బూడిద రవాణాలో రూల్స్ బ్రేక్… అసలేం జరుగుతోంది..?

కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల విమర్శలు..?

దిశ దశ, హుజురాబాద్:

ఖమ్మం జిల్లా మీదుగా నిర్మాణం అవుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ యాష్ ప్లాంట్ నుండి బూడిద రవాణా చేస్తున్న   వ్యవహారం చిలికి చిలికి గాలి వానలా మారుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న రెండు విభాగాల మధ్య జరుగుతున్న యాష్ రవాణా వ్యవహారంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నాయకుల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతున్నాయి. అయితే ఈ బూడిద రవాణా విషయంలో అసలేం జరుగుతోంది..? ఆయా పార్టీల నాయకుల ఆరోపణల తీరు ఏంటీ అసలేం జరుగుతోంది అన్న విషయాన్ని గమనిస్తే…

కేంద్ర ప్రభుత్వ సంస్థలే…

మంచిర్యాల నుండి విజయవాడ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ హైవే కోసం వాడుతున్న ముడి సరుకులతో పాటు బూడిద కూడా వినియోగిస్తున్నారు. దీంతో రామగుండంలోని నేషనల్ ధర్మల్ పవర్ కార్పోరేషన్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగిస్తున్న బొగ్గు బూడిదగా మారిన తరువాత దానిని రామగుండం సమీపంలోని కుందనపల్లి యాష్ ప్లాంటుకు తరలిస్తున్నారు. కొన్నేళ్లుగా విద్యుత్ ఉత్పత్తి కారణంగా వచ్చిన బూడిద అంతా కూడా ఈ ప్లాంటులోకి తరలిస్తోంది ఎన్టీపీసీ యంత్రాంగం. అయితే ఈ బూడిదను వినియోగించుకుని రహదదారులు నిర్మించాలని కేంద్ర రహదారుల శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ ప్రాంతం మీదుగానే నిర్మాణం అవుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవేకు ఇక్కడి యాష్ తరలించాలని నిర్ణయించారు. ఇందు కోసం ఆరు ఏజెన్సీలకు ఎన్టీపీసీ కేంద్ర కార్యాలయం అనుమతి ఇవ్వగా ఆయా ఏజేన్సీలు నిత్యం లారీల్లో బూడిదను రవాణా చేస్తున్నారు. అయితే ఎన్టీపీసీతో పాటు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం జరుపుతున్న నేషనల్ హైవే అథారిటీ విభాగాలు రెండూ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనివే కావడం గమనార్హం.

అసలేం జరుగుతోంది..?

అయితే రామగుండం సమీపంలోని ఈ బూడిద ప్లాంటు నుండి బూడిదను తరలించేందుకు ఆరు ఏజెన్సీలు అనుమతులు తీసుకున్నాయి. ఈ ఏజెన్సీలు ముందుగానే లోడ్ చేసే లారీల నంబర్లను ముందుగానే ఎన్టీపీసీ అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. సీఐఎస్ఎఫ్ పర్యవేక్షణలో ఉన్న ఈ యాష్ ప్లాంటు నుండి వెల్లే ప్రతి లారీకి మెయిన్ ఎంట్రన్స్ వద్ద సర్టిఫై చేసిన కాపీ ఇస్తుంటారు. ఈ పేపర్ ద్వారా ఖమ్మం జిల్లాలో నిర్మాణం సాగుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే వద్దకు చేరుకున్న లారీ అన్ లోడ్ చేసిన తరువాత రోడ్ కాంట్రాక్ట్ ఏజెన్సీ నుండి క్లియరెన్స్ ఇస్తారు. అయితే ఇక్కడే బిగ్ ట్విస్ట్ ఏంటంటే..? గ్రీన్ ఫీల్డ్ హైవే కాంట్రాక్టు కంపెనీ తూకాన్ని బట్టి బూడిద తరలించే ఏజెన్సీలకు డబ్బులు చెల్లిస్తుంటుంది. లారీల సామర్థ్యం మేరకే బూడిద తరలించినట్టయితే గిట్టుబాటు కాదని లారీ వాలాలు ముందుకు రాలేదు. దీంతో ఓవర్ లోడ్ అనుమతించేందుకు అటు ఎన్టీపీసీ ద్వారా పర్మిషన్ తీసుకున్న ఏజెన్సీలు సుముఖత వ్యక్తం చేయగా, వెయిమెంట్ ప్రకారం బిల్లు చెల్లించేందుకు గ్రీన్ ఫీల్డ్ హైవే కాంట్రాక్టు ఏజెన్సీ కూడా ఒప్పుకుందని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. దీంతో లారీల యజమానులు స్వేచ్ఛగా యాష్ రవాణా చేయడం ఆరంభించారు. రవాణా శాఖ నిబంధనలకు విరుద్దంగా ఎన్టీపీసీ అధికారులు, గ్రీన్ ఫీల్డ్ హైవే కాంట్రాక్టు కంపెనీలు అధికారికంగా వ్యవహరిస్తున్నాయి. లారీల్లో అనుమతికి రెట్టింపు బూడిదను రవాణా చేస్తున్నా పట్టించుకోకుండా వ్యవహరించాయి ఈ రెండు సంస్థలు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం విధించిన నిబంధనలను ప్రభుత్వ శాఖలు అధికారికంగా తుంగలో తొక్కుతున్నాయన్నది వాస్తవం.

రవాణా శాఖ..?

మరో వైపున రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని రవాణా శాఖ యంత్రాంగం కూడా ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. ఓవర్ లోడ్ కారణంగా రహదారులు విధ్వంసం అవుతాయన్న విషయాన్ని పట్టించుకోకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. చాలా రోజులుగా సాగుతున్న నిబంధనల అతిక్రమణ వ్యవహారాన్ని కట్టడి చేయడంలో రవాణా శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు.

కౌశిక్ రెడ్డి ఎంట్రీ…

అయితే ఓవర్ లోడ్ వ్యవహారంతో పాటు వే బిల్లులు లేకుండా బూడిద అక్రమ రవాణా అవుతోందని హుజురాబాద్ ఎమ్మెల్యే ఆరోపణలు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ లక్ష్యంగా ఆయన వంద కోట్ల స్కాం జరిగిందని విమర్శిస్తున్నారు. అయితే ఇందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కౌశిక్ రెడ్డి విమర్శలను తిప్పి కొడుతున్నారు. పొన్నంపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారు.

అసలు విషయం…

ఇక్కడ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రెండు విభాగాలే నిబంధనలు అతిక్రమిస్తున్న విషయాన్ని మాత్రి ఇక్కడి కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పట్టించుకోకపోవడం విచిత్రం. అధికారికంగా రవాణా శాఖ రూల్స్ ను బ్రేక్ చేస్తున్నారన్న విషయాన్ని పట్టించుకోకుండా పరస్పర ఆరోపణలకు దిగుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రెండు శాఖలు ఓవర్ లోడ్ విధానానికి స్వస్తి పలికాలన్న డిమాండ్ కూడా పక్కనపెట్టేశారు ఇరు పార్టీల నాయకులు. గతంలో ఇదే బూడిద రవాణా విషయంలో బీజేపీ నాయకురాలు రాణి రుద్రమ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఆరోపణలు చేశారు. తాజాగా ఇదే అంశం చుట్టూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు సాగుతున్నాయి.

You cannot copy content of this page