కరీంనగర్ డైరీపై ఆరోపణల వెల్లువ…

దిశ దశ, కరీంనగర్:

పాల ఉత్పత్తి ఎలా చేస్తున్నారు..? పాడి రైతుల నుండి రోజు వారిగా సేకరిస్తున్న పాలు ఎన్ని..? సామర్థ్యానికి అనుగుణంగా డైరీని అభివృద్ది చేశారా..? గేదెల నుండి సేకరించే పాలను శీతలీకరణం చేసేందుకు ప్రత్యేకంగా చిమ్ని ఎందుకు అవసరం ఉంటుంది..? ఇప్పుడివే ప్రశ్నలు కరీంనగర్ వాసులను వెంటాడుతున్నాయి. కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తున్న డైరీ విషయంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సీపీఐ ఫైర్…

కరీంనగర్ మిల్క్ డైరీపై సమర శీల పోరాటానికి శ్రీకారం చుడుతామని సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి వెల్లడించారు. ఉత్పత్తికి అనుగుణంగా డైరీ సామర్థ్యాన్ని పెంచలేదని ఆరోపిస్తున్న ఆయన డైరీలో అసలేం జరుగుతోందో అన్న విషయంపై అధికారులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతుల నుండి సేకరిస్తున్న పాలు ఎన్ని లీటర్లు, అవి డైరీకి చేరిన తరువాత ఎన్ని లీటర్లు అవుతున్నాయి..? ఎలా సాధ్యమవుతోంది అన్న విషయంపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. డైరీ నుండి వెలువడుతున్న కాలుష్యం వల్ల స్థానికులు అనారోగ్యాల బారిన పడుతున్నారని మర్రి వెంకటస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. గర్భిణీలు, చిన్న పిల్లలు పడుతున్న బాధలు వర్ణనాతీతమని, కరీంనగర్ డైరీ సమీప ప్రాంతాల్లోని వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా గమనించాల్సిన అవసరం ఉందని మర్రి వెంకటస్వామి అన్నారు. జిల్లా అధికారులు కరీంనగర్ డైరీ విషయంలో కఠినంగా వ్యవహరించి తనిఖీలు చేయాలని డిమాండ్ చేశారు.

కాలనీ వాసుల ఇక్కట్లు…

కరీంనగర్ డైరీ చుట్టు పక్కల వాసులు పడుతున్న ఇబ్బందులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గతంలోనే కాలుష్య నియంత్రణ విభాగం అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ డైరీ యాజమాన్యం వైఖరిలో మార్పు రావడం లేదని స్థానిక కాలనీ వాసులు అంటున్నారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తూ కెమికల్స్ వినియోగిస్తుండడం వల్లే కాలుష్యం కోరలు చాస్తోందని స్థానిక కార్పోరేటర్ బోనాల శ్రీకాంత్ ఆరోపించారు. స్థానికంగా భూగర్భ జలాల్లో కూడా TDS శాతం తీవ్రంగా ఉందని, సాయంత్రం వేళల్లో డైరీ చిమ్ని నుండి కాలుష్యం వస్తుండడంతో ఆరు బయటకు వెల్లలేన పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు. వృద్దులు, చిన్నారులు ఈ కాలుష్యంతో కంటి సంబంధిత సమస్యలతో పాటు చర్మ వ్యాధుల బారిన పడుతున్నారని బోనాల శ్రీకాంత్ వివరించారు.

cpi నేత మర్రి వెంకటస్వామి కామెంట్స్ కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి

You cannot copy content of this page