దిశ దశ, హైదరాబాద్:
విప్లవోద్యమ ప్రస్థానంలో దశాబ్దాల పాటు కొనసాగిన ప్రజా యుద్ద నౌక గద్దర్ అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో రాసిన లేఖలు వైరల్ అవుతున్నాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన చివరి సారిగా రాసిన లేఖలో ఆయన తన ఆరోగ్యం గురించి ప్రజలకు వివరించాలని జులై 31న ఆసుపత్రి ఎండీకి, ప్రజలకు రాసిన లేఖల పూర్తి పాఠం…
గౌరవ నీయులైన
ఛైర్మన్, ఎండీ,
అపోలో స్పెక్ట్రమ్ అమీర్ పేట గారికి…
అన్నయ్య..!
నా ఆరోగ్య పరిస్థితిని పత్రికా ప్రకటనల ద్వారా నా ప్రజలకు తెలపాలని విజ్ఞప్తి…
నా పేరు గుమ్మడి విఠల్, నా పాట పేరు ‘గద్దర్’ బతుకే నా పోరాటం, నా వయసు 76 ఏండ్లు, నా వెన్నుపూసలోని తూటా వయసు 25 ఏండ్లు, ఇటీవల 350 కిలో మీటర్ల పాదయాత్రలో పాల్గొన్నాను. ‘జనం గుండెల చప్పుడు’ ఎందుకో గాయం అయింది. ఈ గాయం చికిత్సకై మన దవాఖానలో చేరాను. 20.07.2023 నేటి వరకు చికిత్స పొందుతున్నాను. ‘ప్రజల పాటకు’ మా ప్రాణం అని మాట ఇచ్చిన మీకు నా కోట్లాది ప్రజల తరుపున వందనాలు. నా ఆరోగ్య పరిస్థితిని గురించి ప్రజలకు పత్రికా ప్రకటనల ద్వారా తెలియజేయగలరు.
ఇట్లు
గద్దర్,
గాయపడిన ప్రజల పాట
ప్రజలకు రాసిన బహిరంగ లేఖలో…
పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మద్దతుగా ‘‘మా భూములు మాకే’ అన్న నినాదంతో పాదయాత్రలో పాల్గొన్నానని, జులై 20 నుండి ఇప్పటి వరకు అన్ని రకాల పరీక్షలు, చికిత్స చేయించుకుంటూ కుదుటపడుతున్నానని, పూర్తి ఆరోగ్యంతో కోలుకున్న తరువాత తిరిగి మీ మధ్యకు వచ్చి సాంస్కృతిక ఉద్యమం తిరిగి ప్రారంభించి ప్రజల రుణం తీర్చుకుంటానని మాట ఇస్తున్నాను అంటూ రాశారు. నా యోగ క్షేమాలు విచారించడానికి అపోలో స్పెక్ట్రా హస్సిటల్, అమీర్ పేటకు ఫోన్ చేసి సందేశాలు పంపాలని కూడా గద్దర్ కోరారు.
అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో కూడా గద్దరి తిరిగి ప్రాణాలతో బయటపడి సాంస్కృతిక ఉద్యమానికి మళ్లీ జీవం పోస్తానంటూ రాయడం గమనార్హం. ఆసుపత్రి వైద్యులు తనకు అందిస్తున్న చికిత్స ద్వారా తాను క్షేమంగా బయటపడుతానన్న నమ్మకం గద్దర్ లో బలంగా ఉన్న అంతకన్న బలంగా మృత్యువు ఆయన్ని బలి తీసుకుంది. వారం రోజుల క్రితం ధృడ సంకల్పంతో లేఖ రాసిన బలమైన శక్తి ఆగస్టు 6న తిరిగి రాని లోకాలకు చేరుకుంటుందని కూడా ఎవరూ నమ్మలేకపోయారు. కానీ ఆయన మరణించాడని తనయుడు సూర్యం చేసిన ప్రకటనతో సమాజమంతా దిగ్భ్రాంతికి గురైంది.
Disha Dasha
1884 posts
Next Post