్ల టీచింగ్ స్టైల్ వంటివి వివరిస్తూ గైడ్ లా వ్యవహరిస్తుంటారు. కానీ కెఎంసీలో మాత్రం అరచాకంగా వ్యవహరించడం వెనక ఆంతర్యం మాత్రం అర్థం కాకుండా పోతోంది. గతంలో ఓ సారి జూనియర్లచే టాయిలెట్స్ క్లీన్ చేయించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. అప్పుడే కెఎంసీ సీరియస్ గా సంస్కరణలు చేపడితే పరిస్థితి ఇంతదూరం రాకపోయేదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. స్టడీ మెటిరియల్, డౌట్స్ క్లియర్ చేస్తూ ఆదర్శంగా ఉండాల్సిన సీనియర్లు జూనియర్లను ఆడుకునే విధానం గతం నుండి కెఎంసీలో నడుస్తోందన్న ప్రచారం ఉంది. అయితే కెఎంసీలోపల ఏం జరుగుతోందన్న వాస్తవం మాత్రం బయటకు రావడం లేదన్న వాదనలు కూడా ఉన్నాయి.

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతి

బూతు ఛాటింగ్స్…

కెఎంసీలో కొంతమంది మెడికోలు వ్యవహరిస్తున్న తీరు విమర్శల పాలవుతోంది. బూతు పురాణంతో ఛాటింగ్ చేస్తున్న మెడికోలు కూడా ఉన్నారని వారు చేసే ఛాటింగ్ చూస్తే తాను పీజీ చేయడం మానేయాలనిపిస్తోందని ఓ మెడికో తన సోదరునితో ఆవేదన వ్యక్తం చేశాడు. అన్న తమ్మున్ని ఓదార్చినప్పుడు అసలు విషయం విని షాక్ కు గురయ్యాడనే చెప్పాలి. ఈ బూతు పురాణంతో జరుగుతున్న ఛాటింగ్ మగ వారే కాకుండా ఆడవారూ చేస్తూ టీజింగ్ కు పాల్పడుతున్నారని తెలిసి ఆయన ఆశ్చర్యపోయారట. ఇలా ఇబ్బందు పడుతున్న వారూ కెఎంసీలో ఉన్నారంటే అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు. మాటలతోనూ ఇబ్బందిపెడుతున్న సందర్భాలయితే కోకొల్లలని కూడా తెలుస్తోంది. అయితే ఈ విషయాలన్ని బయటకు చెప్తే తమ కెరీర్ పాడవుతుందని సీనియర్లకే ప్రొఫెసర్లు ప్రాధాన్యత ఇస్తుండడంతో తమ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకుంటాయన్న ఆందోళన జూనియర్ మెడికోల్లో వ్యక్తం అవుతోంది. ఎదురిస్తే తమ మెరిట్ పై ప్రభావం పడుతోందన్న భయంతో చాలామంది జూనియర్ మెడికోలు బయటకు చెప్పుకోలేక, బాధను తట్టుకోలేక కెఎంసీలో కాలం వెల్లదీస్తున్నారని కూడా కొంతమంది చెప్తున్నారంటే అక్కడ ఎలాంటి దయనీయమైన పరిస్థితి తయారైందో గమనించాలి.

అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూరా..?

గతంలో వెలుగులోకి వచ్చిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని కెఎంసీ ఉన్నతాధికారులు ఇలాంటి ఘటనలను నిలువరించేందుకు ఎందుకు చొరవ తీసుకోవడం లేదు..? సీనియర్ మెడికోల ఆదిపత్యానికి అడ్డుకట్ట వేసినట్టయితే ప్రీతి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చేది కాదు కదాని అంటున్నవారూ లేకపోలేదు. ప్రీతి ఘటనతో నిందితుడు సైఫ్ పై పలు సెక్షన్లలో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినప్పటికీ అతను ఆ స్థాయిలో రెచ్చిపోవడానికి కారణాలు ఏంటీ అన్న విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమాజంలోని రోగులకు చికిత్స అందించాల్సిన వైద్య విద్యాలయంలో బీజం పడ్డ ఈ వ్యాధిని సమూలంగా నిర్మూలించాలంటే ముందుగా ఇలాంటి తప్పుడు చర్యలను ప్రోత్సహిస్తున్న వారిపై వేటు వేసే చికిత్స ప్రారంభించాల్సిన అవసరం ఉంది. అలాగే జూనియర్ల జీవితాలతో చెలగాటమాడుకుంటున్న విషయం తెలిసీ పట్టించుకోని కెఎంసీ పెద్దలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవల్సిన ఆవశ్యకత ఏర్పడింది. లేనట్టయితే ముందు ముందు సీనియర్లు ఇష్టారీతిన వ్యవహరించడం పెరిగిపోయి జూనియర్ల ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం సర్వ సాధరణం కానుంది.

You cannot copy content of this page