అప్ డేటెడ్ మిషనరీ… ఔట్ డేటెడ్ రాయల్టీ…

గ్రానైట్ పరిశ్రమల తీరు…

దిశ దశ, కరీంనగర్:

మైనింగ్ మాఫియా అక్రమాల కట్టడి చర్యలు సాగుతున్నాయా..? ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారా..? వాస్తవికతకు పొంతన లేకుండా సాగుతున్న వ్యవహారాలపై విజిలెన్స్ చర్యలు చేపట్టడంలో మీనామేషాలు లెక్కించడానికి కారణాలు ఏంటీ..?

గ్రానైట్ పరిశ్రమలతో…

కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన గ్రానైట్ పరిశ్రమల మాటున అసలేం జరుగుతోందన్న విషయాన్ని మైన్స్ అండ్ జియోలాజీ అధికారులు విస్మరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అప్ డేటెడ్ వర్షన్ మిషనరీ వినియోగిస్తున్నప్పటికీ మైనింగ్ విధానాలు మాత్రం ఔట్ డేటెడ్ గానే ఉన్నాయని తెలుస్తోంది. ఆధునిక సాంకేతికత అందిపుచ్చుకుని గ్రానైట్ ప్రొడక్షన్ అవుతోందన్న స్పష్టత ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు చొరవ ఎందుకు చూపడం లేదన్నదే మిస్టరీగా మారింది. పరిశ్రమలకు, క్వారీలకు మధ్య ఉన్న జీరో వ్యాపార లావాదేవీలపై దృష్టి సారించకపోవడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటన్నది అంతు చిక్కకుండా పోతోంది.

అసలేం జరుగుతోంది..?

కరీంనగర్ జిల్లాలోని గ్రానైట్ పరిశ్రమలకు జీరో దందాలో తరలివెల్తున్న రా మెటిరియల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయాల ఆదాయాన్ని కోల్పోతోంది. గతంలో మైనింగ్ అధికారులు పరిశ్రమలకు స్లాబ్ విధానాన్ని అమలు చేశారు. అయితే సింగిల్ కట్టర్ బ్లేడ్ ఉన్న మిషనరీకి నెలకు 16 మీటర్ల గ్రానైట్ కు రాయల్టీ చెల్లించాలని నిర్ణయించారు. ఇప్పటికీ ఇదే విధానంతో మూన్స్ అండ్ జియోలాజీ అధికారులు రాయల్టీ వసూలు చేస్తున్నారు. వాస్తవంగా ఐదేళ్ల క్రితం నుండే ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకున్న పరిశ్రమల యజమానులు కొత్త మిషనరీలను వినియోగిస్తున్నారు. దీంతో వేలాది మీటర్ల రా మెటిరియల్ పరిశ్రమలకు చేరుతుండగా లక్షలాది స్క్వైర్ ఫీట్ల పాలిషింగ్ అయిన గ్రానైట్ మార్కెట్లోకి చేరుతోంది. కానీ ఆయా పరిశ్రమల్లో ఏ జరుగుతోందోనన్న విషయంపై మాత్రం మైన్స్ అండ్ జియోలాజీ విజిలెన్స్ అధికారులు దృష్టి సారించడం లేదు. ఎక్కువ బ్లేడ్ల కట్టర్ మిషనరీలను ఉపయోగిస్తున్న పరిశ్రమల్లో తక్కువ సంఖ్యలో మిషనరీ ఉందని చెప్పి స్లాబ్ విధానం ద్వారా రాయల్టీ కడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సింగిల్ కట్టర్ మిషనరీలు నెలకు 16 మీటర్ల రా మెటిరియల్ ద్వారా 8 వేల నుండి 12 వేల SFTల పాలిషింగ్ గ్రానైట్ వస్తోంది. అయితే వేస్టేజ్ తో ఇతరాత్ర మినహాయింపులు ఇచ్చిన అధికారులు 4,300 SFTల మేర విక్రయించేందుకు అనుమతి ఇచ్చారు. 4,300లను మించి జరిగే ప్రొడక్షన్ అయ్యే గ్రానైట్ లో వేస్టేజ్ పోను మిగతాదంతా కూడా జీరో ద్వారా విక్రయిస్తున్నారని ప్రచారంలో ఉంది. అయితే సింగిల్ కట్టర్ విధానం అనేది గతంలో అమలు చేసినప్పటికీ ప్రస్తుతం ఎక్కువ శాతం కొత్త టెక్నాలజీని అంది పుచ్చుకుని ఏర్పాటు చేసిన పరిశ్రమలు ఉండడం గమనార్హం.

