అభిలాష్ మిస్సింగ్ మిస్టరీతో వెలుగులోకి వస్తున్న అంశాలు…
జ్యోతిష్మతి కాలేజీ తీరుపై సర్వత్రా విమర్శలు…
దిశ దశ, మానకొండూరు:
జ్యోతిష్మతి కాలేజీ ఆవరణలో ఉన్న హాస్టళ్ల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాలేజీ యాజమాన్యం తీసుకుంటున్న చర్యల డొల్లతనం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థుల జీవితాలు ఎలా ఉండబోతాయోనని తల్లిదండ్రులు డోలాయమానంలో కొట్టుమిట్టాడే పరిస్థితి నెలకొంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామెరకుంటకు చెందిన అభిలాష్ ఈ కాలేజీలోనే డిప్లోమా ఫస్ట్ ఈయర్ చదువుతున్నాడు. మార్చి1న అదృశ్యం అయిన ఆ స్టూడెంట్ 27 రోజలు వరకూ శవమై తేలినా కూడా కాలేజీ యాజమాన్యం పట్టించుకోకపోవడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాలేజీలో విద్యార్థుల రక్షణ చర్యలు తీసుకోవడంలో యాజమాన్యం విఫలం చెందిందని సాక్షాత్తు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా కామెంట్ చేశారంటే ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మరోవైపున వార్డెన్ మీడియా ముందుకు వచ్చి చెప్పిన విషయాలను పరిశీలిస్తే కూడా జ్యోతిష్యతిలో నెలకొన్న పరిస్థితులు వెల్లడిస్తున్నాయి. కాలేజీ హాస్టల్ విద్యార్థులు బయటకు వెల్లే విషయం అభిలాష్ ఘటనతోనే వారి దృష్టికి వచ్చిందని వార్డెన్ వివరించారు. ఈ కాలేజీ స్టూడెంట్స్ రాత్రి 10 గంటల తరువాత బయటకు వెల్లి సిగరెట్లు తాగడం, గంజాయి తీసుకోవడం గురించి అభిలాష్ అదృశ్యంతోనే వెలుగులోకి వచ్చిందని వార్డెన్ చెప్పారు. ఈ ఘటన తరువాత ఆరా తీస్తే అసలు విషయాలు తెలిశాయని కూడా ఆయన వెల్లడించారు. అంటే కాలేజీ ఆవరణలో ఉన్న హాస్టళ్లలో ఉండాల్సిన స్టూడెంట్స్ ఎటు వెల్తున్నారోనన్న విషయం ఇంతవరకూ వార్డెన్ కు కూడా తెలియలేదని చెప్తున్నారంటే హాస్టల్ విద్యార్థుల గురించి వారికి ఎలాంటి శ్రద్ద ఉందో గమనించాల్సిన అవసరం ఉంది. కాలేజీలో క్లాసులు ముగిసిన తరువాత హాస్టల్ లో ఉండాల్సిన స్టూడెంట్స్ బయటకు వెల్తున్న విషయమే తెలియలేదంటే వారి అడ్మినిస్ట్రేషన్ ఎలా కొనసాగుతోందో అర్థం చేసుకోవాలి. ప్రధానంగా ఇదే కాలేజీ ఆవరణంలో గర్ల్స్ హాస్టల్ కూడా ఉన్నందున పకడ్భందీ చర్యలు తీసుకోవల్సిన అవసరం అయితే ఉంటుంది. టీనేజ్ కి చేరిన విద్యార్థులు కాబట్టి వారిని కట్టడిగా ఉంచనట్టయితే ఇబ్బందులు తలెత్తే ప్రమాదం కూడా లేకపోలేదన్నది వాస్తవం. మరో వైపున హాస్టల్స్ వద్ద ప్రత్యేకంగా సెక్యూరిటీ గార్డ్స్ ను ఏర్పాటు చేయడం లేదన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. వార్డెన్ చెప్పిన విషయాన్ని పరిశీలిస్తే మాత్రం హాస్టల్ స్టూడెంట్స్ స్వేచ్ఛగా బయటకు వెల్లి వస్తుంటారని స్ఫష్టమవుతోంది. రాత్రి వేళల్లో స్టూడెంట్స్ బయటకు వెళ్లకుండా ప్రత్యేకంగా సెక్యూరిటీ గార్డ్స్ ను ఏర్పాటు చేయడంలేదా లేక సెక్యూరిటీ గార్డులు ఉన్నా కూడా వారిని కట్టడి చేయలేకపోతున్నారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. మరోవైపున హాస్టల్ స్టూడెంట్స్ స్టడీ హావర్స్ ఎప్పటి వరకు ఉంటాయి..? విద్యార్థులు ఎప్పటి వరకు చదువుకోవాలి..? వీరికి సబ్జెక్టుల్లో వచ్చే డౌట్స్ క్లారిఫై చేసేందుకు వార్డన్ కానీ ఫ్యాకల్టీ కానీ అందుబాటులో ఉంటారా లేదా అన్న విషయాలపై కూడా దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉంది. హాస్టల్ లో 24 గంటల పాటు ఎవరో ఒకరు డ్యూటీలో ఉండడంతో పాటు నైట్ డ్యూటీలో వార్డెన్లు కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. కానీ జ్యోతిష్మతి హాస్టల్ లో మాత్రం రాత్రి 10 దాటితే అలాంటి చర్యలు ఏమీ తీసుకోనట్టుగా వార్డెన్ చెప్తున్న విషయాలు వెల్లడిస్తున్నాయి.
