కాకతీయ మెడికల్ కాలేజీలో అత్యంత విచిత్రమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయా..? నిభందనలకు విరుద్దంగా అక్కడ విద్యా బోధన సాగుతోందా..? సీనియర్ల గుప్పిట జూనియర్ల భవితవ్యం ఉంటుందంటే దీని వెనక ఏదో మర్మం దాగుందా..? అన్నదే అంతు చిక్కకుండా పోతోంది..
సీనియర్ల ఆధిపత్యం ఏంటీ..?
కెఎంసీలో సీనియర్లు జూనియర్లపై ఆదిపత్యం చెలాయించడం ఏంటన్నదే మిస్టరీగా మారిపోయింది. సూసైడ్ అటెమ్ట్ చేసుకున్న ప్రీతి ఘటనతో అయినా వాస్తవాలు వెలుగులోకి రావడం లేదన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. మెడికల్ కాలేజీలో జరుగుతున్న తంతుకు బ్రేకులు వేయాలంటే మెడికల్ కాలేజీలో వక్ర బుద్ది ప్రదర్శిస్తున్న పెద్దలపై కఠినంగా వ్యవహరించాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటనకు ముందు ప్రీతి తనతో మాట్లాడినప్పుడు సీనియర్లు వేధింపులకు గురి చేస్తున్న విషయాన్ని వెల్లడించిందని ఆమె తండ్రి మీడియాకు వివరించారు. డాడి నువ్వు రాకండి… యూనిఫాం చూస్తే పోలీసులకు చెప్పావా అంటూ అరాచ్ మెంట్ చేస్తారు.. వారి కింద రెండేళ్ల పాటు చదువుకోవాలి, వాళ్ల చేతిలో మార్కులు ఉంటాయి అని వివరించిందన్నారు. అసలు సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు మార్కులు వేసే విధానం ఏంటీ..? ఎక్కడా లేని విధంగా ఈ పద్దతి కెఎంసీలో అమలు చేస్తున్నారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. కేవలం గైడ్ గా వ్యవహరించాల్సిన సీనియర్లు వారిని హిసించడానికి కారణాలు ఏంటన్నదో ఆరా తీయాల్సిన అవసరం ఉంది. కెఎంసీ కంపౌండ్ వాల్ లోపల ఏం జరుగుతుందోనన్న విషయంపై ప్రత్యేకంగా తెలుసుకోవల్సిన అవసరం కూడా ఉందని ప్రీతి ఘటన స్పష్టం చేస్తోంది. గతంలో ఓ సారి ఫిర్యాదు కూడా చేశామని అయితే ఈ విషయంపై ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేయడం వల్ల తీవ్రమైన ఒత్తిడికి గురయ్యానని కూడా ప్రీతి చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. అంటే కెఎంసీలో కొంతమంది సీనియర్లకు వత్తాసు పలికే వ్యవస్థ ఏర్పడిందా లేక..? పెద్ద సార్లకు అనుకూలంగా మారిన వారు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా తయారైందా అన్న విషయం తేలాల్సి ఉంది.
అంతటితో సరిపెట్టారా..?
ఈ ఘటనలో సైఫ్ ను అరెస్ట్ చేయడంతో కథ ముగిసినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. సైఫ్ కు అంత స్వేచ్ఛ ఇచ్చిందెవరూ..? ఆయన ఆమెపై పెత్తనం చెలాయించడానికి కారణం ఏంటీ అన్న విషయాలపై పూర్తి కూపీ లాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని మెడికో పేరెంట్స్ అంటున్నారు. తాను కూడా స్టూడెంట్ అన్న విషయాన్ని మరిచిపోయి ప్రీతిని అంతలా టార్గెట్ చేశాడంటే అతనికి వెన్నుదన్నుగా నిలుస్తున్నదెవరో గుర్తించి వారిపై క్రమశిక్షణ చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు కొంతమంది. లేనట్టయితే ప్రీతి ఘటన మరిచిపోయిన తరువాత కెఎంసీలో పాత కథే పునరావృతం అవుతుందని దీనివల్ల మరికొంతమంది స్టూడెంట్స్ జీవితాలు బుగ్గిపాలయ్యే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం పోలీసులచే పూర్తిస్థాయి దర్యాప్తు చేయించినట్టయితే ఇలాంటి సంఘటనలు రిపిట్ కావని అంటున్నవారే ఎక్కువ.
జూనియర్లు ఎవరూ..?
కెఎంసీలో నెలకొన్న సీనియర్, జూనియర్ జాడ్యం ఓ వ్యాధిలా తయారైనట్టే కనిపిస్తోంది. అంటు వ్యాధిని మరిపిస్తున్న ఈ తీరువల్ల జూనియర్లపై సీనియర్లు పెత్తనం చెలాయించడం.. కొత్తగా చేరే విద్యార్థులపై వారికన్నా ముందు జాయిన్ అయిన వారు ఆదిపత్యాన్ని ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తున్నట్టుగా కనిపిస్తోంది. 2021లో కూడా జూనియర్లచే టాయిలెట్స్ క్లీన్ చేయించిన వీడియోలు వైరల్ అయ్యాయి. అంటే గతంలో కూడా జూనియర్లపై అజమాయిషీ చెలాయించినట్టుగా స్సష్టం అవుతోంది. కాబట్టి జూనియర్లను వేధింపులకు గురి చేసే విధానం ఆనవాయితీగా వస్తున్నందున ముందుగా ఈ పద్దతిని పెంచిపోషిస్తున్న కెఎంసీలోని కొంతమంది పెద్దలపై కఠినంగా వ్యవహరించాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
మత్తు వదిలించాల్సిందే…
సాధారణంగా సర్జరీలు చేయాల్సిన పేషెంట్లకు మత్తు ఇచ్చి చికిత్స అందించే పద్దతి అమలవుతోంది. కానీ కెఎంసీలోని అనెస్తీషియా విభాగంలోని కొంతమంది సహజసిద్దంగానే మత్తులో కూరకపోయి విచక్షణ మరిచి వ్యవహరిస్తున్నట్టుగా స్ఫష్టం అవుతోంది. కాబట్టి జూనియర్లను అరాచ్ చేసే మత్తులో తూగుతున్న వారి మత్తు వదిలించేందుకు చట్టాలకు వెంటనే పనిచెప్పాలన్న డిమాండ్ వినిపిస్తోంది.