గజ్వేల్ ఎన్నికల్లో వైవిద్యమైన పరిస్థితులు
దిశ దశ, సిద్దిపేట:
రాష్ట్రంలోనే అత్యంత ప్రాధాన్యత ఉన్న నియోజకవర్గాల్లో ఆ స్థానం మొదటగా గుర్తుకువస్తుంది. అత్యంత కీలకమైన వ్యక్తి అక్కడి నుండి ప్రాతినిథ్యం వహిస్తుండడంతో ఎన్నికలు వచ్చాయంటే చాలు ఆ నియోజకవర్గానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడి నుండి అసెంబ్లీలోకి అడుగుపెడుతున్నందున ఈ స్థానానికి ప్రత్యేతక నెలకొంది.

ప్రత్యర్థి… అనుచరుడిగా…
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం అంటే తెలియని వారు ఉండరు. ఈ సారి కూడా ఇక్కడి నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు. 2014 ఎన్నికలప్పటి నుండి కూడా ఇక్కడ రసవత్తర పోరు సాగుతోంది. ఉద్యమనేత కేసీఆర్ పై రెండు ఎలక్షన్లలోనూ ప్రత్యర్థిగా పోటీ చేసిన వొంటేరు ప్రతాప్ రెడ్డి, గులాభి శ్రేణులకు మధ్య ప్రచ్ఛన్న యుద్దమే జరిగింది. అత్యంత బలమైన రాజకీయ శక్తి అయిన కేసీఆర్ పై పోటీ చేయడం అంటే సాహసం చేయడమేనని చెప్పాలి. 2014లో టీడీపీ తరుపు పోటీ చేసిన వొంటేరు ప్రతాప్ రెడ్డి 34.12 శాతంతో 67,303 ఓట్లు సాధించారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ 44.06 శాతంతో 86,694 ఓట్లతో మొదటి స్థానంలో నిలిచారు. 2018 ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ 60.45 శాతంతో 1,25,444 ఓట్లతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కూడా కేసీఆర్ ప్రత్యర్థిగా పోటీలో నిలిచిన వొంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరుపున బరిలో నిలిచారు. ఆయన 32.36 శాతంతో 67,154తో సరిపెట్టుకోవల్సి వచ్చింది. అయితే 2018 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటమే లక్ష్యంగా ఊరు వాడ కలియతిరుగుతూ వొంటేరు ప్రతాప్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. ఒగ్గుకథ బృందాలచే కూడా ప్రత్యేకంగా ప్రచారం చేసి అక్కడి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ సానుకూల ఫలితం మాత్రం అందుకోలేకపోయారు. కానీ ఎన్నికల సమయంలో మాత్రం ప్రచ్ఛన్న యుద్దాన్ని మరిపించినట్టుగానే ఇక్కడ ప్రచార సరళి సాగింది. మంత్రి తన్నీరు హరీష్ రావు ఇంఛార్జిగా వ్యవహరించిన గజ్వేల్ లో ఎన్నికల సమయంలో తనను ఎన్నో రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నాడంటూ వోంటేరు ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో ఓటమి పాలైన తరువాత ప్రతాపరెడ్డిపై సానుభూతి కూడా పెద్ద ఎత్తున వ్యక్తం అయింది. కానీ అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామాలతో వొంటేరు కాంగ్రెస్ జెండా వీడి గులాభి జెండా ఎత్తుకున్నారు. ఆ తరువాత ఆయనకు నామినేటెడ్ పదవి ఇవ్వడం ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రధాన అనచరుల్లో ఒకరిగా మారిపోవడం జరిగిపోయింది. దీంతో ఈ సారి ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీ చేసే ప్రత్యర్థి ఎవరన్న చర్చ ఊపందుకుంది.

అనచరుడు… ప్రత్యర్థి అవుతారా..?
ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీ చేసేందుకు తాను ఆసక్తిగా ఉన్నానంటూ హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ పదే పదే చెప్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటమే లక్ష్యంగా తాను బరిలో నిలుస్తానంటూ వ్యాఖ్యానిస్తున్నారు. 2018 ఎన్నికల వరకూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన అనుచరుడిగా ఉన్న ఈటల రాజేందర్ ఆ తరువాత జరిగిన పరిణామాలతో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోవల్సి వచ్చింది. హుజురాబాద్ లో ఉప ఎన్నికలు కూడా అనివార్యంగా మారడం, మళ్లీ ఈటల గెలవడం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈటల రాజేందర్ తన నియోజకవర్గంలోని బీజేపీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు చేసిన వ్యాఖ్యలు ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. ‘‘ అక్కడా పోటీ చేస్తా… ఇక్కడా పోటీ చేస్తా’’ మీరే కథనాయకులై నన్ను గెలిపించాలి అని ఈటల పిలుపునిచ్చారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఈటల పోటీ చేస్తారన్న అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ ఎన్నికల్లో తాను రెండు చోట్లా పోటీ చేస్తానన్న సంకేతాలను ఇవ్వడమే కాకుండా సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తానంటూ ఆయన పరోక్షంగా చేసిన వ్యాఖ్యలతో మరోసారి గజ్వేల్ ముఖ చిత్రాన టఫ్ వార్ నడవనుందా అన్నదే ఆసక్తి కరంగా మారింది. ఒకవేళ ఈటల రాజేందర్ గజ్వేల్ నుండి పోటీ చేస్తే ఎన్నికల ప్రచారంలో వైవిద్యమైన పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్రత్యర్థిగా ఉన్న ప్రతాప్ రెడ్డి అనుచరుడిగా ప్రచారం చేయనుండగా, అప్పుడు అనుచరుడిగా ఉన్న ఈటల రాజేందర్ ఇప్పుడు ప్రత్యర్థిగా కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించే అవకాశాలు ఉన్నాయి. ఇదే నిజమైతే గజ్వేల్ లో ఈ ఎన్నికల్లో రసవత్తరమైన పోరు జరగడం ఖాయం.