ఇన్వెస్టీ ‘‘గ్రేటర్స్’’..?
మరో వైపున అభిలాష్ శవమై తేలిన తరువాత కాలేజీ యంత్రాంగం కూడా దర్యాప్తులో జోక్యం చేసుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం గురించి పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీస్తున్న క్రమంలో కాలేజీ యంత్రాంగం విద్యార్థులను పిలిపించి ఇంటారాగేషన్ చేస్తున్న తీరు కూడా విమర్శలకు దారి తీస్తోంది. అయితే అభిలాష్ మిస్సయిన తరువాత దాదాపు 24 గంటల వరకు కాలేజీ యాజమాన్యం స్పందిచలేదు. అతని పేరెంట్స్ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసిన తరువాత అభిలాష్ కోసం గాలిస్తున్న అతని కుటుంబ సభ్యుల పట్ల కనికరం చూపించలేదు. కనీసం వారిని కాలేజీ ఆవరణలోకి కూడా రానివ్వకుండా అడ్డుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరో వైపున అభిలాష్ డెడ్ బాడీ ట్రేస్ అయిన తరువాత కూడా కాలేజీ లో ఫెస్టివల్ నిర్వహించుకున్నారు కానీ తమ వద్ద చదివే విద్యార్థి కదా అని ఫంక్షన్ రద్దు చేసి అతనికి సంతాపం తెలిపే ప్రయత్నం కూడా చేయలేదు. పోలీసులు అభిలాష్ మిస్సయాడన్న ఫిర్యాదు అందుకున్నప్పటి నుండి అతని సీడీఆర్ డాటా సేకరించడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో అభిలాష్ విషయంలో ఎంట్రీ ఇచ్చిన కాలేజీ యంత్రాంగం కొంతమంది స్టూడెంట్స్ పై మర్డర్ మీరే చేశారంటూ ఒత్తిళ్లకు గురి చేయడం వెనక ఆంతర్యం ఏంటన్నదే పజిల్ గా మారింది. మార్చి 1న మిస్సయిన అభిలాష్ 27న శవమై తేలే వరకూ కూడా తమకేమీ పట్టనట్టుగా వ్యవహరించిన కాలేజీ నిర్వాహకులు ఇప్పుడు పోలీసులను మించిన దర్యాప్తు చేస్తుడడం వెనక ఉన్న కారణం ఏంటీ..? అనుమానస్పద మృతిగా భావిస్తున్న ఈ ఘటనపై పోలీసులు వివిధ కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో కాలేజీ యాజమాన్యం పోలీసుల దర్యాప్తునకు సపోర్ట్ గా నిలబడాలి కానీ వారే ఇన్వెస్టిగేషన్ లో జోక్యం చేసుకుంటుండం వెనకున్న ఆంతర్యం ఏంటీ అన్నది మరో మిస్టరీగా మారింది. అభిలాష్ మిస్సింగ్… మరణం అంశాలు తమ కాలేజీపై పడకూడదన్న కారణంతో యంత్రాంగం దూకుడు ప్రదర్శిస్తోందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. కానీ మిగతా స్టూడెంట్స్ ను ఒత్తిళ్లకు గురి చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటోనన్నది వారికే తెలియాలి. పోలీసులు దర్యాప్తులో భాగంగా స్టూడెంట్స్ ను పిలిచి ప్రశ్నించినప్పుడు ఈ కేసులో వారి ప్రమేయం ఎంత మేర ఉంది అన్న విషయాన్ని ఇట్టే రాబట్టగలుగుతారు. కానీ వీరు ఎందుకు అతి జోక్యం చేసుకుంటున్నారోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. హాస్టల్ స్టూడెంట్స్ భద్రత విషయంలో ఇంతకాలం పట్టించుకోకుండా ఇప్పుడు విద్యార్థులను వెంటాడుతున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.