అవి అయితే…

5 బ్లేడ్ల కట్టర్ ద్వారా నెలకు 16 వే నుండి 20 వేల SFT, 10 బ్లేడ్ల కట్టర్ అయితే 30 వేల SFT వరకు, 14 బ్లేడ్ల మిషనరీ అయితే 55 నుండి 60 వేల SFT పాలిషింగ్ గ్రానైట్ ప్రొడక్షన్ అవుతుందని అంచనా. ఆధునిక  సాంకేతికతను అంది పుచ్చుకుని ఏర్పాటు చేసిన ఈ మిషనరీల వల్ల వేస్టేజ్ కూడా తక్కువగా ఉంటుందని, విద్యుత్ వినియోగం కూడా సింగిల్ కట్టర్ విధానానితో పోల్చితే తక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. అయితే చాలా వరకు కూడా బ్లేడ్ల కట్టర్ మిషనరీ తక్కువ సంఖ్యలో ఉన్నాయని చూపిస్తూ సర్కారు ఆదాయానికి గండి పెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. మైన్స్ అండ్ జియోలాజీ అధికారులు స్లాబ్ విధానం ద్వారా పరిశ్రమల నుండి రాయల్టీ వసూలు చేస్తున్నట్టుగా సమాచారం. సింగిల్ కట్టర్ మిషనరీని ప్రామాణికంగా తీసుకుని, ప్రతి నెలకు 16 మీటర్ల రా మెటిరియల్  అవసరం ఉంటుందని అంచనా వేసిన అధికారులు నెలకూ  రూ. 18 వేల రాయల్టీ చెల్లించాల్సి ఉంటుందని నిర్ణయించారు. గ్రానైట్ పరిశ్రమల్లో అప్ డేటెడ్ మిషనరీ వినియోగంలోకి వచ్చినప్పటికీ మైనింగ్ అధికారులు రాయల్టీ వసూలు చేసే విషయంలో మాత్రం ఔట్ డేటెడ్ పద్దతులనే అమలు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే చాలా పరిశ్రమల్లో తక్కువ సంఖ్యలో కటింగ్ బ్లేడ్ల లెక్కలను చూపించి రాయల్టీతో పాటు జీఎస్టీ తగ్గిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక్క 14 బ్లేడ్ల మిషనరీ ద్వారా అయ్యే ఉత్పత్తికి నెలకు సుమారు 104 మీటర్ల వరకు రా గ్రానైట్ మెటిరియల్ వినియోగించుకునే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఈ లెక్కన ఎక్కువ బ్లేడ్లు ఉన్న మిషనరీ నెలకు ఎంత మేర రా మెటిరియల్ వినియోగించే అవకాశం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే చాలా వరకు కూడా తక్కవ సంఖ్యలో మిషనరీ ద్వారానే ప్రొడక్షన్ చేస్తున్నామని చూపిస్తూ తక్కువ రాయల్టీ చెల్లిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనివల్ల ప్రభుత్వం జీఎస్టీ రూపంలో కూడా కోట్లలో ఆదాయాన్ని కోల్పోతున్నట్టుగా స్పష్టం అవుతోంది.

లెక్కలు తేల్చడంలో…

అయితే మైన్స్ అండ్ జియోలాజి అధికారులు మొక్కబడి చర్యలకే పరిమితం అవుతుండడంతో పరిశ్రమల మాటున కూడా సర్కారు ఆదాయం దారి మళ్లుతున్నట్టుగా తెలుస్తోంది. గ్రానైట్ పరిశ్రమల్లో ఉన్న మిషనరీల సామర్థ్యం ఏంటీ..? అక్కడ అవుతున్న ప్రొడక్షన్ వివరాలు ఏమిటీ..? ఆయా పరిశ్రమలు విద్యుత్ బిల్లులు ఎంత చెల్లిస్తున్నాయి..?  తదితర అంశాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసినట్టయితే కరీంనగర్ జిల్లాలో సాగుతున్న గ్రానైట్ జీరో దందా గుట్టు రట్టయ్యే అవకాశం ఉంది. 10 వేల SFT పాలిషింగ్ గ్రానైట్ ప్రొడక్షన్ కావాలంటే దాదాపు రూ. లక్ష వరకూ విద్యుత్ బిల్లు వస్తుందని ఓ అంచనా. విద్యుత్ వినియోగానికి సంబంధించిన బిల్లుల ఆధారంగా రమారమిగా అంచనా వేసినా ఏ స్థాయిలో గ్రానైట్ జీరో దందా సాగుతోందో స్పష్టం అవుతోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

రెండు విధాలుగా…

గ్రానైట్ పరిశ్రమల ద్వారా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రెండు విధాలుగా ఆదాయాన్ని కోల్పోతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. రా మెటిరియల్ వినియోగించుకున్నప్పుడు చెల్లించాల్సిన రాయల్టీ సర్కారు ఖజానాలోకి చేరడం లేదు. తక్కువ సంఖ్యలో గ్రానైట్ బ్లాకులు కొనుగోలు చేస్తున్నామని లెక్కలు చూపుతుండడంతో రాయల్టీ రూపంలో మైన్స్ అండ్ జియోలాజీ విభాగానికి రావల్సిన ఆదాయం రాకుండా పోతోంది. మరో వైపున గ్రానైట్ పాలిషింగ్, కటింగ్ బండలను విక్రయించినప్పుడు 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. జీరో దందా కారణంగా జీఎస్టీ రూపంలో కూడా ఆదాయం తగ్గిపోతున్నట్టుగా స్పష్టం అవుతోంది.

You cannot copy content of this page