మనిషిక్కడ… మనసెక్కడా..?

చెన్నమనేని వ్యాఖ్యలపై చర్చ

వేములవాడ ఎన్నికలపై ప్రభావం…

దిశ దశ, రాజన్న సిరిసిల్ల:

అప్రతిహతంగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్న ఆయనకు అధిష్టానం ఒక్కసారిగా షాకిచ్చింది. గత కొంతకాలంగా ఆయనకు టికెట్ ఇచ్చే విషయంలో నాయకత్వం సానుకూలంగా లేదన్న ప్రచారానికి తగ్గట్టుగానే ఆయన స్థానంలో మరోకరికి టికెట్ ఇచ్చారు. దీంతో ఆయనను మచ్చిక చేసుకునేందుకు అధిష్టానం పెద్దలు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి సఫలం అయినట్టుగానే కనిపించింది. కానీ ఉన్నట్టుండి ఆ నేత విసురుతున్న బాణాలు అందరినీ ఆశ్యర్యంలోకి ముంచెత్తుతున్నాయి.

చెన్నమనేని చెడుగుడు

అయితే జర్మనీలో ఉన్న చెన్నమనేని రమేష్ బాబు స్థానంలో చల్మెడ లక్ష్మీ నరసింహరావు అభ్యర్థిత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ ఖరారు చేసింది. దీంతో ఆయన హుటాహుటిన హైదరాబాద్ చేరుకోగానే ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరిపి క్యాబినెట్ హోదాలో నామినెటెడ్ పదవిని కట్టబెట్టారు. అయితే వేములవాడలో చల్మెడ గెలుపునకు సహకరించాలని కూడా సీఎం సూచించారు. దీంతో అంతా సద్దుమణిగిపోయిందని భావిస్తున్న తరుణంలో చెన్నమనేని రమేష్ బాబు వేములవాడకు వచ్చినప్పటికీ చల్మెడకు అనుకూలత ప్రకటించడంలో అంటీముట్టనట్టుగా వ్యవహరించారు. ఇద్దరు కలిసి ఓ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడంతో ఇద్దరి మధ్య ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా పోయిందని భావించారంతా. కానీ అనూహ్యంగా వేములవాడ నియోజకవర్గంలో తనలోని ఆవేదనను వెల్లగక్కడంతో చెన్నమనేని మానసికంగా మాత్రం ఇబ్బంది పడుతున్నట్టుగా కనిపిస్తోంది. మధ్య మానేరు ప్రాజెక్టు పునరావాసం కల్పించే విషయం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా మంత్రి కేటీఆర్ వైపే అన్నట్టుగా ఉన్నాయి. సిరిసిల్లలో ఉన్నట్టయితే మిడ్ మానేరు బాధితులకు పునరావాసం అందేదని కేటీఆర్ తో కూడా అన్నానంటూ రమేష్ బాబు చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అధినేత రమేష్ బాబును ఒప్పించినప్పటికీ ఆయన మాత్రం ఎమ్మెల్యే పదవికి దూరం కావడం ఇష్టం లేదన్న సంకేతాలనే ఇస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

రెండు చోట్ల ఎఫెక్ట్…

సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు చేసిన వ్యాఖ్యలు రాజన్న సిరిసిల్లలో జిల్లాలో దుమారాన్నే లేపుతున్నాయని చెప్పకతప్పదు. ఆయన ఇలాంటి కామెంట్స్ చేస్తూనే ఉన్నట్టయితే మాత్రం అటు సిరిసిల్లలో ఇటు వేములవాడలో కూడా తీవ్రమైన ప్రభావం పడే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఓటములపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నందున చెన్నమనేని కామెంట్స్ పరంపరకు బ్రేకులు వేసేందుకు అధిష్టానం కూడా ప్రత్యేక చొరవ తీసుకునుందని తెలుస్తోంది.

You cannot copy content of this page